టీచర్లేరీ..?  (కర్నూలు)

Date:08/10/2018
కర్నూలు  ముచ్చట్లు:
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏటికేడు విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కానీ విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు ఉపాధ్యాయులను నియమించడంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో మార్పులు చేసినప్పటికీ ఆశించినమేర ఫలితం దక్కడం లేదు. పలు విద్యాలయాల్లో సబ్జెక్టు నిపుణుల కొరత ఉన్నా భర్తీ చేయడంలో నిర్లక్ష్యం కొట్టుకొస్తున్నట్లు కనపడుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు అవసరమైన స్థానాలకు విద్య వలంటీర్ల నియామకానికి చర్యలు చేపట్టలేదు. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.
జిల్లావ్యాప్తంగా 4 లక్షల మందికిపైగా విద్యార్థులు ఉండగా కేవలం 14 వేల మంది ఉపాధ్యాయులు ఉండటం సమస్య తీవ్రతకు దర్పణం పడుతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలన్న నిబంధన క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదు. ఒక్కో ఉపాధ్యాయుడు రెండు, మూడు సబ్జెక్టుల అదనంగా బోధించాల్సివస్తోంది. ఈ పరిస్థితి ఆదోని, డోన్‌ డివిజన్లలో అధికంగా ఉంది. తక్కువ విద్యార్థులున్న పాఠశాలల నుంచి సబ్జెక్టుకు సంబంధించి అర్హులైన మిగులు ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేసినప్పటికీ మూరుమూల ప్రాంతాల్లో అమలు కాలేదు. హైసూళ్లకు ఇంకనూ 200 మంది సబ్జెక్టు నిపుణులు అవసరమని అధికారిక లెక్కలు  చెబుతున్నాయి.
అవసరం ఉన్నచోట ఉపాధ్యాయులు ఉండరన్నది విద్యాశాఖకు అతికినట్లు సరిపోతుంది. బదిలీల ప్రక్రియలో ఉపాధ్యాయులకు ఉన్న వెసులుబాటు విద్యార్థుల భవితకు ప్రతిబంధకంగా మారుతోంది. సాధారణంగా నగర సమీప పాఠశాలల్లో పనిచేసేందుకు ఉపాధ్యాయులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడి బడుల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా టీచర్లు అవసరానికి మించి పనిచేస్తున్న విషయం తెలిసిందే. కానీ..మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సరిహద్దు గ్రామాల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన  చెందుతున్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
Tags:Ticarleri ..? (Real Estate)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *