దుర్గమ్మ సన్నిధిలో టిక్కెట్ల కుంభకోణం

Date:06/02/2019
విజయవాడముచ్చట్లు :
దుర్గగుడి దర్శనం టికెట్ల కుంభకోణంలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టికెట్ల భాగోతం బయట పడటం ఇదే ప్రథమం కాదని, గతంలో  పలుమార్లు టికెట్ల కుంభకోణాన్ని గుర్తించినా  పూర్వపు ఈవోలు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. తాజా ఉదంతంలో కేవలం కౌంటర్‌లో టికెట్లను విక్రయించిన సిబ్బందే కాకుండా, టికెట్లను స్కానింగ్ చేసే సిబ్బందితో పాటు త్రిలోక్ సంస్థకు చెందిన ఐటీ టెక్నీషియన్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. తాజా ఘటనపై దుర్గగుడి ఈవో వి. కోటేశ్వరమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు సమాచారం.దుర్గగుడి ఘాట్ రోడ్డుతో పాటు మహా మండపం వద్ద రూ. 300, రూ.100 టికెట్లు విక్రయించే కౌంటర్లను త్రిలోక్ సంస్థ నిర్వహిస్తోంది.
శనివారం మధ్యా హ్నం ఘాట్ రోడ్డులోని కౌంటర్ నుంచే టికెట్లను విక్రయించినట్లు ఆలయ ఈవో విచారణలో బయటపడి నట్లు తెలుస్తోంది. కేవలం ఘాట్ రోడ్డులోని కౌంటర్లోనే ఈ తరహా అక్రమాలకు పాల్పడ్డారా, లేక మిగిలిన కౌంటర్లలోనూ ఈ తరహా అక్రమాలు జరిగాయా అనే దిశగా విచారణ జరుగుతున్నట్లు సమాచారం.కేవలం కౌంటర్‌లో టికెట్లు విక్రయించిన సిబ్బంది పాత్ర మాత్రమే ఉందనుకునే వీలులేదని పలువులు వ్యాఖ్యానిస్తున్నారు. కౌంటర్‌లో విక్రయించిన టికెట్లను అమ్మవారి ఆలయం చిన్న గాలి గోపురం వద్ద ఉన్న స్కానింగ్ కౌంటర్ వద్ద స్కాన్ చేశారు. ప్రతి కార్డుకు ఇచ్చిన బార్‌కోడ్ స్కాన్ చేసినప్పుడు కంప్యూటర్లో ఆ కార్డు వివరాలు పోలుస్తాయి. స్కానింగ్‌లోని సిబ్బంది ఈ విషయాన్ని గమనించలేదా, లేక స్కానింగ్ కౌంటర్‌లో సిబ్బంది టికెట్ల విషయం తెలిసి కావాలని తప్పించారా? అనేది తేలాల్సి ఉంది.
కౌంటర్‌లో పని చేసే సిబ్బంది, టికెట్లు స్కానింగ్ చేసే సిబ్బంది ఇద్దరు త్రిలోక్ వారు నియమించిన వారు కావడంతో ఇటువంటి అక్రమాలు బయటకు రావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.రూ. 100, రూ.300 టికెట్ల యాక్సిస్ కార్డులపై ముద్రించే బార్ కోడ్ కింద సీరియల్ నంబర్ సృష్టంగా లేకపోవడమే అక్రమాలకు ఆస్కారం కల్పించిందన్న విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి యాక్సెస్ కార్డుకు ఒక గుర్తింపు నంబర్ ఉంటుంది. యాక్సెస్ కార్డుపై ముద్రించే బార్ కోడ్ కింద ఆ రోజు విక్రయించిన టికెట్ల సీరియల్ నంబర్‌ను ముద్రిస్తారు.అయితే టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు యాక్సిస్ కార్డుపై ఉన్న నంబర్‌ను మాత్రమే గమనిస్తుంటారు. అయితే ఇదే చీటిపై చిన్నవిగా ఉన్న సీరియల్ నంబర్ కింద మరో మారు తేదీ, నెల, ఏడాదిని కూడా ముద్రిస్తున్నారు.
ఈ సీరియల్ నంబర్లను గుర్తించ వీలు లేకపోవ డంతో అక్రమాలను అటు భక్తులు కానీ, ఆలయ అధికారులు గానీ గుర్తించే అవకాశం లేకుండా పోతోంది.రూ. 100, రూ. 300 టికెట్ల కౌంటర్లను నిర్వహించే బాధ్యత ఇక దేవస్థానం తీసుకోనున్నట్లు సమాచారం. టికెట్ల కుంభకోణం బయట పడిన వెంటనే ఆలయ ఈవో వి. కోటేశ్వరమ్మ త్రిలోక్ అధికారులతో సమావేశమై వెంటనే కౌంటర్ల నిర్వహణ నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం.భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఒకటి రెండు రోజులలో నగదు లెక్కల వివరాలను దేవస్థానానికి అప్పగించిన తర్వాత కౌంటర్లలో వ్యవహారం తేలే అవకాశాలు ఉన్నాయి.
Tags:Ticket scandal in Durgamma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *