తిలాపియా చేపల పెంపకం ఫై అమెరికా,ఏపి అవగాహన ఒప్పందం

Date:18/09/2018
అమరావతి ముచ్చట్లు:
రాష్ట్రంలోని జలాశయాలలో కేజ్ కల్చర్ ద్వారా తిలాపియా చేపల పెంపకాన్ని చేపట్టేందుకు ముందుకొచ్చిన అమెరికాకు చెందిన ‘ది ఫిష్ ఇన్’ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో శాసనసభలో  రెండు ఒప్పందాలు జరిగినట్లు ప్రస్తుతం ఆక్వాకల్చర్‌లో ప్రపంచంలో రెండో స్థానంలో తిలాపియా రకం చేపల పెంపకం జరుగుతున్నట్లు చెప్పారు.
తిలాపియా రకం చేపలలో మాంసకృత్తులు, విటమిన్ బి, డి, ఒమేగా3 ఫాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయన్నారు. వీటిలో ముల్లులు తక్కువగా ఉంటాయని,  చాలా ఆరోగ్యకరమైన చేపలన్నారు. ఆక్వా చికెన్ లాంటి చేపలని పేర్కొన్నారు.   ఏపీలో అనుకూల వాతావరణం, చేపల మేత పరిశ్రమలు అతి చేరువలో ఉండటం, ఓడరేవులను అభివృద్ధి చేస్తుండటం, ఉత్సాహవంతులైన రైతులు తదితర సానుకూల అంశాలతో తిలాపియా చేపల సాగుకు బడా సంస్థలు ముందుకొస్తున్నట్లు తెలిపారు.
ప్రమాణాలలో 4 నక్షత్రాల స్థాయి మెరుగైన ఆక్వాసాగు విధానాల(బీఏపీ)తో ఫిష్ ఇన్ సంస్థ  పేరొందినట్లు చెప్పారు. ఏపీలో వివిధ జలాశయాల్లో చేపల పెంపకానికి సంబంధించి రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. 4 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 8 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో తిలాపియా ఆక్వా సాగును చేపడుతుందన్నారు.  నీటిలో 6X19 మీటర్లు గల 200 యూనిట్ల వలలను ఏర్పాటు చేస్తారని చెప్పారు.
నీటిలో 7 టన్నుల చేపలను వదిలితే 7 నెలల తరువాత 70 టన్నుల చేపలు తయారవుతాయని వివరించారు. రెండు నెలలో ఈ యూనిట్లను ప్రారంభిస్తారని చెప్పారు. పశుగణ రంగంలో అత్యున్నత స్థాయి పరిశోధనల కోసం ఏపీ సీఏఆర్ఎల్, సీసీఎంబీ మధ్య అవగాహన ఒప్పందం జరిగినట్లు మంత్రి తెలిపారు. పులివెందులలో ఏపీసీఏఆర్ఎల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి ప్రయోగశాల రూ.380 కోట్లతో నిర్మించినట్లు చెప్పారు.
అక్కడ  ఇక సీసీఎంబీ పరిశోధన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. పశుగణం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిశోధనలతో పరిష్కారం కనుగొనడం, విజ్ఞాన మార్పిడి, నైపుణ్య శిక్షణ ద్వారా రైతుల జీవనోపాధిని, ఆదాయాన్ని మెరుగుపర్చాలన్నదే అవగాహన ఒప్పందంలో ముఖ్యాంశం అని వివరించారు. అంతరించిపోతున్న జీవజాతులను సంరక్షించడంలో జీవకణ, అణు జీవశాస్త్ర పరిశోధనా కేంద్రం (సీసీఎంబీ)లో నిరంతర పరిశోధనలు సాగిస్తున్నట్లు చెప్పారు.
పశుగణ పరిశోధనలో స్వయం ప్రతిపత్తి గల సంస్థగా వివిధ సమస్యలకు పరిష్కారం కనుగొని వాటిని క్షేత్రస్థాయిలో పశు వైద్యులకు, రైతులకు ఆంధ్రప్రదేశ్ పశుగణ ఆధునిక పరిశోధన కేంద్రం (ఏపీసీఏఆర్ఎల్) చేరవేస్తుందన్నారు. ఈ రెండు సంస్థల సంయుక్త భాగస్వామ్యం, పరస్పర సహకారం, సమన్వయంతో రాష్ట్రంలో నాణ్యమైన పశుగణాభివృద్ధి జరుగుతుందన్నారు.
20 మంది శాస్త్రవేత్తలకు, మరో 200 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. బీసీ, కాపు వంటి కార్పోరేషన్లు అన్ని రాష్ట్రాల్లో పశువులు కొనడానికి అనుమతించినట్లు తెలిపారు. ఆ పశువులకు బీమా, రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి చెప్పారు.  మంత్రి వెంట ఫిషరీస్ కమిషనర్ రామ శంకర నాయక్, ఫిష్ ఇన్ సంస్థ చైర్మన్ మనీష్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ మహబూబ్ అల్తాఫ్  తదితరులు ఉన్నారు.
Tags: Tilapia fish farming America and AP understanding agreement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *