తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు : టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి
– వాహనసేవల బుక్ లెట్ ఆవిష్కరణ
తిరుమల ముచ్చట్లు:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్నాయని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు . తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో వీటిని వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎదుట సోమవారం అమ్మవారి బ్రహ్మోత్సవాల వాహన సేవల బుక్ లెట్ ను ఛైర్మన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడారు . బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 7వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుందన్నారు. నవంబరు 9వ తేదీన లక్షకుంకుమార్చన, అంకురార్పణ నిర్వహిస్తారని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా నవంబరు 10న ధ్వజారోహణం, 14న గజ వాహనం, 15న స్వర్ణరథం, గరుడ వాహనం, 17న రథోత్సవం, 18న పంచమితీర్థం, 19న పుష్పయాగం నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయన్నారు. విశేషమైన పంచమి తీర్థం నాడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరిస్తారన్నారు . ఇందుకోసం పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నామని వివరించారు. దాదాపు రూ.9 కోట్ల వ్యయంతో అమ్మవారి పుష్కరిణి ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, త్వరలో నీటిని నింపి పుష్కరిణి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఈవో ఎవి.ధర్మారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, జేఈవో
వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, డెప్యూటీ ఈవో గోవిందరాజన్ ఏఈవో రమేష్, పాంచరాత్ర ఆగమసలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి, మణికంఠ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Tags: Tiruchanur Sree Padmavati Ammavari Brahmotsavam like Tirumala: TTD Chairman Bhumana Karunakar Reddy
