తిరుమల ఘాట్ రోడ్లు, నడకదారుల్లో సామూహిక శ్రమదానం విజయవంతం
– పాల్గొన్న సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి.రమణ, టిటిడి ఈవో, కలెక్టర్, ఎస్పీ
తిరుమల ముచ్చట్లు:

తిరుమల ఘాట్ రోడ్లు, నడకదారుల్లో శనివారం ఉదయం టిటిడి చేపట్టిన సామూహిక శ్రమదాన కార్యక్రమం విజయవంతమైంది. ముందుగా ఉదయం 6 గంటలకు అలిపిరి వద్ద ప్రముఖులు, అధికారులు, ఉద్యోగులు సమావేశమయ్యారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి.రమణ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 700 మందికి పైగా అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు సెక్టార్ల వారీగా తమకు కేటాయించిన ప్రదేశాల్లో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి.రమణ, టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి డౌన్ ఘాట్ రోడ్డులోని ఏడో మైలు ఆంజనేయస్వామివారి ఆలయం నుండ కొంతదూరం శ్రమదానం చేశారు.జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటరమణారెడ్డి అలిపిరి టోల్‌గేట్ వద్ద శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ చేపట్టిన శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రమదానం కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేసి నిరంతరం కొనసాగించాలని కోరారు. వంద మంది రెవెన్యూ సిబ్బందితో అలిపిరి టోల్ గేట్ నుండి రోడ్డుకు ఇరువైపులా ప్లాస్టిక్ వ్యర్థాలను ఇతర వ్యర్థాలను తొలగించినట్లు తెలిపారు.
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సలహాదారు డా. జయప్రకాష్ సాయి అలిపిరి మార్గంలో 15వ కి.మీ నుండి 12వ కి.మీ వరకు శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల ఘాట్ రోడ్లలో శ్రమదానం కార్యక్రమం బృహత్తరమైనదన్నారు. రెండు ఘాట్ రోడ్లు, నడకదారుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను పడేయకుండా భక్తుల్లో అవగాహన పెంచాలని సూచించారు. పర్యావరణహితం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో భక్తులను కూడా భాగస్వాములను చేయాలన్నారు.అదేవిధంగా, జెఈవో శ్రీమతి సదా భార్గవి డౌన్ ఘాట్ రోడ్డులో, జెఈవో శ్రీ వీరబ్రహ్మం అప్ ఘాట్ రోడ్డులో, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి హరిత, వారి సిబ్బంది మోకాలిమెట్టు వద్ద, ఎస్పీ శ్రీ పరమేశ్వరరెడ్డి, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, వారి సిబ్బంది అలిపిరి నడకమార్గం వద్ద, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్ శ్రీవారిమెట్టు మార్గంలో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి న్యాయాధికారి వీర్రాజు, ఎఫ్ఏసిఎఓ బాలాజి, సిఈ నాగేశ్వరరావు, సిఏఓ శేషశైలేంద్ర ఇతర విభాగాధిపతులు, టిటిడి ఉద్యోగులతో పాటు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ సిబ్బంది, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
Tags:Tirumala Ghat Roads and pedestrians have been successful in collective labor
