21 నుండి 23వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల ముచ్చట్లు:

 

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.      ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఏప్రిల్ 21వ తేదీన ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన  అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.  రెండవరోజు ఏప్రిల్ 22న శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు ఏప్రిల్ 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి  చేరుకుంటారు.

 

ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.   వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా  నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 23న అష్టదళ పాదపద్మారాధన, ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

 

Tags:Tirumala Srivari Salakatla Spring Festivals from 21st to 23rd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *