కరోనా నియంత్రణలో తిరుపతి టాప్

Date:30/03/2020

విజయవాడ,ముచ్చట్లు:

స్మార్ట్‌ సిటీల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యలు బాగున్నాయని స్మార్ట్‌ సిటీ మిషన్‌ కితాబిచ్చింది. మిగతా పట్టణాలతో పోలిస్తే స్మార్ట్ సిటీల్లో పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని ఓ నివేదిక ఇచ్చింది. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కరోనా నియంత్రణ చర్యలు అత్యద్భుతంగా ఉన్నట్లు పేర్కొంది. స్మార్ట్‌ నగరాల పనితీరును బట్టి సాధారణం, బాగా చేస్తున్నవి, అద్భుతంగా చేస్తున్నవి.. ఇలా మూడు గ్రేడ్‌లుగా విభజించి, అక్కడి సేవలను పరిశీలించి స్మార్ట్‌సిటీ మిషన్‌ ర్యాంకులిచ్చింది. ఏపీలో విశాఖపట్నం, అమరావతి, కాకినాడ, తిరుపతి స్మార్ట్‌ సిటీలు గుర్తించిన విషయం తెలిసిందే.ఈ నాలుగు స్మార్ట్ సిటీల్లో తిరుపతికి మొదటి ర్యాంకు వచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలు ఇక్కడ బాగున్నట్లు స్మార్ట్‌ సిటీ మిషన్‌ తన నివేదికలో తేల్చింది. తిరుపతికి సంబంధించి విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ఇళ్ల వద్ద మార్కింగ్‌ వేశారని, వారిపై క్వారంటైన్‌ పర్యవేక్షణ బాగుందని కితాబిచ్చింది. అలాగే తిరుపతిలో ఇంటింటికీ వెళ్లి నిత్యావసరాలు, కిరాణా సరుకులు అందజేస్తున్నారని పేర్కొంది. వార్డు సెక్రటరీలు, సిబ్బంది ఆయా వార్డుల్లో పటిష్టంగా, ప్రజలను నొప్పించకుండా సేవలందిస్తున్నారని పేర్కొంది.విశాఖపట్నంలో పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ విధానం చాలా బావుందని స్మార్ట్‌ సిటీ మిషన్‌ వెల్లడించింది. అంతర్జాతీయ ప్రయాణికులను గుర్తించడంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ చక్కగా పనిచేస్తోందని పేర్కొంది. కాకినాడలో 24 గంటల హెల్ప్‌ డెస్క్‌లు, ఎమర్జెన్సీ కాల్‌ బాక్స్‌ను ఏర్పాటు చేశారని తెలిపింది. రాజధాని అమరావతిలో పబ్లిక్‌ అవేర్‌నెస్‌ బ్యానర్‌లు విరివిగా ఏర్పాటు చేయడంతో పాటు హోమియో మందులు సరఫరా చేస్తున్నారని వివరించింది.

చెన్నైలో 17 కు చేరిన కరోనా కేసులు

Tags:Tirupati top with corona control

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *