అవినీతికి అంతం లేదా

Date:12/03/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
లంచగొండితనం దంపతుల ప్రాణాలను బలితీసుకుంది. అభంశుభం తెలియని ఇద్దరు పిల్లలను అనాథలను చేసింది. దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్న చందంగా ఆ రైతన్నకు కార్పొరేషన్ నుంచి రుణం మంజూరు అయినా, రెవెన్యూ కార్యాలయ లంచగొండి అధికారి అడ్డుతగిలాడు. నేను లంచం ఇచ్చుకోలేను సారు అని మొరపెట్టుకున్నా కనికరించలేదు. ఓ వైపు లంచం ఇవ్వనందుకు రుణం ఆగిపోయింది. మరో వైపు అప్పుల భారం పెరిగిపోయింది. చివరికి అవినీతి అన్నదాత ప్రాణాన్ని బలిగొంది. మంచిర్యాలలో జరిగిన ఈ ఘటనలో ఆ రైతు భార్య, పిల్లలకు విషమిచ్చి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలిద్దరూ అదృష్టవశాత్తూ బతికిబయటపడ్డారు. ఈ అవినీతి సమాజంలో అనాథలుగా బతకడం అదృష్టమెలా అవుతుందని ఆ పిల్లలు వైునంగా ప్రశ్నిస్తున్నారు.ఈ దేశంలో అవినీతి వ్యవస్థీకృతం కాబడిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అవినీతి అంతం మా పంతం అంటూ ప్రధానులు, ముఖ్యమంత్రులు పెద్దపెద్ద మాటలు చెప్పడమే తప్ప, ఆచరణలో చిత్తశుద్ధి చూపిందిలేదు. అసలు అవినీతి మంత్రులులేని ప్రభుత్వాలు ఈ దేశంలో ఉన్నాయా అనేది పాలకులు తమను తాము ప్రశ్నించుకోవాలి. వేలకోట్ల బ్యాంకు కుంభకోణాలు కళ్లముందు కదలాడుతుంటే తప్పు మీ హయాంలో జరిగిందంటే, లేదు మీ హయాంలోనే అంటూ ప్రభుత్వ, ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించుకోవడం, ప్రజలను మభ్యపెట్టడం మినహా, ఆ అవినీతి దొంగలను శిక్షించిన దాఖలాలు ఉన్నాయా? అన్నది ఈ దేశ ప్రజలు ప్రశ్నించుకోవాలి. ఒక సినిమాలో  చెప్పినట్టు గుండుపిన్ను నుంచి రాఫెల్ విమానాల కొనుగోలు వరకూ ప్రతిదాంట్లో అవినీతి.. లంచం.. క్విడ్‌ప్రోకో. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో అవినీతిపై చేసిన సర్వేలోనూ ఇదే వెల్లడైంది. భారతదేశంలో లంచగొండితనం ఏ మాత్రమూ తగ్గలేదని ఆ సంస్థ నివేదికలో పేర్కొంది. అవినీతి నిర్మూలనలో 40 మార్కులతో భారత్ బార్డర్ పాస్ మాత్రమే అయిందనేది ఆ నివేదిక సారాంశం. పక్కదేశం చైనా, మన ఆర్థికసాయం పొందుతున్న భూటాన్ కంటే కూడా మన దేశంలో అవినీతి ఎక్కువ ఉండడం సిగ్గుపడాల్సిన విషయం. పాలకులు మాత్రవేుకాదు, మౌనంగా ఉంటూ లంచగొండులకు ఊతమిస్తున్న ఈ దేశ పౌరులు కూడా సిగ్గుపడాలి.పాలకులు ఎలాగూ సిగ్గుపడరు. ఎందుకంటే వాళ్లకు కావాల్సింది అధికారం. అధికారాన్ని తెచ్చిపెట్టేది డబ్బు మాత్రమే. అవినీతికి పాల్పడకుండా అనతికాలంలో లక్షల కోట్లలో డబ్బురాదు. డబ్బు లేకపోతే ఈ ధనస్వామ్యంలో అధికారం చేజిక్కదు. ఎటుతిరిగి సిగ్గు పడాల్సింది మనమే. ఎన్నికల సమయంలో డబ్బులు తీసుకుంటున్నందుకు, మద్యానికి జై కొడుతున్నందుకూ సిగ్గుపడాలి. బర్త్ సర్టిఫికెట్ నుంచి డెత్ సర్టిఫికెట్ వరకూ లంచమిచ్చి తెచ్చుకుంటున్నందుకు సిగ్గుపడాలి. లంచమడిగిన అధికారులను నిలదీయకుండా ఉంటున్నందుకు సిగ్గుపడాలి. తోటి అధికారి లంచాల కోసం ప్రజలను పీడిస్తుంటే చూస్తూ మిన్నకుండిపోతున్న ప్రభుత్వ అధికారి సిగ్గుపడాలి. పాలకులు తప్పుచేస్తున్నా బయటపెట్టని సివిల్ సర్వీస్ అధికారులు సిగ్గుపడాలి. ఈ దేశం నుంచి అవినీతిని తరిమేందుకు ఆ సిగ్గులోంచి ఓ ఉద్యమం ఊపిరోసుకోవాలి. తెలంగాణ ఉద్యమం కంటే పదిరెట్ల పెద్ద ఉద్యమం ఈ దేశంలో సాగాలి. పాలకుల గుండెల్లో గుబులు పుట్టాలి. తమ అవినీతికి అనుగుణంగా రాజకీయ అవినీతిపరులు నిబంధనలు మా ర్చుకునే ధోరణి మారాలి. కఠినమైన చట్టాలు రావాలి. అవినీతి ఆరోపణలు వస్తే ప్రధానినైనా సరే ప్రశ్నించే వ్యవస్థ రావాలి. అలాంటి వ్యవస్థ రావాలంటే అన్నా హజారే అనే పెద్దాయన చెబుతున్న పటిష్టమైన లోక్‌పాల్ వ్యవస్థ ఈ దేశంలో ఉండాలి. ఇదంతా జరగాలంటే ఈనాటి నుంచే నువ్వు ఉద్యమించాలి. మార్పు మనతోనే మొదలవ్వాలి. ఇది అవినీతి సమాజం కాదు, మీరు అదృష్టవంతులేనని ఆ పిల్లలిద్దరికీ గర్వంగా సమాధానం చెప్పుకునే ఓ రోజు రావాలి.
Tags: To end corruption or not

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *