పూడిక తీసేదెట్లా..? 

Date:14/03/2018
నిజామాబాద్ ముచ్చట్లు:
శ్రీరాంసాగర్‌ జలాశయంలో భారీగా పూడిక పేరుకుపోయింది.. దీని వల్ల 32 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది.. నదీ పరీవాహక ప్రాంతం ప్రారంభం నుంచి జలాశయం వరకు నియంత్రణ చర్యలు తీసుకోవాలని కేంద్ర జలవనరుల సంఘం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించడం చర్చనీయాంశమైంది. గోదావరి నదిపై పోచంపాడ్‌  వద్ద శ్రీరాంసాగర్‌ను నిర్మించారు. 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో దీనిని  నిర్మించారు. క్రమంగా పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ 90.10 టీఎంసీలకు పడిపోయినట్లు తేల్చారు. మళ్లీ 2014లో అత్యాధునికమైన హైడ్రాలిక్‌ విధానంతో సర్వే చేసి వాస్తవ నిల్వ 80.10 టీఎంసీలుగా నిర్ధరించారు.అంటే 1970 నుంచి 2018 వరకు జలాశయంలో చేరిన పూడిక పరిమాణం 32 వేల మిలియన్‌ క్యూబిక్‌ అడుగులుంటే తగ్గిన నీటి పరిమాణం 32 టీఎంసీలు.ప్రస్తుతం ఎస్సారెస్సీ నీటి నిల్వ సామర్థ్యం అధికారికంగా 90.10 టీఎంసీలుగా నమోదు చేస్తున్నారు. 1994లో సర్వే నివేదిక ఆధారంగా ఈ లెక్క తేల్చినా ఈ పరిమాణం ఇప్పటికీ కొనసాగుతోంది. 2014లో సర్వే చేసి 80.10 టీఎంసీలు నిల్వ సామర్థ్యంగా తేల్చి సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఎస్సారెస్పీ నీటి నిల్వ సామర్థ్యం పూడిక కారణంగా 80.10 టీఎంసీలకు పడిపోయిందని, ఇక నుంచి జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం 80.10 టీఎంసీలుగా నమోదు చేయాలంటూ సాగునీటి పారుదల శాఖ గజిట్‌ ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
నివేదిక పంపిన అనంతరం రాష్ట్ర విభజన జరగడంతో గజిట్‌ ప్రకటన అంశం మరుగున పడింది. ఆ తరువాత తెరాస ప్రభుత్వం ఏర్పడింది. నాలుగేళ్ల కాలంలో రెండు మూడు సార్లు గజిట్‌ ప్రకటన అంశం ప్రస్తావనకు వచ్చినా కదలిక మాత్రం లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎస్సారెస్సీ అధికారులు మరోసారి పాత నివేదికను పంపి, గజిట్‌ను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఎస్సారెస్పీ నీటి నిల్వ సామర్థ్యం 80.10 టీఎంసీలుగా పేర్కొనాల్సి ఉంటుంది. గోదావరి పరివాహక ప్రాంతంలో 2016లో తీవ్ర వర్షాభావం పరిస్థితులు నెలకొనడంతో ఎస్సారెస్పీలో తొలిసారిగా నీరు అడుగంటింది. దీంతో రైతులు భారీగా ఒండ్రుమట్టిని పొలాలకు తరలించుకొన్నారు. 40 పొక్లెయిన్లు, వందల సంఖ్యలో టిప్పర్లు మూడు నెలల పాటు నిర్విరామంగా మట్టిని పొలాలకు తరలించారు. అనంతరం ఎస్సారెస్పీ అధికారులు మట్టి తరలించిన ప్రదేశాన్ని సర్వే చేశారు. ఇంత పెద్ద ఎత్తున మట్టిని తీసుకెళ్లినా కేవలం 0.42 మిలియన్‌ క్యూబిక్‌ అడుగుల పూడిక మాత్రమే తరలిపోయినట్లు గుర్తించారు. జలాశయంలో ఉన్న 32 వేల మిలియన్‌ క్యూబిక్‌ అడుగుల పూడికతో పోలిస్తే తరలిపోయింది గోరంత మాత్రమే.
Tags: To remove the dish?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *