పత్తికొండలో టమాటా 50 పైసలు
మదనపల్లి ముచ్చట్లు:
అన్నదాత అంటే ప్రకృతికి కూడా లోకువే.. అతి వృష్టి, అనావృష్టిలతో ఒకొక్కసారి కంట కన్నీరు పెట్టిస్తుంది. అంతేకాదు పండిన పంట చేతికి వచ్చే వరకూ ఒక ఆందోళన.. చేతికి వచ్చిన పంటకు తగిన గిట్టుబాటు ధర లభిస్తుందో మరొక ఆందోళన రైతన్నలో కలుగుతూనే ఉంటాయి. అయితే ఒక్కసారి పంటకు దిగుబడి తగ్గి డిమాండ్ పెరగడంతో హఠాత్తుగా ధరలు చుక్కలను తాకుతాయి. రైతు తన పంటకు తగిన ధర దక్కడంతో ఆనందం వెల్లువిరుస్తుంది. ఈ ఆనందం కొంతకాలం కూడా ఉండకుండానే ఆ పంట ధర నేల చూస్తూ కన్నీరు పెట్టిస్తుంది. ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది తాజాగా టమాటా పంట. గత కొన్ని రోజుల క్రితం వరకూ కిలో టమాటా ధర రూ.200 లు పలికింది. కొంతమంది రైతులు తమ పంటకు లాభాలు దక్కాయంటూ ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆ ఆనందం నీటి మీద రాతలా మారిపోయింది. ప్రస్తుతం టమాటాకు తగిన ధర లేక రోడ్డు పాలు చేస్తున్నారు. ప్రస్తుతం కిలో టమాటా ధర రూపాయి కూడా లేదు. దీంతో తమకు కనీసం ట్రాన్స్ పోర్టు చార్జీలు కూడా రాని పరిస్థితి ఏర్పడింది అంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీరు పెడుతున్నారు.ఒక్క రూపాయికి కనీసం టీ కూడా రావడం లేదు.
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసి కష్టపడి పండించిన పంటకు మార్కెట్ లో కనీ ధర లేకపోడంతో అన్నదాత కన్నీరు పెడుతున్నాడు. ఎంతో ప్రేమతో పంటలను సంరక్షిస్తూ.. పంటలను పండించే పంటకు మార్కెట్ లో కిలో అర్ధ రూపాయి కూడా దక్కడం లేదు. ప్రస్తుతం ఏపీలో టమాటా పంట దిగుబడి అధికంగా ఉంది. అందుకు తగిన ఎగుమతి లేక పోవడంతో టమాటా రైతులు నష్టపోతున్నారు. గత కొంతకాలంగా టమాటా క్రమంగా దిగుతూ వచ్చి.. నేడు భారీగా పతనమైందిముఖ్యంగా కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో రెండు క్రితం వరకూ కిలో టమాటా రూ.4 వరకూ ఉండేది. అయితే ఇప్పుడు భారీగా పతనమై టమాటా కిలో 50 పైసలకు చేరుకుంది. ఇప్పుడు టమాటా పంట మంచి దిగుబడి వచ్చే సమయం అని .. ఇలా అమాంతం టమాటా ధర పడిపోయిందంటూ రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కనీసం పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదంటూ ఆవేదన వక్తం చేస్తున్నారు.పత్తికొండ ప్రాంతంలో టమాటా పంటను పండించే రైతులు ఏటా కనీసం అర ఎకరా నుంచి ఐదెకరాల వరకు సాగు చేస్తారు. ఈ నెలలో టమాటా దిగుబడి అధికంగా ఉండంతో ధరలపై తీవ్ర ప్రభావం పడింది.

నాణ్యత ఉన్న టమాటాను కొంగలు చేయడానికి కూడా వ్యాపారస్తులు ఆసక్తిని చూపించడం లేదని.. దొరికిందే అవకాశంగా తీసుకుని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.టమాటా పంట కోత కూలీ, రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ వాపోతున్నారు. ఇదే ధర ఇవే పరిస్థితులు కొనసాగితే.. తాము పంట కోసం పెట్టిన పెట్టుబడికి తగిన ధర రాకపోతే.. అప్పులు తప్ప ఏమీ మిగలవని, ప్రభుత్వం తమని ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వాస్తవానికి టమాటా ధరల్లో హెచ్చితగ్గులు ప్రతిఏడాది వస్తూనే ఉంటాయి. అయితే ఎక్కువగా రైతులు నష్టపోతూనే ఉంటారు. దీనికి సరైన పరిష్కారం.. ధరల స్థిరీకరణకు ప్రభుత్వం ప్రయత్నం చేయాలనీ.. ఇలా చేయడం వలన అటు రైతుకు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుందని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు.
Tags: Tomato 50 paise in Pattikonda
