Tomato Farmers

కంటతడి పెడుతున్న టమాటో రైతులు

– గిట్టుబాటు ధరలు లేక రైతన్న విలవిల
– మార్కెట్‌కు తరలిస్తే రవాణా చార్జీలు రాని పరిస్థితి
– పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చేదెలా….రైతుల ఆందోళన
– ప్రభుత్వామే కొనుగోలు చేసి ఆదుకోవాలి
– కమిషన్ 4 % బదులుగా 10 % వసూలు
– విస్తారంగా టమోటా సాగు

Date:09/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

కరోనా వైరస్‌ వలన అగ్రరాజ్యాలే వణికిపోతున్నాయి. మనదేశంలో రోజురోజుకు ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఆ ప్రభావం రైతులపై పిడుగులా పడింది. ఈ సీజన్ లో రైతులు పండించిన పంటలు మంచి దిగుబడులు వచ్చాయి. ఈ తరుణంలో ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భారతదేశంలోకి విజృంభిస్తున్న క్రమంలో కరోనా వైరస్ నివరణా చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో రైతులు పండించిన పంటలను ఇతర రాష్ట్రాల మార్కెట్లకు తరలించి అమ్ముకునే పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా రెండు రోజుల క్రితం నిత్యావసర సరుకులలో భాగమైన పంటలు జిల్లాలో మరియు రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లో కూడా అమ్ముకునే వెసులుబాటు కల్పించినా రవాణా చేయడానికి వాహన చోదకులు (డ్రైవర్లు) ముందుకు రాకపోవడంతో పంటపొలాల్లోనే పంటలు వదిలేసే పరిస్థితి నెలకొంది.

 

రాష్ట్రంలోనే అతి పెద్ద టమాటో మార్కెట్ గా పేరున్న మదనపల్లి మార్కెట్ నుండి ఇతర రాష్ట్రాలకు నిత్యం టమోటాలు ఎగుమతులు జరుగుతుండేవి. అలాగే పుంగనూరు మార్కెట్ కు కూడా అధిక సంఖ్యలో రైతులు టమోటాలు తరలిస్తారు. కానీ లాక్ డౌన్ కారణంగా నేడు రైతులు తీసుకొచ్చే టమోటాలకు మార్కెట్ లో గిట్టుబాటు ధరలు పతనం అవ్వడంతో పంట పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఇటు వ్యాపారులు కూడా ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజులు క్రితం నిలకడగా ఉన్న టమాట ధర.. ఒక్కసారిగా పడిపోయింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక పోవడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు. పంట చేతికందే సమయానికి కరోనా లాక్ డౌన్ దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర సరిహద్దుల్లో గతంలో రాకపోకలు నిబంధనలు ఏర్పాటు చేశారు. ఐతే నిత్యావసర వస్తువులు సరఫరాకు సడలింపు ఇచ్చినా వాహన చోదకులు ముందుకు రావడంలేదు.బయటి మార్కెట్లో డిమాండ్ వున్నా పంటలు కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో టమోటా ధరలు అమాంతం పడిపోయాయి. దింతో పెట్టుబడీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తీర్చడమెలాగో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టమోటాను మార్కెట్‌కు తరలిస్తే అక్కడ లభించే ధర.. రవాణా చార్జీలకు కూడా సరిపోవడం లేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు.

 

“కమిషన్ 4 % బదులుగా 10 % వసూలు”

మదనపల్లె టమాట మార్కెట్‌కు చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి సుమారు 300మంది రైతులు వస్తారు. ఒక్కోరైతు 25 నుంచి 100 క్రేట్‌ల (క్రేట్=30 కేజీలు) టమాటాలను తీసుకువస్తారు. రైతులు తీసుకువచ్చిన సరుకును నేరుగా విక్రయించే అవకాశం లేదు. కమీషన్ ఏజెంటు ద్వారానే విక్రయించాల్సి ఉంటుంది. ఏజెంట్లు ముందుగానే వ్యాపారులతో లావాదేవీలు జరిపి ఒప్పందం కుదుర్చుకుంటారు. రైతుకి, వ్యాపారికి మధ్యవర్తిగా వ్యవహరించి టమోటాల వేలం నిర్వహిస్తారు.అంతే కాకుండా క్రేట్‌ను రూ.100 లకు విక్రయిస్తే అందులో కూడా పదిశాతం తగ్గించి రైతుకు నగదు ఇస్తారు. నిబంధనల ప్రకారం కమిషన్ నాలుగుశాతం మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా ఏజెంట్లు పదిశాతం వసూలు చేస్తున్నారు. ఇలా అన్ని దశల్లోనూ వ్యాపారులు, ఇటు దళారులు రైతన్నను దోచుకుంటున్నారు..దీనికి తోడు ధరలు లేనిసమయంలో టమాటో నిల్వ చేయడానికి కనీసం ఏ ఒక్కచోటా శీతల గిడ్డంగులు లేవు. దీంతో నష్టాలను చవిచూస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లో రూ. 1.5 కిలో తీసుకుంటున్న వ్యాపారులు బయట అంగట్లో కిలో రూ. 5 అమ్ముకుంటున్నారు. కష్టపడి పండించిన రైతుకు మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయి.

 

 

ఏడాది పొడవునా డిమాండ్‌ ఉండే టమాట ప్రస్తుతం ఏడుపును మిగిల్చింది. టమాట ధర ఒక్కసారిగా పడిపోయింది. వ్యయప్రయాసలకోర్చి పండించిన పంటకు ఈ పరిస్థితుల్లో సరైన గిట్టుబాటు ధర లేకపోవటంతో ఆందోళనకు గురవుతున్నారు. టమాట పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదని వాపోతున్నారు. మార్కెట్‌కు తరిలించిన టమాట 30 కిలోల బాక్స్‌కు క్వాలిటీని బట్టీ రూ. 45 నుంచి రూ. 60 వరకు అమ్ముడు పోతుంది. ఈ లెక్కన చూస్తే.. నెంబర్‌ 1 రకం 2 రూపాయలకు అమ్ముడుపోతుంది. మామూలు రకం టమాట కిలో రూపాయిన్నర అమ్ముడుపోతుంది. గిట్టుబాటు ధర లేని కారణంగా మార్కెట్‌కు తరలించిన టమాటను పలువురు రైతులు నేలపై పారబోసి వెళుతున్నారు. జనవరి నుండి రామసముద్రం, నిమ్మనపల్లి, మదనపల్లి, కొత్తకోట, మొలకలచెరువు, తంబళపల్లి, ప్రాంతాల్లో టమాటను వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేశారు. మదనపల్లి నియోజకవర్గంలో ఎక్కువగా రామసముద్రం మండలంలో టమాట పంటలను ఎక్కువగా సాగుచేశారు.

 

 

 

ప్రస్తుతం పంటను కోసేందుకు కూలీలకు వెచ్చించిన డబ్బులు కూడా రావటం లేదనీ, మార్కెట్‌కు తరలించినా కనీసం రవాణా చార్జీలూ మిగలటంలేదని కలతచెందుతున్నారు. నియోజకవర్గంలో ఈసారి వేసిన టమాట పంట నష్టాల ఊబిలోకి నెట్టేసింది. ఈ ఊబిలో చిక్కుకొన్న రైతులు తెరుకోవడానికి కనీసం 3 సంవత్సరాల సమయం పడుతుంది. రామసముద్రం మండలంలో బోరుబావులున్న ప్రతి రైతు టమాట పంటను సాగు చేశారు. ప్రధానంగా లాక్ డౌన్ కారణంగా టమోటాకు గిట్టుబాటు ధరం లేకపోవటం,అకాల వర్షాలు తదితర కారణాలవల్ల ప్రస్తుత సీజన్‌లో టమోటా రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పంట పండించడం ఓ ఎత్తు ఐతే పంటను ఊజీ బారి నుండి కాపాడటం మరో ఎత్తు. రైతు మొక్క నాటిన రోజు నుండి కాయలు కోతకోసే వరకు క్రిములు, వైరస్ బారిన పడకుండా కాపాడటం కత్తిమీద సాము అని చెప్పవచ్చు.

 

 

 

 

ఎన్నో ఆశలతో అప్పుసప్పులు చేసి ఎకరానికి సుమారు రూ. లక్ష రూపాయలు వరకు పంటకోసం పెట్టిన పెట్టుబడులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎంతో కష్టపడి పండించిన పంటలను నిలువ ఉంచు కునేందుకు అవకాశం లేకపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నా నేటికి పురుడుపోసుకోలేదు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరరాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు.

 

 

 

 

తాము పండించిన కూరగాయలు మార్కెట్‌లో గిట్టుబాటు ధర రాకుంటే వాటిని నిలువ ఉంచటానికి వీలుగా శీతల గిడ్డంగులు, మార్కెటింగ్‌ రవాణావంటి సౌకర్యాలు లేనందున తప్పని పరిస్థితుల్లో తక్కువ ధరకే పంటలను అమ్ముకుంటున్నారు. ప్రైవేట్‌గా శీతల గిడ్డంగులు ఉన్నాయి. కానీ…. పంట నిల్వ కోసం భారీ ఛార్జీలు ఉండటంతో రైతులు ప్రైవేట్‌ శీతల గిడ్డంగులకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వ పరంగా శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని మెజార్టీ రైతులు కోరుతున్నారు.

చిత్తూరు జిల్లాలో పదకొండు పాజిటివ్ కేసులు

Tags: Tomato Farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *