పనిముట్లు లేక పనికి పాట్లు

Date:21/04/2018
జగిత్యాల ముచ్చట్లు:
ఉపాధి హామీ పథకం ద్వారా జగిత్యాలకు చెందిన లక్షలమంది బడుగులు లబ్ధిపొందుతున్నారు. ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం కేటాయిస్తున్న పనిదినాలకు సద్వినియోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా కూలీలకు పనిముట్లు పూర్తిస్థాయిలో అందడంలేదని, జిల్లావ్యాప్తంగా పనిముట్ల కొరత ఉందని పలువురు అంటున్నారు. కేవలం జగిత్యాలలోనే కాక ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొన్నట్లు చెప్తున్నారు. పథకం ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా కనీసం పలుగు, పార, తట్ట కూలీలకు అందించడంలో అధికారులు విఫలమవుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 4,68,358 కుటుంబాలకు ఉపాధి హామీ జాబ్‌కార్డులున్నాయి. సగటున రోజుకు లక్ష మంది కూలీలు పనులకు వెళ్తున్నారు. అయితే పనులకు అవసరమైన గునపం, పార, తట్టల్లాంటి కనీస పనిముట్లు ఉండడంలేదు. దీంతో కూలీలే  కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. పనిముట్లు కొనుగోలు చేయడం ఒక ఎత్తైతే అవి పాడవకుండా జాగ్రత్తలు తీసుకోడానికి, పదును పెట్టించడానికి దాదాపు రూ.2వేలకు పైగానే ఖర్చవుతోందని కూలీలు అంటున్నారు.  పదేళ్లుగా ఉపాధి పనులకు వస్తున్నా సంబంధిత అధికార యంత్రాంగం కూలీలకు పనిముట్లు అందించే విషయమై పెద్దగా శ్రద్ధ చూపలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు కూలీలైతే నాలుగేళ్లుగా వంద రోజులు పూర్తిగా పనిచేస్తున్నప్పటికీ గునపం, గడ్డపార, తట్ట ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒక గడ్డపార కొనడానికి రూ.800, మొదటిసారి పదునుకు రూ.200 ఖర్చయిందని చాలీ చాలని వేతనంతో ప్రతి నెలా పదును చేయించేందుకు రూ.వంద చొప్పున వెచ్చిస్తున్నామని మరికొందరు వాపోతున్నారు. సుమారు 15 రోజుల వేతనం పనిముట్ల నిర్వహణకే పోతే కుటుంబం గడిచేదెలా అని ప్రశ్నిస్తున్నారు. కూలీల సమస్యను ఉన్నతాధికారులు అర్ధం చేసుకున్నా పనిముట్ల కొనుగోలుకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవని చేతులెత్తేస్తున్నారు. గత రెండేళ్లలో గడ్డపారలు కొనడానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేదని అంటున్నారు. కూలీలు వ్యవసాయ పనులు చేసే వాటితోనే ఉపాధి పనులు చేయాలని చెప్తున్నారు. అధికారుల వాదన ఎలా ఉన్నా.. ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించి ఉపాధి హామీ కూలీలకు పనిముట్లు అందించేందుకు కృషి చేయాలని అంతా విజ్ఞప్తిచేస్తున్నారు.
Tags;’Tools or work pots

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *