జనగాంలో ఆదర్శంగా జైలు

Date:13/03/2018
వరంగల్ ముచ్చట్లు:
క్షణికావేశంలో చేసిన తప్పులకు జైలు శిక్ష అనుభవిస్తున్న అండర్ ట్రయల్ ఖైదీలు జీవిత పాఠాలు నేర్చుకుంటున్నారు. జైలులో అధికారులు కల్పించిన సదుపాయాలను వినియోగించుకుం టూ చదువునేర్చుకోవడంలో నిమగ్నమవుతున్నారు. చేసిన తప్పును తెలుసుకోవడంతోపాటు జీవితంలో మరోసారి తప్పులు పునరావృతం కావొద్దన్న దిశగా అడుగులు వేస్తున్నారు జనగామ సబ్‌జైలు అండర్ ట్రయల్ ఖైదీలు. ఇందుకు అనుగుణంగా అధికారులు విద్యాదాన్‌యోజన్‌లో భాగంగా ఖైదీలకు అక్షరాస్యత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఖైదీల విద్యాస్థాయిని బట్టి వారికి పుస్తకాలను, గ్రంథాలయాన్ని, టీవీ, వార్తా పత్రికలను అందుబాటులో ఉంచుతున్నారు. కనీస అభ్యసనస్థాయి లేని వారికి వర్ణమాల, పేరు, సంతకాన్ని వారంతగా వారు రాసేవిధంగా తీర్చిదిద్దుతున్నారు. జైలు అధికారులు విద్యాదాన్ యోజన్‌ను రెండు విడుతలుగా నిర్వహిస్తున్నారు. ఉదయం శారీరక వ్యాయామం అనంతరం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, నాలుగు గంటల వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం యోగా, పరేడ్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. పచ్చని చెట్లు.. ఆహ్లాదకర వాతావరణంలో ఆటల ద్వారా పాఠ్యేతర అంశాలను జోడిస్తూ శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నారు. అలాగే విద్యాదాన్ యోజన్‌తోపాటు అండర్ ట్రయల్ ఖైదీలకు ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం ద్వారా జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. బ్యాంకు అకౌంట్‌లేని వారికి సైతం నూతన ఖాతా ద్వారా పథకాన్ని అమలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖైదీలు తిరిగి మళ్లీమళ్లీ జైలుకు రాకుండా మహాపరివర్తన్ పథకం ద్వారా ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నారు. ఇందుకు జైలు నుంచి బయటకు వేళ్లేవారు అధికారులకు ఉపాధి కోసం ఓ దరఖాస్తు ఇస్తే సరిపోతుంది. ఖైదీల మనోవేదన తొలగిపోయేలా జైలు పర్యవేక్షకులు వడ్త్యాల ఉపేందర్ చర్యలు తీసుకుంటున్నారు. కారాగారంలోని గాంధీ విగ్రహం నుంచి బ్యారక్‌ల వరకు పచ్చని గడ్డి, పూలమొక్కలు ఏర్పాటు చేసి హరితవర్ణంగా తీర్చిదిద్ది ఖైదీలకు మానసిక ప్రశాంతతను కల్పిస్తున్నారు.
Tags: Tourism … big plate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *