టూరిజానికి… పెద్ద పీట

Date:13/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. విహార యాత్రలకు వేళయినట్లే. పాఠశాలలకు సెలవులు ఉండడంతో ఫ్యామిలీ టూర్స్‌కి ప్లాన్ చేసుకుంటుంటారు. ఎక్కడికి వెళ్లాలి? ఏయే ప్రాంతాలు సందర్శించవచ్చు? ఎక్కడ ఉండొచ్చు? ఇలా నానా రకాల ఆలోచనలు చేస్తారు. కేవలం పర్యాటక అందాలకే కాకుండా రవాణా, బస సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని టూర్ ప్లాన్ చేసుకుంటారు. అందుకే.. పర్యాటకంలో హాస్పిటాలిటీ రంగం కీలకంగా మారింది. దక్షిణాదిన పలు పర్యాటక ప్రాంతాల్లో ఇప్పుడు హోం స్టే ట్రెండ్ నడుస్తున్నది. ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు ఇవి మాత్రమే కాదు.. పర్యాటకమంటే, సంస్కృతి, సంప్రదాయాలు కూడా. అందుకే.. కొత్త ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు స్థానిక సంస్కృతిని తెలుసుకోవడంపై ఆసక్తి చూపిస్తుంటారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజల జీవన విధానం మొదలు, స్థానిక నృత్య, సంగీత కళా రూపాలను ఆస్వాదిస్తుంటారు. అది కేరళ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా.. ఎక్కడికెళ్లినా సరే కొత్త కొత్త విషయాలెన్నింటినో తెలుసుకుంటారు పర్యాటకులు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం స్థానికంగా అనువైన బస, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నాయి ఆయా రాష్ర్టాల పర్యాటక శాఖలు. వెళ్లిన చోట బస చేయడానికి స్టార్ హోటళ్లపై ఆధారపడకుండా స్థానిక ప్రజల ఇంట్లోనే ఉండే అవకాశం కల్పించేదే హోం స్టే. తక్కువ ఖర్చులో బస సౌకర్యం కల్పించడంతో పాటు, స్థానిక విశేషాలను తెలుసుకునేందుకు కూడా హోం స్టే అనువుగా ఉండడంతో ఎక్కువ మంది ఆసక్తి కనబర్చుతున్నారు. అన్ని రాష్ర్టాల్లోనూ ఇప్పుడు ఇదే క్రేజ్ నడుస్తుండడం గమనార్హం. కేరళ, గోవా, కర్ణాటక, తమిళనాడు మొదలు అన్ని రాష్ర్టాల్లోనూ ఇప్పడు వందల సంఖ్యలో హోం స్టే అవకాశాలున్నాయి. ఒక రోజుకు రూ. 800 నుంచి రూ. 2000.. ఆపైన చార్జి చేస్తున్నారు. పర్యాటక మంటే వినోదం మాత్రమే కాదు.. విజ్ఞానం కూడా. ఆయా ప్రాంతాల చారిత్రక విశేషాలు, ప్రజల జీవన సంస్కృతిని గురించి తెలుసుకోవడం. కొత్త ప్రాంతాలను, కొత్త ప్రజలను అర్థం చేసుకోవడం. అలాంటి అవకాశాన్ని హోంస్టే కల్పిస్తున్నది. స్థానిక సంస్కృతిని అర్థం చేసుకునేందుకు, ప్రజలతో మమేకమయ్యేందుకు హోం స్టే ఎంతగానో ఉపయోగపడుతుంది. స్థానిక సంస్కృతిలో భాగమైన ఇంటి వంటను సైతం రుచి చూసే అవకాశం లభిస్తుంది. స్థానిక పండుగలు, వేడుకలు వాటి నేపథ్యాలను ప్రజల ద్వారా తెలుసుకునేందుకు సైతం హోం స్టే దోహదపడుతుండడం గమనార్హం.తెలంగాణ పర్యాటక శాఖ సైతం రాష్ట్ర వ్యాప్తంగా హోం స్టే విధానాన్ని తీసుకురానుంది. అది పూర్తిగా అమలులోకి వస్తే.. రాష్ర్టానికి వచ్చే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు అధికారులు.
Tags: Tourism … big plate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *