అటానమస్ దిశగా ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల – టీటీడీ జేఈవో సదా భార్గవి
తిరుపతి ముచ్చట్లు:
మొదటి ప్రయత్నంలోనే న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ సాధించిన శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కళాశాల అటానమస్ దిశగా అడుగులు వేయాలని టీటీడీ జేఈవో సదా భార్గవి కోరారు. తిరుపతిలోని ఎస్జీఎస్ కళాశాలకు న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ వచ్చిన సందర్భంగా కళాశాల ప్రాంగణంలో మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఈవో మాట్లాడుతూ, టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని డిగ్రీ కళాశాలలకు న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ లభించడం సంతోషకరమన్నారు. కోవిడ్ తర్వాత న్యాక్ బృందం కళాశాలను సందర్శించిందని, ఇక్కడి మౌలిక వసతులను గుర్తించి ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపు అందించిందని చెప్పారు. ఇందుకు కృషి చేసిన డిఈవో , కళాశాల అధ్యాపకులు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.కళాశాలలో ఆలయ శిల్పకళ, ఆలయ సాంప్రదాయం ఉట్టిపడేలా ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించినట్టు తెలిపారు. ఆత్మీయ సమావేశంలో వాకర్స్ అసోసియేషన్, పెన్షనర్స్ అసోసియేషన్ పాల్గొని అధ్యాపకులను అభినందించడం సంతోషకరమన్నారు. కళాశాల పూర్వ విద్యార్థులైన డెప్యూటీ ఈవో గోవిందరాజన్, పిఆర్వో డా. టి.రవి తదితరులు కలిసి కళాశాల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఈవో డా. ఎం.భాస్కర్ రెడ్డి, ఎస్జీఎస్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డితోపాటు టీటీడీలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

Tags:Towards Autonomous SGS Arts College – TTD JEO Sada Bhargavi
