ట్రాఫిక్ తంటా

Traffic tanta

Traffic tanta

Date:23/11/2018
కర్నూలు ముచ్చట్లు:
స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కర్నూలులో చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా రోడ్ల విస్తరణ కార్యక్రమం నత్తనడకన సాగుతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదని పలువురు అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే కొన్నిరోజుల క్రితమే పలు ప్రాంతాల్లో డివైడర్లు నిర్మించారు. ఈ పనులకు బిల్లులు కూడా ఇచ్చి సొమ్ము చేసుకున్నారు గుత్తేదార్లు. అయితే కీలకమైన రహదారి వెడల్పు పనులు మాత్రం ఆశించినంత వేగంగా సాగడంలేదు. దీంతో ట్రాఫిక్ తీవ్ర సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇరుకైన రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు.
రోడ్డు చిన్నదిగా ఉండి దాని మధ్యలోనే డివైడర్లు వేయటంతో మరింత ఇరుకుగా మారిన దుస్థితి. ఈ సన్నటి రోడ్డుపైనే విపరీతమైన ట్రాఫిక్‌ నిలిచిపోయి ప్రజలు విసుగెత్తి పోతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు కూడా ఈ సమస్యను  నివారించలేక సతమతమవుతున్నారు. ఒక క్షణం ట్రాఫిక్‌ పోలీసులు లేకుంటే వాహనదారులు రాంగ్‌రూట్‌లో బైక్‌లు, ఆటోలు తిప్పేస్తున్నారు. దీంతో మరింత ట్రాఫిక్‌ జామ్ ఏర్పడుతుంది. ఇదే రోడ్డులో ఆర్‌టిసి బస్సుల కూడా బస్టాండ్‌లోకి వెళ్తున్నాయి. దీంతో ఈ రోడ్లపై ప్రయాణం ప్రయసగా మారిందని అంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రోడ్డు వెడల్పు చేయాల్సిన మున్సిపల్‌ అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అంతా కోరుతున్నారు.
Tags:Traffic tanta

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *