విహార యాత్రలో విషాదం..కర్ణాటక ధార్వాడ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం ..

Date:16/01/2021

గోవా ముచ్చట్లు:

బాల్యం జ్ఞాపకాలను, బడిలో అల్లరిని గుర్తు చేసుకుంటూ మినీ బస్సు కేరింతలతో బయలుదేరింది. బడి నుంచి విడిపోయి అప్పుడే 20ఏళ్లు గడిచాయంటూ, ఒకరికొకరు ఆట పట్టించుకుంటూ వారంతా మళ్లీ పిల్లల్లా మారిపోయారు.అర్ధరాత్రి విహారయాత్ర ప్రారంభమైనా అందరూ కబుర్లలో మునిగిపోయారు. ఊసులూ బాసలను నెమరువేసుకుంటున్నారు. ఇంతలో పెనువిషాదం.. ఎదురుగా వచ్చిన టిప్పర్‌ వీరి బస్సును బలంగా ఢీకొంది. ఆరుగురు అక్కడికక్కడే విగతజీవులయ్యారు. అందరూ రక్తసిక్తమయ్యారు. ఆసుపత్రిలో మరో ఏడుగురు చనిపోయారు.సంక్రాంతి సందర్భంగా డ్రైవరుతో సహా బాల్య స్నేహితురాళ్లు 16మంది, 16ఏళ్ల ఒక అమ్మాయి గోవా యాత్రకు వెళ్తుండగా శుక్రవారం ఉదయం కర్ణాటకలోని ధార్వాడ నగర శివార్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది కన్నుమూశారు.మృతుల్లో టిప్పర్‌ డ్రైవరు కూడా ఉన్నారు.మరికొద్ది సమయంలో మరొక స్నేహితురాలి నివాసంలో అల్పాహారానికి దిగాల్సి ఉండగా.. ఈలోపే వారిని మృత్యువు కబళించింది. ఎదురుగా వచ్చిన టిప్పర్‌ వీరి టెంపో ట్రావెలర్‌ మినీ బస్సును ఢీకొంది. ఓ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో ఎదురుగా వచ్చిన మినీ బస్సును టిప్పర్‌ అత్యంత వేగంగా ఢీకొంది.

 

 

దాదాపు 35నుంచి 38 ఏళ్ల మధ్యనున్న మృతులంతా దావణగెరె నగర పరిధి విద్యానగరకు చెందిన ఎంసీసీ బ్లాక్‌ నివాసులని గుర్తించారు. మృతులను పూర్ణిమా, ప్రవీణ, ఆశా, మానసి, పరంజ్యోతి, రాజేశ్వరి, శకుంతల, ఉషా, వేదా, నిర్మల, మంజుల, రజని, ప్రీతిగా గుర్తించారు. ఈ దుర్ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి.వీరిని ధార్వాడ నగర ఆసుపత్రికి తరలించారు. మృతులు దావణగెరె నగరంలోని సెయింట్‌పాల్‌్్స పాఠశాలకు చెందిన ఒకప్పటి విద్యార్థులు. సంక్రాంతి సందర్భంగా గురువారం అర్ధరాత్రి దావణగెరె నుంచి గోవా యాత్రకు బయలుదేరారు. తెల్లవారుజామున ధార్వాడకు సమీపంలోని ఇడగట్టి వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్‌ రూపంలో మృత్యువు వారిని కబళించింది. గాయాలైన వారి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులకు అందిన సమాచారం ప్రకారం..బాల్య స్నేహితురాళ్లు కొంతకాలంగా చిట్టీలు వేసుకున్నారు. అలా సమకూర్చుకున్న ఆదాయంతో సంక్రాంతినాడు గోవా యాత్రకు బయలుదేరారు. ఈ సమయంలోనే అంతులేని విషాదం అలుముకుంది. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ట్విటర్‌ ద్వారా ఆకాంక్షించారు.

సదుంలో శ్రీ అయ్యప్పస్వామికి అభరణాలు సమర్పిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి

Tags: Tragedy on excursion..Ghora road accident near Dharwad, Karnataka ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *