ఘోర విషాదం…

భర్తకు సపర్యలు చేసి వెళ్తుండగా భార్య దుర్మరణం

విశాఖపట్టణం  ముచ్చట్లు:

చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్తకు సపర్యలు చేసి ఇంటికి వెళ్తున్న మహిళను బస్సు ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. హనుమంతవాక కూడలిలో జరిగిన దుర్ఘటనకు సంబంధించి ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎంవీపీ కాలనీకి చెందిన బోర పుష్పలత (59) భర్త అనారోగ్యంతో బాధపడుతూ ఆరిలోవ ప్రాంతం హెల్త్‌ సిటీలోని ఓ ఆస్పత్రిలో కోమాలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో భర్తకు సోమవారం సేవలు చేసిన పుష్పలత మంగళవారం ఉదయం ఎంవీపీ కాలనీలోని ఇంటికి బయలుదేరారు. పుష్పలతను ఆమె అన్నయ్య బైక్‌పై హనుమంతవాక దరి ఎల్వీపీ కంటి ఆస్పత్రి వద్దకు తీసుకొచ్చి దించారు. అనంతరం ఆయన మళ్లీ ఆస్పత్రికి వెళ్లిపోగా… అక్కడి నుంచి పుష్పలత హనుమంతవాక వరకు ఫుట్‌పాత్‌పై నడుచుకొంటూ వచ్చారు. కూడలి దాటడానికి రోడ్డు మీదకు దిగుతుండగా నగరం నుంచి విజయనగరం వెళ్తున్న మహారాజా విజయరామ గజపతి రాజ్‌ కళశాలకు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో పుష్పలత కిందపడి బస్సు వెనుక చక్రాలకు,

 

 

ఫుట్‌పాత్‌కు మధ్యలో ఇరుక్కుపోయి ప్రమాద స్థలంలోనే ప్రాణాలు విడిచారు. బస్సు చక్రాలకు, ఫుట్‌పాత్‌కు మధ్యలో ఇరుక్కుపోయిన ఆమెను బయటకు తీయడానికి స్థానికులు, అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆరిలోవ ట్రాపిక్‌ పోలీసులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలు చిన్న కుమారుడు అనిల్‌రెడ్డి ఫిర్యాదుతో ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు, కుమార్తెకు ఇంకా వివాహం జరగాల్సి ఉంది. మరో వైపు ఆమె భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటువంటి సమయంలో బస్సు చక్రాల కింద పుష్పలత నలిగిపోయి చనిపోవడంతో బంధువులు కన్నీటపర్యంతమవుతున్నారు.

 

Tags: Tragedy…

Leave A Reply

Your email address will not be published.