ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన శిశువులకి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స

Date:25/12/2018
కరీంనగర్ ముచ్చట్లు:
కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశు కేంద్రంలో పడకల స్థాయి పెంచకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన శిశువుల్లో సగానికి పైగా శిశువులు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వేలు ఖర్చు పెట్టి చికిత్స చేయించుకోవాల్సి వస్తోంది.. పైసా ఖర్చు లేకుండా ప్రసవం జరిగిందని కుటుంబ సభ్యులు ఆనందించే లోపే.. పసికందు చికిత్స నిమిత్తం వేలల్లో బిల్లు కట్టాల్సి వస్తోంది.. కొందరు ఆసుపత్రి సిబ్బంది పలు కార్పొరేట్‌ ఆసుపత్రులకు ఏజెంట్లుగా మారి ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన శిశువులను ప్రైవేట్‌ ఆసుపత్రులకు పంపుతూ కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
కరీంనగర్‌ మాతా శిశు ఆరోగ్యం కేంద్రంలో నిత్యం 20 మందికి పైగా శిశువులు జన్మిస్తున్నారు.. ఆసుపత్రిలో జన్మించిన శిశువుల కోసం కేవలం తొమ్మిది వార్మర్లు మాత్రమే ఉండటం, అందులో ఐదుకు పైగా తప్పనిసరిగా అడ్మిట్‌ కేసులు ఉండటంతో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో జన్మించిన 20 మంది శిశువుల్లో 10 మందికి పైగా శిశువులను తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్‌లో చికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. అందుబాటులో ఉన్న కేంద్రంలో వార్మర్స్‌ ఖాళీ లేక ఉన్నత వైద్యం నిమిత్తం ప్రైవేట్‌కు వెళ్లలేక సకాలంలో వైద్య సేవలందక పసికందుల ప్రాణాలు గాల్లో కలిసిన సందర్భాలున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో దిన దినం పెరుగుతున్న ప్రసవాల దృష్ట్యా మాతా శిశు కేంద్రంలో అదనపు నవజాత శిశు కేంద్రం ఏర్పాటు చేసి పసికందులకు మెరుగైన వైద్యం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
కరీంనగర్‌ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నిత్యం 20 నుంచి 30 వరకు ప్రసవాలు జరుగుతాయి. ప్రసవించిన 30 మంది శిశువుల్లో సగానికి పైగా శిశువులకు(నెలలు నిండక, తక్కువ బరువు, శ్వాస తీసుకోలేకపోవడం, పచ్చలు) తదితర వ్యాధులతో జన్మిస్తారు. అలాంటి వారికి వార్మర్స్‌లో ఉంచి చికిత్స అందించడంతో పాటు అవసరాన్ని బట్టి వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ పెట్టాల్సి ఉంటుంది. నవజాత శిశుకేంద్రంలో మెత్తం 19 వార్మర్స్‌ ఉండగా బయట ఇతర ఆసుపత్రుల నుంచి వచ్చిన వారికి 10 వార్మర్లు ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన శిశువులకు కేవలం తొమ్మిది మాత్రమే ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన 30 మందిలో పదికి పైగా అడ్మిట్‌ నిమిత్తం కేంద్రానికి రావడంతో కేంద్రంలో వార్మర్లు ఖాళీ లేక 80 శాతానికి పైగా పసికందులను వారి చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారు.
ఇదే అదనుగా భావించిన కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులు తల్లిదండ్రులను భయబ్రాంతులకు గురిచేస్తూ రెండు నుంచి ఐదు రోజుల్లో వార్మర్సులో పెట్టి రూ.20 నుంచి రూ.50 వేల వరకు బిల్లు వేసి పేదల నుంచి వసూలు చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో వార్మర్స్‌ కొరతను గమనించిన కొందరు ఆసుపత్రి సిబ్బంది, అంబులెన్సు డ్రైవర్లు పలు కార్పొరేట్‌ ఆసుపత్రులకు ఏజెంట్లుగా మారి ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన శిశువులను చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ ఆసుపత్రులకు పంపించి కమీషన్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారితో పాటు ప్రైవేట్‌ అంబులెన్సు డ్రైవర్లు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన శిశువులను ప్రైవేట్‌ ఆసుపత్రులకు తరలిస్తూ కమీషన్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
Tags:Treatment of infants born to government hospital in private hospitals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *