గండాల్లో గిరిజన విద్య!

Tribal education in the gates!

Tribal education in the gates!

Date:20/09/2018
కుమురం భీమ్ ముచ్చట్లు:
కుమురం భీమ్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్ధులకు బోధన సక్రమంగా సాగడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుమురం భీమ్‌లోనే కాక మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్‌ల్లోనూ ఈ సమస్య ఉందని పలు విద్యార్ధి సంఘాల నేతలు అంటున్నారు. ప్రధానంగా ప్రాథమిక విద్య నిర్లక్ష్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. పేదలకు నాణ్యమైన విద్యనందించి వారి అభ్యున్నతికి తోడ్పడాలన్న ప్రభుత్వ ఆశయం నీరుగారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడిజిల్లాలోని ఏజెన్సీ విద్యావిభాగంలో బోధన కొంత సమస్యాత్మకంగా ఉన్నట్లు ఇటీవలిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు జిల్లాల్లో 906 గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 13,299 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇక ఉపాధ్యాయుల సంఖ్య 1194గా ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పాఠశాల వ్యవస్థను పటిష్టంచేసి పిల్లలందరినీ విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు 1986లో నాటి సర్కార్ చర్యలు తీసుకుంది.
ఈ క్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ, పాఠశాల విద్యా సంచాలకులు కలిసి ఐటీడీఏలో ప్రత్యేకంగా ఏజెన్సీ జిల్లా విద్యాధికారి పోస్టును ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇక్కడ ఏజెన్సీ జిల్లా విద్యాధికారిగా నియమితులైన అధికారులు తమ బాధ్యతలను నిర్వహిస్తూ ప్రాథమిక పాఠశాలను పర్యవేక్షించారు. గిరిజన విద్యార్ధులకు బోధన అందించేందుకు కృషి చేశారు. కొత్తజిల్లాల ఏర్పాటుతో ఉద్యోగులకు స్థానభ్రంశాలు కలిగాయి. దీంతో పలువురు ఉద్యోగులు ఇతర ప్రాంతాల్లో పనిచేయడానికి వెళ్లారు. దీంతో పాఠశాలలపై పర్యవేక్షణ మందగించింది. కొన్ని పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య అత్యల్పంగా ఉంది. మరికొన్ని బడుల్లో ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో లేని పరిస్థితి.
ఏజెన్సీ జిల్లా విద్యాధికారి పోస్టు ఖాళీగా ఉండడంతో గిరిజన ప్రాథమిక పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడుతోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ పోస్టులో అనుభవజ్ఞుడైన అధికారినైనా లేక సమర్థవంతమైన ఉపాధ్యాయులైనా నియమించి పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేస్తున్నారు. కానిపక్షంలో గిరిజన పిల్లలు ప్రాథమిక చదువుకు దూరమయ్యే దుస్థితి నెలకొంటుందని తేల్చిచెప్తున్నారు. ఇదిలాఉంటే ఉమ్మడి జిల్లాలో విద్యార్థులే లేని గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు 21 ఉన్నాయి.
ఇక 9 పాఠశాలల్లో అయితే 1 నుంచి 3 ముగ్గురు విద్యార్థులు మాత్రమే చదువుతున్నారని సమాచారం. నిబంధనల ప్రకారం 19 మంది విద్యార్థులకుగాను ఒక ఉపాధ్యాయుడు పనిచేయాల్సిఉంది. ఈ క్రమంలో మొత్తం 906 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా అదనంగా 200 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నట్లు గతంలో ఐటీడీఏ అధికారులు గుర్తించారు. ఈ అంశాన్ని సరిచేందుకు సంబంధిత అధికారులు సరైన చర్యలు తీసుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యార్థులు తక్కువగా ఉన్న బడుల్లో టీచర్లు మొక్కబడి విధులతో సరిపెడుతున్నారని పలువురు అంటున్నారు. ఈ పాఠశాలలపై పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు విద్యాసంవత్సరం ప్రారంభంలో బడిబాట కార్యక్రమం సజావుగా చేపట్టలేదని అంటున్నవారూ ఉన్నారు. దీంతో పలు పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉందని చెప్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ, సంబంధిత అధికారం యంత్రాంగం స్పందించి ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని గిరిజన విద్యార్ధులకు నాణ్యమైన విద్యాబోధన సాగేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.
Tags:Tribal education in the gates!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *