ఆ మూడు రాష్ట్రాల్లో గిరిజన ఓట్లే కీలకం

Tribal vote is crucial in those three states

Tribal vote is crucial in those three states

Date:16/11/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని అధికార సర్కారులతో పాటు ప్రతిపక్షాలు సైతం గిరిజనుల మెప్పుకోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో గిరిజన ఓటర్లశాతం అత్యధికం. అలాగే రాజస్థాన్‌లో గిరిజన జనాభా శాతం తక్కువగావున్నా చాలా నియోజక వర్గాల్లో వారి ఓట్లే కీలకమని తెలుస్తోంది. ఈ మూడు రాష్ట్రాల్లో 1990ల వరకూ కాంగ్రెస్‌కు గట్టి పట్టువున్న దాఖలాలున్నాయి. తరువాతి కాలంలో బీజేపీ కొంతమేరకు బలపడినా కాంగ్రెస్‌ పట్టు ఏమాత్రం తగ్గలేదని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఆదివాసీలు, గిరిజనుల ఆదరణ పొందేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారతీయ జనతాపార్టీ చత్తీస్‌ఘఢ్‌, మధ్యప్రదేశ్‌లలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చినా గిరిజనులను ఆకట్టుకోలేకపోయిందనే వార్తలున్నాయి.
స్థానిక గిరిజనుడిని ముఖ్యమంత్రిని చేయాలని మధ్యప్రదేశ్‌ గిరిజనుల ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని భోగట్టా. తద్వారా తమ అటవీ ప్రాంతాల్లోని వనరులు తమకే దక్కుతాయనేది ఇక్కడి గిరిజన నేతల వాదన. దీనికితోడు ధార్‌ జిల్లాలోగల పలు అటవీ గ్రామాల్ని బిర్లా గ్రూపునకు అప్పగించడాన్ని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే పులుల సంరక్షణ కేంద్రం పేరుతో హౌషంగాబాద్‌ జిల్లాలోని గిరిజనులను తరలించడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. రెండు ప్రాంతీయ గిరిజన పార్టీలు ఏర్పాటయ్యాయి. వాటిలో ఒకటైన జై ఆదివాసీ యువశక్తి(జేఏవైఎస్‌) పార్టీ మధ్యప్రదేశ్‌లోని 20 జిల్లాల్లో తన ఉనికిని చాటుకుంటోంది. మరొకటి గోండ్వానా గణతంత్ర పార్టీ(జీజీపీ) ఇది కూడా ఎంపీలోని 14 జిల్లాల్లో విస్తరించివుంది. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ లను దోపిడీ పార్టీలుగా అభివర్ణిస్తున్నట్టు భోగ్టటా. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని 27 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేసిన జీజీపీ 10 వేల నుంచి 30 వేల దాకా ఓట్లను దక్కించుకుంది. మరో ఆరు నియోజకవర్గాల్లో తన ఉనికిని నిలబెట్టుకుంది.
అలాగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 14 శాతం ఓట్లు సాధించిన నేపధ్యంలో రాబోయే ఎన్నికల్లో సీఎం పదవిపై ఆ పార్టీలు దృష్టిపెట్టినట్టు సమాచారం. దీనిని గ్రహించిన బీజేపీ నేతలు ఆందోళన పడుతున్నారని సమాచారం. ఫలితంగా గిరిజనుల్లో ఆదరణ చూరగొనేందుకు పొందేందుకు బీజేపీ నేతలు శతవిధాలా ప్రయాత్నాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. ఇక చత్తీస్‌ఘఢ్‌ విషయానికొస్తే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు పట్టుండగా, మరికొన్ని చోట్ల బీజేపీకి గిరిజనుల ఆదరణ ఉందని తెలుస్తోంది. ఇక్కడ గత ఎన్నికల్లో బీజేపీతో పోల్చిచూస్తే కాంగ్రెస్‌కు 9 శాతం అధికంగా గిరిజనుల ఓట్లు దక్కాయి. అయితే తాజాగా స్థానిక నేత అజిత్‌జోగి సొంత పార్టీ పెట్టుకోవడంతో కాంగ్రెస్‌ తన గిరిజన ఓటు బ్యాంకును కోల్పోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గిరిజనులు అత్యధికంగా ఉన్న ప్రాంతాలపైనే దృష్టి సారించారని సమాచారం. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గిరిజనులకు అండగా నిలుస్తామని హామీలిచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.
Tags:Tribal vote is crucial in those three states

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *