యాత్ర…. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు

... trip. There is not much speculation about this film

Date:12/02/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:
యాత్ర…. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. భారీ క్యాస్టింగ్ లేదు. ఎడాపెడా ఖర్చు చేసే బడ్జెట్ లేదు. సీనియర్ దర్శకుడు కాదు. పేరున్న ప్రొడ్యూసర్లు కాదు. సినీ పరిశ్రమ మద్దతూ పెద్దగా లేదు. పరిశ్రమలోని ఒకరిద్దరు మినహా ఈ సినిమా గురించి కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు ఎవరూ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో తప్పించి ఈ సినిమా గురించి విడుదలయ్యే వరకు సామాన్య ప్రజలకు పెద్దగా తెలిసింది కూడా లేదు. కేవలం, ఓ రాజకీయ నాయకుడికి సంబంధించిన సినిమాగా మాత్రమే అందరికీ తెలుసు. బయోపిక్ అంటే ఎలాగూ వారి జీవితాన్ని గొప్పగా చూపించేందుకే తీస్తారనే అభిప్రాయం ఎలాగూ ఉంటుంది. దీంతో ఈ సినిమా గురించి వైసీపీ అభిమానులు మినహా ఎవరూ ఎదురు చూడలేదు. అయితే, ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రజల మనస్సులు కదిలిస్తోంది. కళ్లు చెమర్చేలా చేస్తింది. పదేళ్ల కింద మరణించిన వైఎస్సార్ ను మరోసారి తలుచుకునేలా చేస్తోంది. దీంతో ఈ సినిమా రానున్న రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతోకొంత ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముందు ఇద్దరు నాయకులు బయోపిక్ లు తెరకెక్కాయి. ఎంత కాదన్నా.. ఈ సినిమాలతో రెండు పార్టీల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. ఇందులో మొదటిది ఎన్టీఆర్ బయోపిక్. ఇందులోని మొదటి భాగం కథానాయకుడు. భారీ బడ్జెట్, క్యాస్టింగ్, సినీ పరిశ్రమ, మీడియా అండదండలతో, భారీ అంచనాలతో తెరకెక్కి విడుదలైన ఈ సినిమా బాగుంది అనే పేరు వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా విజయవంతం అవుతుందని తెలుగుదేశం పార్టీ గట్టి నమ్మకాన్నే పెట్టుకుంది. సినిమా విడుదల రోజు టీడీపీ నేతలు ఎక్కడికక్కడ హంగామా చేశారు. అయితే, వారు ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. ఇక, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పాదయాత్ర ఆధారంగా మీడియం రేంజ్ సినిమాగా వచ్చిన ‘యాత్ర’పై వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. జగన్ కానీ, ఆయన కుటుంబం కానీ ఎక్కడా ఈ సినిమాను ప్రమోట్ చేయలేదు సరికదా కనీసం ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా హాజరుకాలేదు. అయితే, వైసీపీ నేతలు మాత్రం థియేటర్ల వద్ద, సోషల్ మీడియాలో సందడి చేశారు.
కానీ, పార్టీల అభిమానులు చూస్తే ఏ సినిమా అయినా ఒకటి, రెండు రోజులు మినహా ఆడటం కష్టం.యాత్ర సినిమాను కేవలం అభిమానులే కాకుండా సామాన్య ప్రజలు సైతం ఆదరిస్తున్నారు. సినిమాలో వైఎస్సార్ ను కళ్లకు కట్టినట్లుగా చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా, వైఎస్ ముఖ్యమంత్రిగా కావడానికి ముందు ఉన్న సమస్యలు, పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు. అంటే, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటి పాలనను గుర్తు చేశారు. వైఎస్ ప్రారంభించి నేటికీ అమలులో ఉన్న ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలను, వాటి ప్రాధాన్యతను మరోసారి ప్రజలకు ఈ సినిమా ద్వారా గుర్తు చేశారు. ఇక, వైఎస్ మరణించిన సన్నివేశాలను రియల్ విజువల్స్ చూపించడం ద్వారా ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ సినిమాలో ఎక్కడా వివాదాలు లేవు. వచ్చే ఎన్నికల్లో కీలకమైన చంద్రబాబు, జగన్ గురించి సినిమాలో ఏమీ చూపించలేదు.
వెళ్లాల్సిన మెసేజ్ ప్రజల్లోకి వెళ్లింది. గత ఎన్నికల్లో వైఎస్ ప్రభావం కొంతమేర ఉంది. కానీ, ఆయన మరణించి పదేళ్లు అవుతున్నందున ఈ ఎన్నికల్లో ఆయన ప్రభావం ఏమీ ఉండదని అంతా అనుకున్నారు. ఇటువంటి సమయంలో ‘యాత్ర’ సినిమా ఆయనను మరోసారి ప్రజలకు గుర్తు చేస్తోంది. ఈ సినిమా విజయవంతం కావడం రానున్న ఎన్నికల్లో వైసీపీకి బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. వైసీపీ నాయకులు ఈ సినిమాను బాగానే ఉపయోగించుకుంటున్నారు. కొందరైతే ఈ సినిమాను స్క్రీన్ల ద్వారా గ్రామాల్లో ప్రదర్శించాలని కూడా భావిస్తున్నారట. మొత్తానికి, సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ‘యాత్ర’ ఎన్నికల్లో ఎంతోకొంత ప్రభావం చూపే స్థాయికి చేరుతున్నట్లు కనిపిస్తోంది.
Tags:… trip. There is not much speculation about this film

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *