త్రిముఖ  పోరులో  గులాబీకి ప్లస్ చీలిక ఓట్ల పైనే టీఆర్ఎస్ గురి

TRS aims at plus split votes for rose in triangular battle

TRS aims at plus split votes for rose in triangular battle

Date:19/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణలో రానున్నా అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరంటూ జరిగితే టీఆర్‌ఎస్‌కు ఎంతో కొంత కలిసొచ్చే అవకాశాలున్నాయని రాజకీయపరిశీలకులు అంచనా వేస్తున్నారు. ముఖాముఖీ పోరైతే కొద్దిగా ఇబ్బందులు తప్పకపోవచ్చునని, అదే త్రిముఖపోరైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి టీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూరే అవకాశాలు లేకపోలేదంటున్నారు. కాంగ్రెస్‌, టీడీపీ, జనసమితి, సీపీఐలు కలిసి మహాకూటమిగా ఎన్నికలకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నాయి.
ఈమేరకు కాంగ్రెస్‌, టీడీపీ, జనసమితి, సీపీఐ మధ్య చర్చలు కూడా జరిగాయి. ప్రాథమిక చర్చల్లో టికెట్ల కేటాయింపుపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పొత్తులు ఖరారైతే, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఒక వైపు మహాకూటమి ఏర్పాటుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తుండగా, సీపీఎం, జనసేనలు జట్టుకట్టి బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌ ) వేదికగా ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నాయి. అదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, టీఆర్‌ఎస్‌ లబ్ధి పొందే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయని రాజకీయపరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలంగాణలో జనసేనకు వ్యవస్థాగత నిర్మాణం కూడా లేకపోయినప్పటికీ పొత్తులు పెట్టుకోడానికి సీపీఎం నాయకులు ఆసక్తి కనబరుస్తున్నారు. పవన్‌, సీపీఎంతో జత కడితే, రానున్న ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌కు ఆయనే స్టార్‌ క్యాంపెయినర్‌ కానున్నారనేది నిర్వివాదాంశం.జనసేనతో పొత్తుకు బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ తరుపున  సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇప్పటికే రెండు దఫాలుగా ఆపార్టీ  పొలిటికల్‌ ఎఫైర్‌ కమిటీతో  చర్చలు జరిపారని తెలుస్తోంది. పవన్‌ వస్తే కూటమికి చాలా బలం వస్తుందని ఆయన వారికి ప్రతిపాదించారు.
అయితే సహజంగానే ఆ కమిటీ సభ్యులు తుది నిర్ణయం వెల్లడించలేదు. తమ్మినేని చేసిన ప్రతిపాదనను పవన్‌ ముందుంచారు.  తుది నిర్ణయం తీసుకోడానికి తాను స్వయంగా సీపీఎం నేతలతో చర్చిస్తానని పవన్‌ పేర్కొన్నట్లు తెలుస్తోంది.  రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమనాయకుడిగా కేసీఆర్‌కు అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభించింది.
అయితే గత నాలుగున్నర ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, ఎంతో కొంత ప్రజావ్యతిరేకత అన్నది ఖాయమని, ఆ ప్రజావ్యతిరేక ఓటు త్రిముఖ పోరులో చీలి, టీఆర్‌ఎస్‌కు మేలు చేయనుందని రాజకీయపరిశీలకులంటున్నారు.  త్రిముఖ పోటీ కారణంగా  ప్రభుత్వ వ్యతిరేక ఓటు రెండుగా చీలుతుందని, అది బీఎల్‌ఎఫ్‌తో  పవన్‌ జతకట్టడం వల్ల మరింతగా చీలే అవకాశాలున్నాయని వారు అంచనా వేస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ విజయం నల్లేరుపై నడకలా మారుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి భవిష్యత్ లో ఏమి జరగనున్నదో చూడాలిమరి!
Tags:TRS aims at plus split votes for rose in triangular battle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *