ట్రంప్ విపరీత పోకడలు

Date:13/03/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
వివిధ దేశాలకు దేశానికి దిగుమతి అయ్యే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై పది శాతం సుంకం విధించడానికి అమెరికా అధ్యక్షుడు సిద్ధపడుతుండటంతో, ఈ చర్య క్రమంగా వాణిజ్య యుద్ధానికి దారితీస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయి. ట్రంప్ నిర్ణయం విపరీత పరిణామాలకు దారితీస్తుందని అమెరికాలోని చాలామంది చట్టసభ సభ్యులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ ఆర్థిక సలహాదారు ఒకరు ఈ విషయమై విభేదిస్తూ రాజీనామా కూడా చేశారు. అయినా ట్రంప్ ఇటీవలికాలంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా ఉక్కు, అల్యూమినియంపై సుంకాలు విధిస్తే, తాము చూస్తూ ఊరుకోబోమని, తాము కూడా కొన్ని అమెరికా వస్తువులపై భారం వేస్తామని యూరోపియన్ యూనియన్, చైనా హెచ్చరించాయి. భారత్‌తో పాటు మెక్సి కో, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణకొరియా, కెనడా తదితర దేశాలు ట్రంప్ ప్రతిపాదనల పట్ల ఆందోళన వ్యక్తంచేశాయి. అమెరికా చర్యలకు ప్రతిచర్యగా తాము కూడా సుంకాలు విధిస్తామని యూరోపియన్ యూనియన్ వాణిజ్య కమిషనర్ సిసీలియా మామ్‌స్ట్రామ్ హెచ్చరించారు. అమెరికా టీషర్టులు, పడక బట్టలు, మోటారు సైకిళ్ళు, పొగాకు మొదలైన వస్తువుల జాబితాను రూపొందిస్తున్నట్టు ఈయూ అధికారులు వెల్లడించారు. 1930 దశకంలో ఆర్థిక మహా మాంద్యం నేపథ్యంలో వివిధ దేశాల మధ్య వాణిజ్యయుద్ధం సాగింది. ఆ తరువాత మళ్ళా అంతటి వాణిజ్య యుద్ధానికి ట్రంప్ చర్య దారితీయవచ్చుననే ఆందోళన వ్యక్తమవుతున్నది. మరీ అంతగా భయపడవలసిన అవసరం లేదని చెప్పేవారూ ఉన్నప్పటికీ, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఒకసారి ఇటువంటి రక్షిత చర్యలు మొదలైన తరువాత పరిణామాలు ఎట్లా ఉండేదీ ఊహించడం కష్టం. చైనా కూడా ఇటువంటి జాబితానే తయారు చేస్తున్నదని చెబుతున్నారు. ట్రంప్ మాత్రం వాణి జ్య యుద్ధమంటూ మొదలైతే అది ఎదుటి దేశాలకే నష్టం తప్ప తమకు కాదని అంటున్నారు.ట్రంప్ రెండు వస్తువులపై సుంకాలు విధించడం అమెరికా వాణిజ్య విధానంలో చరిత్రాత్మక మార్పుగా చెబుతున్నారు. ట్రంప్ దేశీ కం పెనీలను నష్టాలబారిన పడకుండా కాపాడుకోవడానికి ఉక్కు, అల్యూమినియం దిగుమతుల ను అడ్డుకుంటున్న మాట నిజమే. అయితే ఈ సుంకాల విధింపు ట్రంప్ మొత్తం వ్యూహంలో ఒక భాగమే. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీవో)ను పనికిరాకుండా చేయడం, తద్వారా ఇప్పుడున్న బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను కుప్పకూల్చడం ట్రంప్ లక్ష్యం. ట్రంప్ అమెరి కా అధ్యక్ష పదవిని చేపట్టిన నాటి నుంచి డబ్ల్యుటీవోను నిరర్థకం చేసే దిశగా పావులు కదుపుతున్నారు. డబ్ల్యుటీవో ఫిర్యాదుల విచారణ కమిటీకి సభ్యులను నియమించకుండా అడ్డుకున్నారు. దీంతో ఫిర్యాదుల విచారణ సరిగ్గా సాగడం లేదు. ఇదేవిధంగా నియామకాలు నిలిచిపోతే రెండేండ్లలో డబ్ల్యుటీవో అచేతనంగా మారుతుంది.అంతర్జాతీయస్థాయిలో తీర్పరి పాత్ర వహించే సంస్థ లేకపోతే, బలమైన దేశాలు బలహీనదేశాలను ఇబ్బందులకు గురిచేస్తాయి. భారత్ తదితర దేశాలు ప్రపంచీకరణకు అంగీకరించే దశలో అనేక చర్చలు జరిగాయి. ఈ క్రమం లో కొత్త వాణిజ్య నియమాలు గల ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడ్డది. భారత్‌ను అమెరికా వంటి దేశాలు ఇబ్బంది పెట్టినప్పుడల్లా భారత్ డబ్ల్యుటీవో వేదికగా ఫిర్యాదు చేసి న్యాయం పొందింది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే సరుకులపై కూడా అమెరికా సుంకాలు విధించడానికి సమాయత్తమవుతున్నది. అయితే డబ్ల్యుటీవో బలహీనపడిన క్రమంలో భారత్ ఆ వేదిక ద్వారా న్యాయం పొందే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఎగుమతులపైనా, రక్షణరంగ పరికరాలపైన భారత్ ఇటీవలి కాలంలో ఆధారపడటం పెరిగింది. అందువల్ల ఈయూ, చైనా మాదిరిగా అమెరికాను బలంగా ధిక్కరించే పరిస్థితిలో భారత్ లేదని వాణిజ్యరంగ విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్‌లో రైతులకు మద్దతు ధర ఇవ్వడం ద్వారా ఆహారం సేకరించి, భారీ ఎత్తున నిలువ చేసుకునే విధానం ఉన్నది. ఈ ఆహార నిలువలు గడ్డు పరిస్థితుల్లో ఉపయోగపడుతాయి. అయితే రైతులకు మద్దతు ధర ఇచ్చే విధానాన్ని అమెరికా తప్పుపడుతున్నది. డబ్ల్యుటీవో వేదికపై భారత్‌పై అమెరికా దాడి చేస్తుంటే, చైనా మద్దతు ఇస్తున్నది. దీంతో ప్రధాని మోదీ అనుసరిస్తున్న అమెరికా అనుకూల విధానాలు ప్రశ్నార్థకమవుతున్నాయి.ప్రపంచీకరణ విధానాల ద్వారా మూడవ ప్రపంచ దేశాల తలుపులు తెరిపించిన స్వేచ్ఛా వాణిజ్యాన్ని పెంపొందించిన పెద్ద దేశాలు తాము, మాత్రం వాణిజ్య రక్షిత విధానాలను అవలంబిస్తున్నాయి. అయితే చైనా, భారత్ తదితర వర్ధమాన దేశాలు డబ్ల్యుటీవో వేదికపై కలిసికట్టుగా వ్యవహరిస్తున్నాయి. దీంతో అమెరికా, ఈయూ వీలైనప్పుడల్లా తమ పెత్తనం చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. చైనా, భారత్ తదితర దేశాలు ఈ కుట్రలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా వ్యవహరించాలి. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ పేర మూడు దశాబ్దాలకు పైగా అమలవుతున్న విధానాలు ప్రపంచ దేశాలలో తీవ్ర సంక్షోభాన్ని తెచ్చిపెడుతున్నాయి. దీంతో బహుళ పక్ష వాణిజ్యాన్ని న్యాయబద్ధంగా మార్చడానికి వర్ధమాన దేశాలు కలిసికట్టుగా వ్యవహరించాలె. ప్రైవేటీకరణ విధానాలను, పొదుపు చర్యల పేర సంక్షేమ పథకాలపై కోతలను సమీక్షించుకోవడం కూడా మంచిది. ట్రంప్ విధానాలు ఆర్థిక విధానాలపై పునరాలోచనకు పురికొల్పితే సంక్షోభాలు సమసిపోతాయి.
Tags: Trump eccentric trends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *