Natyam ad

తెలంగాణ ఐసెట్, పీజీఈసెట్ నోటిఫికేషన్లు విడుదల.

వరంగల్: తెలంగాణలో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలకు మంగళవారం ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2022-23 విద్యా సంవత్సరానికిగాను డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్సెట్, టీఎస్ ఈడీసెట్, టీఎస్ ఐసెట్, టీఎస్ పీజీఈసెట్ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ప్రకటించారు. తాజాగా రాష్ట్రంలో నిర్వహించనును ఐసెట్, పీజీఈసెట్ నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఏప్రిల్ 6 నుంచి జూన్ 27 వరకు ఐసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వర్సిటీ పేర్కొంది. రూ.250 ఆలస్య రుసుంతో జులై 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. జులై 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఐసెట్ పరీక్ష జరుగుతుంది. ఆగస్టు 4న ప్రాథమిక కీ, 22న ఫలితాలు విడుదల చేయనున్నట్లు వర్సిటీ వెల్లడించింది. ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 12 నుంచి జూన్ 22 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో జులై 10వ తేదీ వరకు పీజీఈసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పీజీఈసెట్ పరీక్షల కన్వీనర్ తెలిపారు. జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు పీజీఈసెట్ పరీక్ష జరుగుతుంది..