ఎంబిసి వద్ద మినీ అన్నదానం కాంప్లెక్స్ స్థల పరిశీలన చేసిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
తిరుమల ముచ్చట్లు :
శ్రీవారి మెట్టు నడకదారిలో వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఎంబిసి ప్రాంతంలో మినీ అన్నదానం కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.సోమవారం ఆయన అధికారులతో కలసి శ్రీవారి మెట్టునుంచి భక్తులు తిరుమలకు చేరుకునే ప్రాంతాన్ని పరిశీలించారు. నడచి వచ్చిన పలువురు భక్తులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో మినీ అన్నదానం కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి భూమి చదును చేయాలని, తగిన వసతులు ఏర్పాటు చేసి భక్తులకు అన్నప్రసాదం అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.అనంతరం ఆర్బిసి సెంటర్లోని నివాస గృహాలను పరిశీలించి, వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ఆరాధన కేంద్రం నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఆరాధన కేంద్రం నిర్మాణ ప్రాంతంలో ఇంకా మిగిలిఉన్న ఇళ్ళను తొలగించి పార్కింగ్ ప్రాంతంగా తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఆరాధన కేంద్రం నిర్మాణ డిజెన్లు త్వరగా ఖరారు చేసి టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలన్నారు.

గో పూజలో పాల్గొన్న చైర్మన్
కనుమ పండుగ సందర్బంగా తిరుమల లోని గోశాలలో సోమవారం నిర్వహించిన గోపూజలో చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. గోమాతకు పూలు, పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు.ఎస్టేట్ విభాగం ఒఎస్డీ మల్లిఖార్జున,విజివో బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags;TTD Chairman YV Subbareddy inspected the site of Mini Annadanam Complex at MBC
