ప్రగతి పథంలో టీటీడీ విద్యాసంస్థలు : జేఈవో సదా భార్గవి
– ఘనంగా శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల 30వ వార్షికోత్సవం
తిరుపతి ముచ్చట్లు :

సామాజిక బాధ్యతగా పెద్ద ఎత్తున విద్యా సంస్థలను నిర్వహించడం టీటీడీ కే సాధ్యమైందని జేఈవో శ్రీమతి సదా భార్గవి అన్నారు . టీటీడీ ఛైర్మన్ శ్రీవైవి.సుబ్బారెడ్డి, ఈఓ
శ్రీ ఎవి.ధర్మారెడ్డి పర్యవేక్షణ, అధ్యాపకులు, సిబ్బంది సమష్టి కృషితో విద్యాసంస్థలు ప్రగతి పథంలో నడుస్తున్నాయని ఆమె తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల 30వ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జేఈవో సదా భార్గవి మాట్లాడుతూ , తిరుపతిలో దాదాపు 100 ఎకరాల స్థలంలో పీజీ, డిగ్రీ, ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు కృషిచేసిన డాక్టర్ రాజేశ్వరిమూర్తి సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. అదేవిధంగా శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విశ్రాంత తెలుగు విభాగాధిపతి శ్రీమతి ప్రేమావతి కళాశాలల అభివృద్ధికి నిరంతరం సూచనలు సలహాలు అందిస్తున్నారని ధన్యవాదాలు తెలియజేశారు.
విద్యార్థులు తెలిసీ తెలియని వయసులో ఇంటర్మీడియట్ లోకి అడుగుపెడతారన్నారు. ఈ దశలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తగిన విధంగా తోడ్పాటును అందిస్తే వారు ఉన్నత దశకు చేరుకోగలరని చెప్పారు. చదువు కేవలం ఉద్యోగం కోసమే కాదని, పరిపూర్ణమైన మనిషిగా తయారు కావడానికి విద్యను అభ్యసించాలని అన్నారు. ఒత్తిడి కారణంగా ఆత్మహత్యల వైపు వెళ్లకుండా, విద్యపై ఇష్టాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యాసంస్థల్లో మౌలిక వసతులు పెంచడంతోపాటు మరింత నాణ్యమైన విద్యాబోధన జరుగుతోందని ఆమె చెప్పారు . తద్వారా కళాశాలలకు న్యాక్, ఎన్.బి.ఎ.గుర్తింపు లభిస్తున్నాయని తెలిపారు. క్రమశిక్షణ, అంకితభావం, ప్రణాళికాబద్ధంగా చదివితే ఎవరైనా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు.
ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరించాలని, సనాతన హైందవ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని జేఈవో కోరారు. ఇంజినీరింగ్, మెడికల్, సిఏ తదితర పోటీ పరీక్షల్లో విద్యార్థినులు విజయం సాధిస్తే,
ఆ కోర్సులు చదివేందుకు అయ్యే ఖర్చును టీటీడీ భరిస్తుందని ఈ సందర్భంగా సదా భార్గవి వెల్లడించారు.అనంతరం పలు అంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ఆమె ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు. ముందుగా కళాశాలలోని శ్రీవారి విగ్రహానికి జేఈవో పూజలు నిర్వహించారు. కళాశాల ప్రగతి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డిజిటల్ క్లాస్ రూమ్ ను ఆమె ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను చక్కగా ప్రదర్శించారు.
ఆకట్టుకున్న ఆర్ట్ ఎగ్జిబిషన్
తిరుపతికి చెందిన ప్రముఖ చిత్రకారిణి శ్రీమతి బి.కిరణ్ కుమారి రూపొందించిన చిత్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ జేఈవో ప్రారంభించారు. ఎగ్జిబిషన్ లోని గ్యాలరీలను సందర్శించి చాలా బాగున్నాయని చిత్రకారిణిని అభినందించారు.ఈ కార్యక్రమంలో డిఇఓ డా. భాస్కర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డా.భువనేశ్వరి దేవి, శ్రీ పద్మావతి డిగ్రీ, పిజి కళాశాల ప్రిన్సిపాల్ డా. మహదేవమ్మ , పద్మావతి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా. అశుంత, స్టూడెంట్ లీడర్ కుమారి శైలా భాను, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags:TTD educational institutions on the path of progress: JEO Sada Bhargavi
