Natyam ad

దేశానికి ఐకాన్ గా టీటీడీ మానుస్క్రిప్ట్స్ ప్రాజెక్టు-టీటీడీ ఈవో  ఎవి ధర్మారెడ్డి

– వీటిపై పిహెచ్ డి లు చేసే స్థాయికి తీసుకుని రావాలి

 

తిరుపతి ముచ్చట్లు:

 

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మాను స్క్రిప్ట్స్ ప్రాజెక్టు దేశానికే ఐకాన్ గా తయారు కావాలని టీటీడీ ఈవో   ఎవి ధర్మారెడ్డి చెప్పారు. ఇక్కడ స్కాన్ చేసి భద్రపరచిన మాను స్క్రిప్ట్స్ పై పిహెచ్ డి లు చేసే స్థాయికి తీసుకుని రావాలన్నారు. మానుస్క్రిప్ట్స్ ప్రాజెక్టు ప్రగతిపై సోమవారం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు ప్రగతిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.ఈ సందర్భంగా ఈవో   ధర్మారెడ్డి మాట్లాడుతూ, పురావస్తు శాఖ నుంచి తెచ్చిన సుమారు 5500 తాళపత్ర గ్రంధాల్లో ఇప్పటివరకు 3370 తాళపత్ర గ్రంధాలు స్కాన్ చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో 2,11,313 తాళపత్రాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. రెండు నెలల్లో మిగిలిన గ్రంధాలను కూడా స్కాన్ చేయడానికి అవసరమైన సాంకేతిక సహకారం, సిబ్బందిని ఇస్తామని ఈవో వివరించారు. ప్రస్తుతం రోజుకు ఎన్ని తాళపత్రాలు స్కాన్ చేస్తున్నారు, తాళపత్రం శుభ్రపరచడం నుంచి తైల శోధన, స్కానింగ్ వరకు జరిగే వివిధ ప్రక్రియల గురించి ఈవో తెలుసుకున్నారు. వేదాంతం, పురాణాలు, కావ్యాలు, జ్యోతిష్యం తదితర అంశాలకు సంబంధించిన తాళపత్ర గ్రంధాలు ఉన్నాయని అధికారులు   ధర్మారెడ్డి కి వివరించారు. ఇవి జాతి సంపద అని, వీటిని జాగ్రత్తగా స్కాన్ చేసి ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా తెలుగులో తర్జుమా చేయాలని ఈవో అధికారులకు సూచించారు. ఇలా తర్జుమా చేసిన వాటిని పుస్తక రూపంలో తేవడానికి ఒక ప్రాజెక్టు తయారు చేసి ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ పుస్తకాల ఆధారంగా పి హెచ్ డి చేయడానికి అవసరమైన వాతావరణం కల్పించి పిహెచ్ డి లు ప్రదానం చేసే ఏర్పాటు చేయాలన్నారు.

 

 

 

Post Midle

దేశంలో ఇంకా ఎక్కడ మాను స్క్రిప్ట్స్ ఉన్నాయో తెలుసుకుని వాటిని సేకరించి స్కాన్ చేసి భద్రపరచ గలిగితే పరిశోధకులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న గ్రంధాలను అంశాల వారీగా వర్గీకరించి వాటికి ప్రత్యేకంగా నంబర్లు వేసి భద్రపరచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సనాతన జీవన్ ట్రస్టు సహకారంతో టీటీడీ ఆధ్వర్యంలో వేద విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ప్రాజెక్టుకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తేవాలని ఆయన ఆకాంక్షించారు.జేఈవో శ్రీమతి సదా భార్గవి, విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య రాణి సదాశివ మూర్తి, మానుస్క్రిప్ట్స్ ప్రాజెక్టు డిప్యూటీ ఈవో   విజయలక్ష్మి, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య రాధేశ్యాం సమీక్షలో పాల్గొన్నారు.

 

Tags: TTD Manuscripts Project as an icon for the country – TTD EO AV Dharma Reddy

Post Midle