టీటీడీ ఎస్‌పిడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాలకు ఎన్‌బిఏ గుర్తింపునకు కృషి చేయాలి- జెఈవో సదా భార్గవి
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళ పాలిటెక్నిక్ కళాశాలకు నేషనల్ బోర్డ్ అఫ్ అక్రిడిటేషన్ (ఎన్‌బిఏ) గుర్తింపునకు అవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీటీడీ జెఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిసపాలన భవనంలోని సమావేశ మందిరంలో జెఈవో శనివారం కళాశాలల ప్రిన్సిపాల్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జెఈవో మాట్లాడుతూ, ఎన్‌బిఏ బృందం జూలై చివరి వారంలో కళాశాలను సందర్శించనున్న నేపథ్యంలో చేయవలసిన ఇంజినీరింగ్, ఇతర విభాగాల పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కళాశాలలో మౌళిక వసతులను మరింతగా మెరుగుపరచాలన్నారు.
కళాశాలలోని తరగతి గదులు, హాస్టల్ గదులు, ప్రహరి గోడకు పెయింటింగ్, సూచిక బోర్డుల ఏర్పాటు, కళాశాలలో ఐటి తరగతి గదులు, ల్యాబ్‌ల ఆధునీకరణ, పచ్చదనం పెంపొందించడం తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
పాఠశాల విద్యను అభివృద్ధి పరచడం కోసం రెగ్యులర్ పాఠశాలలకు మాన్ స్క్రిప్ట్స్ విభాగం డెప్యూటీ ఈవో విజయలక్ష్మి, ప్రత్యేక ప్రతిభా వంతుల పాఠశాలలకు శ్వేత డెరెక్టర్ ప్రశాంతిని ప్రత్యేకాధికారులుగా నియమించినట్లు చెప్పారు. టీటీడీ విద్యాసంస్థల్లో నాణ్యతాప్రమాణాలను మరింత అభివృద్ధి పరచే దిశగా వీరు కృషి చేయాలన్నారు. టీటీడీ విద్యా సంస్థలకు చెందిన ప్రిన్సిపాల్లు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో తరచూ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక అందచేయాలన్నారు. విద్యార్థులకు విలువలతో కూడిన, నాణ్యమైన విద్యా ప్రమాణాలు అందించి మరింత ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం ప్రతి ఒక్కరు సమిష్టిగా, భాధ్యతాయుతంగా పని చేయాలని జెఈవో సూచించారు.
Tags: TTD SPW Polytechnic College should strive for NBA recognition – JEO Sada Bhargavi