రెండు ప్రమాదాలు..పది మంది మృతి

Date:12/04/2019
కర్నూలు ముచ్చట్లు :
ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో పది మంది ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. అనంతరపురం జిల్లాలో మినీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఎమ్మిగనూరుకు చెందిన ఖాజా (40) తన కుటుంబ సభ్యులతో కర్ణాటకలో రాయచూరు జిల్లా ఏరిగేరి బడెసబ్ దర్గాకు వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తోన్న వాహనం ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. నందవరం మండలం అలహర్వి గ్రామం బస్టాండ్ దగ్గర ఆయిల్ ట్యాంకర్‌ను డీకొట్టడంతో ఖాజా, ఏడాది వయసున్న ఆయన కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన సోదరుడు షఫీని చికిత్స కోసం కర్నూలు తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు.
ఆగి ఉన్న వాహానాన్ని గుర్తించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు నిర్ధరించారు. మృతుడు ఖాజా వాహనం నడుపుతుండగా, సోదరుడు ముందు సీట్లలో, కుమార్తె, భార్య, మరదలు వెనుక భాగంలో కూర్చున్నారు. నిద్రమత్తులో వాహనం గమనించకపోవడంతో వేగంగా వచ్చి ఢీకొట్టారు. ప్రమాదంలో మహిళలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భర్తలను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతం. ఏడాది పాప కూడా దుర్మరణం చెందడం అందరి హృదయాలను కలచివేస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు. పోస్ట్‌మార్టమ్ అనంతరం మృతదేహాలను వారి బంధువులకు  అప్పగించారు.
Tags:Two accidents were killed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *