సిమెంటు రోడ్లు పగులగొట్టిన ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్ – కమిషనర్ నరసింహప్రసాద్
– సచివాలయ కార్యదర్శి , ఫిట్టర్ ఇన్ చార్జ్ పై వేటు
పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని రహమత్ నగర్‌లో నూతనంగా వేసిన సిమెంటురోడ్లు అనుమతి లేకుండ పగులగొట్టి, పైపులైన్లు వేయించిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ కొరడా ఝులిపించారు. పట్టణంలోని రహమత్‌నగర్ రహదారిలో మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్లి ఏటిగడ్డపాళ్యెంలో ఆర్‌వో ప్లాంటు ప్రారంభించాల్సి ఉంది. ఏర్పాట్లను గురువారం రాత్రి కమిషనర్ నరసింహప్రసాద్ పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సమయంలో అనుమతి లేకుండ నూతన సిమెంటు రోడ్లను పగులగొట్టి, గుంతలు తీసి , పైపులైన్లు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండ పనులు చేయడంపై కన్నెర్ర చేశారు. మంత్రి పర్యటన సమయంలో రోడ్లు పగులగొట్టి ఇబ్బంది కలిగించిన మున్సిపల్ నీటి విభాగం ఫిట్టర్ ఇన్‌చార్జ్ జహీర్‌ను , 4వ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ పురుషోత్తంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంఘటన ఉద్యోగుల్లో గుబులు పుట్టించింది. కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రాంతాలలో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా ఆదాయానికి గండి కొట్టే విధంగా ఎవరు ఏ పనులు చేపట్టిన సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నూతనంగా వేసిన సిమెంటు రోడ్లను అనుమతి లేకుండ పగులగొట్టితే సహించేది లేదన్నారు. ఇలాంటి కార్యక్రమాలపై సంబంధిత కౌన్సిలర్లు, వలంటీర్లు సమాచారం అందించాలని కోరారు.
Tags: Two employees suspended for breaking cement roads – Commissioner Narasimhaprasad
