ఇబ్రహీంపట్నం పరిధిలో కాల్పులు కలకలం.. ఇద్దరు రియల్టర్ల మృతి
హైదరాబాద్ ముచ్చట్లు:
రంగా రెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం పరిధిలోని కర్ణంగూడ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. స్కార్పియో కారులో వెళ్తున్న ఇద్దరు రియల్టర్లపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో రియల్టర్ నవార్ శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, కోమటిరెడ్డి రాఘవేందర్ రెడ్డి బీఎన్ రెడ్డిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.అయితే శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి కలిసి ఇబ్రహీంపట్నం పరిధిలోని లేక్ వ్యూస్‌కు సమీపంలో వెంచర్ వేసినట్లు వారి సన్నిహితులు తెలిపారు. అయితే ఈ ఉదయం ఆ వెంచర్‌లో బోర్ వేయించేందుకు వీరిద్దరూ వెళ్లినట్లు చెప్పారు. ఆ సమయంలోనే శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు వారి సన్నిహితులు పేర్కొన్నారు. ఘటనాస్థలిని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.కాగా కాల్పులకు గల కారణం భూ వివాదాలే అని తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, మట్టారెడ్డి కలిసి పటేల్‌గూడలో 22 ఎకరాల్లో ఓ వెంచర్ వేశారు. ఈ వెంచర్ విషయంలో మట్టారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి మధ్య గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే ఉదయం 5 గంటలకు ఇంట్లో నుంచి శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి వెళ్లారు. మట్టారెడ్డి పిలవడం వల్లే వీరిద్దరూ బయటకు వెళ్లినట్లు వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భూ వివాదాల కారణంగానే మట్టారెడ్డి.. మిగతా ఇద్దరిపై కాల్పులు జరిపినట్లు మృతుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మట్టారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామం అల్మాస్‌గూడ.
Tags: Two realtors killed in Ibrahimpatnam shooting