రెండు జిల్లాల్లో ఒకే పేరుతో రెండు గ్రామాలు

Date:12/01/2019
ఆదిలాబాద్‌ ముచ్చట్లు:
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఖానాపూర్ అనే గ్రామాలు ఉన్నాయి. ఒకే పేరుతో ఉన్నప్పటికీ ఈ రెండు ఊళ్లూ వేర్వేరు రెవెన్యూ గ్రామాలు. ఆదిలాబాద్ ఖానాపూర్ లో వక్ఫ్ భూమికి, నిర్మల్ జిల్లా ఖానాఫూర్ లోని పట్టా భూమికి ఒకే సర్వే నంబర్లు ఉన్నాయి. ఈ అంశమే పలు సమస్యలకు తావిచ్చింది. భూముల రిజిస్ట్రేషన్ కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఈ సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. వివరాల్లోకి వెళ్తే కొన్నేళ్లుగా రిజిస్ట్రేషన్లు జరిగిన పట్టా భూమిని అధికారులు ప్రస్తుతం వక్ఫ్‌భూమిగా మార్చారు. అంతేకాక రిజిస్ట్రేషన్ల నిషేధిత జాబితాలోనూ చేర్చారు. ఫలితంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. వీటికి సంబంధించిన కార్యకలాపాలకు బ్రేక్ పడింది. దీంతో బాధితుల్లో ఆందోళన వెల్లువెత్తుతోంది. వివాదాన్ని పరిష్కరించాలంటూ బాధితులు సంబంధిత అధికారులను ఇప్పటికే పలుసార్లు కలిసి విన్నవించుకున్నారు.
అయితే సమస్య పరిష్కారంపై అధికార యంత్రాంగం ఉదాసీనంగా ఉంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూములకు సంబంధించిన వ్యవహారాలను అధికారులు చాలా సీరియస్ గా తీసుకోవాలి. సమస్యలు వస్తే సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. అయితే అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలాబాద్‌లోని ఖానాపూర్‌ రెవెన్యూ గ్రామాన్ని ఇటీవలే మున్సిపాలిటీలో చేర్చారు. ఈ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబరు 68లో 68/1 నుంచి 68/99 వరకు, 68/ఆ నుంచి 68/ఱ వరకు 535.20 ఎకరాల విస్తీర్ణంలో భూమిని వక్ఫ్‌భూమిగా పేర్కొన్నారు. ఈ భూమిని 2015 నుంచి రిజిస్ట్రేషన్ల నిషేధిత జాబితాలో చూపారు. ఈ విషయాన్ని రిజిస్ట్రేషన్‌ అధికారులే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే దాదాపు మూడేళ్లుగా ఈ అంశాన్ని అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. రిజిస్ట్రేషన్‌లు యాథావిథిగా చేసేశారు. ఈ భూముల అమ్మకాలు, కొనుగోళ్లలో  ఇబ్బందులు, సమస్యలు రాలేదు.
దీంతో రైతులు, స్థలాలు ఉన్న వారెవరు కూడా వక్ఫ్ భూమి అనే విషయాన్ని గుర్తించలేకపోయారు. భవిష్యత్ లో సమస్యలొస్తాయని ఊహించలేకపోయారు. అయితే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సబ్‌రిజిస్ట్రార్‌ వక్ఫ్‌భూమిగా జాబితో ఉండటాన్ని గుర్తించి గతేడాది నవంబరు నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపేశారు. వాస్తవానికి వక్ఫ్‌భూమిగా చూపుతున్న సర్వే నెంబరు 68 ప్రస్తుత నిర్మల్‌ జిల్లాలోని ఖానాపూర్‌నకు చెందినదిగా తెలుస్తోంది.  ఆదిలాబాద్‌లోని ఖానాపూర్‌లో ఉన్న సర్వే నెంబరు 68కి.. ప్రస్తుత నిర్మల్‌ జిల్లాలోని ఖానాపూర్‌లు వేర్వేరు గ్రామాల పరిధిలోకి వస్తాయి. అయినప్పటికీ ఆదిలాబాద్‌లో భూమి వక్ఫ్‌ ఆస్తుల జాబితాలో చేరింది. దీంతో ఇప్పటికే అక్కడ భూములు ఉన్నవారు లబోదిబోమంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags:Two villages with the same name in two districts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *