Natyam ad

స్టీల్ ప్లాంట్ పై  యూ టర్నా….

విశాఖపట్టణం ముచ్చట్లు:


ఆరు నూరైనా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తప్పదని తేల్చి చెప్పిన బీజేపీలో మార్పు వచ్చిందా? పొలిటికల్‌ లెక్కల్లో వచ్చిన తేడాలు వెన్నులో వణుకు పుట్టించాయా? ప్రైవేటీకరణ తప్ప మరో మాట లేదన్న వాళ్లు ఇప్పుడు ప్రత్యామ్నాయాలు చూస్తున్నారా? 2014 నుంచి ఏపీలో బీజేపీని విభజన హామీల అమలు సమస్య నీడలా వెంటాడుతోంది. ఏపీకి ఎన్నో చేశామని.. హామీలు అమలు పరిచామని కమలనాథులు చెబుతున్నా.. అవి ప్రజల్లోకి పెద్దగా వెళ్లడం లేదు. కేంద్ర మంత్రులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నా పార్టీ పరంగా వర్కవుట్‌ కావడం లేదు. పైగా చేయని వాటి గురించి సూటి సుత్తిలేకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు జనాలు.

 

 

 

ఇంతలో ఆ జాబితాలో చేరిందే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం మూడ్‌కు అనుగుణంగా ఏపీ బీజేపీ నేతలు గతంలో కోరస్‌ ఇచ్చినా.. ఇప్పుడు వారి వైఖరిలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు రాజకీయ కారణాలు.. వివిధ సమీకరణాలు కీలకంగా పనిచేసినట్టు సమాచారం.స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలై 570 రోజులు దాటింది. ప్రధాన పార్టీలన్నీ ఈ సమస్యను ఆయుధంగా చేసుకున్నాయి. చివరకు బీజేపీ మిత్రపక్షం జనసేన సైతం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. జనసేనాని ఎంత గొంతు ఎత్తినా వాటిని ఢిల్లీ బీజేపీ పెద్దలు పరిగణనలోకి తీసుకోలేదు. కానీ.. 2024 లోక్‌సభ ఎన్నికల లక్ష్యంగా పావులు కదుపుతున్న కేంద్ర బీజేపీ నాయకత్వం దక్షిణాదిలోని 144 ఎంపీ సీట్లపై కన్నేసింది. ఆ 144 సీట్లలో విశాఖపట్నం లోక్‌సభ స్థానం కూడా ఉండటం.. ఇక్కడ పాగా వేయాలంటే విభజన హామీల అమలుతోపాటు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం వారికి షాక్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ప్లాన్ బీని అమలు చేయబోతున్నట్టు లీకులు ఇస్తున్నారు బీజేపీ నేతలు.2014 ఎన్నికల్లో విశాఖపట్నంలో బీజేపీ ఎంపీ గెలిచారు. అప్పుడు సిటీలో ఒక బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ నేత మాధవ్‌ కొనసాగుతున్నారు. దీనికి తోడు నగరంలో ఉత్తరాధికి చెందిన జనాలు ఎక్కువ కావడంతో అది కలిసివస్తుందనే లెక్కలు బీజేపీ నేతల దగ్గర ఉన్నాయట.

 

 

 

Post Midle

అయితే స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ఆ లెక్కల్ని తలకిందులు చేసినట్టు తెలుస్తోంది. ప్రైవేటీకరణపై నగర జనాలే కాదు.. సిటీలో స్థిరపడిన ఉత్తరాదివాళ్లూ ప్రతికూలంగా ఉన్నట్టు బీజేపీ నేతలు గ్రహించారట. ఆ విషయం తెలిసిన తర్వాత కేంద్రంతోపాటు బీజేపీ నేతల వైఖరిలో మార్పు వచ్చినట్టు టాక్‌. కొత్తలో ప్రైవేటీకరణకు అనుకూలంగా చర్యలు చేపట్టి.. ప్రకటనలు చేసిన నాయకులు కొంతకాలంగా సైలెంట్‌ అయ్యారు. దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటీకరణ అంశాన్ని అడ్రస్‌ చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు చెబుతున్నారు.విశాఖ ఉక్కును స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేస్తారనే కొత్త చర్చకు తెరతీశారు. ఇక్కడి స్టీల్‌ ప్లాంట్‌కు ముందస్తుగా ముడిసరుకును సరఫరా చేయడం.. తన సామర్థ్య వినియోగాన్ని పెంచుకునేలా చర్యలకు ఉక్కు మంత్రిత్వ శాఖ సిద్ధం అవుతున్నట్టు సమాచారం. ప్రైవేట్‌ సంస్థలకు కాకుండా.. ప్రభుత్వ రంగంలోని సెయిల్‌లో విలీనం చేయడానికి అభ్యంతరాలు రాకపోవచ్చనే అభిప్రాయంలో కమలనాథులు ఉన్నారట. దీంతో విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్‌ను తాత్కాలికంగా గౌరవించడం ద్వారా వ్యతిరేకతను తగ్గించుకునే పనిలో పడ్డారట. ఇందులో వాస్తవాలు ఎలా ఉన్నా.. వస్తున్న లీకులు మాత్రం బీజేపీ రాజకీయ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయన్నది నిపుణుల మాట. మరి.. ఢిల్లీ బీజేపీ నాయకత్వం ఏం చేస్తుందో.. విశాఖ జనం ఎలా రిసీవ్‌ చేసుకుంటారో, బీజేపీకి రాజకీయంగా కలిసి వస్తుందో లేదో చూడాలి.

 

Tags: U turna on steel plant….

Post Midle