ఏడాది పూర్తి చేసుకున్న ఉద్ధవ్ ధాక్రే

Date:05/12/2020

ముంబై ముచ్చట్లు:

ఎవరూ ఊహించలేదు. ఆయనకు అనుభవం లేదన్నారు. ప్రభుత్వం మనుగడ అసాధ్యమన్నారు. కిచిడీ ప్రభుత్వాన్ని లాగడం కష్టమని తేల్చేశారు. ఇదిగో కూలిపోతుంది.. అదిగో కూలిపోతుంది అంటూ ప్రచారం జరిగింది. కానీ ఆయన స్థిరంగా ప్రభుత్వాన్ని నడపగలిగారు. ఆయనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే. అందరి అంచనాలకు భిన్నంగా ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా తన ఏడాది పాలనను పూర్తి చేసుకున్నారు.శివసేన, బీజేపీ లు కలసి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అత్యధిక స్థానాలు సాధించాయి. కానీ శివసేన ముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుబట్టడంతో బీజేపీ ససేమిరా అంది. దీంతో ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఉద్ధవ్ థాక్రేకు అనుభవం లేదని, ప్రభుత్వం కుప్పకూలిపోతుందని ప్రచారం జరిగింది. నిజానికి ఉద్ధవ్ థాక్రేకు కొన్నేళ్లుగా శివసేనకు అధిపతిగా ఉన్నా ప్రత్యక్ష్య రాజకీయాలకు దూరంగా ఉన్నారు.తొలిసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఎమ్మెల్సీగా ఎన్నికై చట్ట సభల్లోకి ప్రవేశించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచే సమన్వయంతో ఉద్ధవ్ ధాక్రే ముందుకు వెళుతున్నారు. ప్రధానంగా ఎన్సీపీ, కాంగ్రెస్ లను నొప్పించకుండా పని కానిచ్చేస్తున్నారు.

 

 

బీజేపీ ముప్పు పొంచి ఉందని తెలిసిన ఉద్ధవ్ థాక్రే శరద్ పవార్ సాయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రభుత్వాన్ని శరద్ పవార్ నడుపుతున్నారన్న విమర్శలకు ఉద్ధవ్ థాక్రే వెరవడం లేదు.శరద్ పవార్ కు ఉద్ధవ్ థాక్రే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏ నిర్ణయం అయినా ఆయనకు చెప్పే తీసుకుంటున్నారు. దీనివల్లనే ప్రభుత్వం ఇంతకాలం మనగలిగిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ ఉద్ధవ్ థాక్రే ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఇప్పటికీ మహారాష్ట్రలో ప్రభుత్వం కుప్ప కూలిపోతుందని బీజేపీ అంచనాలు వేస్తుంది. ఎక్కడికక్కడ కెలుకుతూనే ఉంది. అయినా ఉద్ధవ్ థాక్రే మాత్రం సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకైతే ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వానికి ఢోకా లేదనే చెప్పాలి.

పుంగనూరు ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

Tags: Uddhav Dhakre completes the year

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *