ఉద్రిక్తాంధ్ర నాడు జగన్, నేడు చంద్రబాబు.. విశాఖలో సేమ్ సీన్ రిపీట్

Date;27/02/2020

ఉద్రిక్తాంధ్ర
నాడు జగన్, నేడు చంద్రబాబు.. విశాఖలో సేమ్ సీన్ రిపీట్

విశాఖపట్టణంముచ్చట్లు:

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు విశాఖలో అడ్డంకులు ఎదురయ్యాయి. ఎయిర్‌పోర్టులోనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నారు. కాన్వాయ్‌ను ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు. పోటీగా టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి. దాదాపు మూడు గంటల పాటూ చంద్రబాబు ఎయిర్‌పోర్ట్‌ బయటే నిలిచిపోయారు. ఈ సందర్భంలో గతంలో జరిగిన ఓ ఘటనను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. మూడేళ్ల క్రితం ఇలాగే విశాఖలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.2017లో జనవరి 26న విశాఖపట్టణంలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైంది. అదే సమయంలో విశాఖలో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ జరుగుతోంది. దేశ, విదేశాల నుంచి కంపెనీల ప్రతినిధులు రావడంతో అప్పటి ప్రభుత్వం క్యాండిల్ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. దీంతో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలతో కలిసి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమానికి అనుమతి లేకపోగా.. జగన్, వైఎస్సార్‌సీపీ నేతలు ఎయిర్‌పోర్టుకు రావడంతో.. బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్నాయని తిరిగి వెనక్కు వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. దీంతో వైఎస్ జగన్‌, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో పాటూ ముఖ్యనేతలు ఎయిర్‌పోర్టు రన్‌వే పైనే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారిని పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తిరిగి పంపించారు. జగన్‌కు మద్దతుగా వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్ని ఎయిర్‌పోర్టు బయటే అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.ఇప్పుడు చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా మళ్లీ అవే పరిస్థితులు కనిపించాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బాబును ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. కాన్వాయ్ ముందు బైఠాయించి.. మరికొందరు పడుకొని నిరసన తెలిపారు. చంద్రబాబు కారు దిగి పాదయాత్రగా వెళ్లేందుకు ప్రయత్నించగా.. భద్రతా కారణాల వలన వద్దని పోలీసులు వారించారు. దీంతో కాన్వాయ్‌లో ఉన్న కారులోనే వేచి ఉన్నారు. 2017లో జగన్ ఎయిర్‌పోర్టులో ఎలాగైతే ఆగిపోయారో.. దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు చంద్రబాబు కూడా అలాగే చిక్కుకుపోయారు.ఇప్పుడు చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టు సమీపంలోనే ఆగిపోయారు. మూడు నాలుగు గంటలుగా అక్కడే ఉన్న కాన్వాయ్ ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడంతో చంద్రబాబు అక్కడే నిలబడిపోయారు. పోలీసులు కూడా చంద్రబాబుతో చర్చిస్తున్నారు. మరో మార్గంలో ఆయన్ను పంపిస్తారా.. లేక వెనక్కు వెళ్లమని చెబుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఉత్తరాంధ్రలో గతంలో ప్రతిపక్ష హోదాలో జగన్‌కు ఎదురైన పరిస్థితి ఇప్పుడు చంద్రబాబుకు ప్రతిపక్ష హోదాలో ఎదురైంది అని వైఎస్సార్‌సీపీ నేతలు కూడా గుర్తు చేసుకుంటున్నారు.

Tags;Udriktandhra
Today pics, today Chandrababu .. Same scene repeat in Visakha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *