ఉద్యోగాలంటూ..కుచ్చుటోపీ..

DAte:11/08/2018
కామారెడ్డి ముచ్చట్లు:
తెలంగాణ ప్రభుత్వం పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఆశావహులు ప్రిపరేషన్ మొదలు పెట్టేశారు. ఇదిలాఉంటే కొందరు ప్రబుద్ధులు మాత్రం ఉద్యోగార్ధులను మోసగించి దండుకునే కార్యక్రమానికి తెరతీశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశావహుల నుంచి రూ.లక్షలు దండుకుంటూ ఉడాయిస్తున్నారు. డబ్బు తీసుకున్న తర్వాత సదరు వ్యక్తి అడ్రస్‌ లేకుండా పోతుండడంతో అప్పటికిగానీ.. బాధితులు తాము దారుణంగా మోసపోయామన్న సంగతిని గుర్తించడంలేదు. రాష్ట్రంలో ఇటీవలిగా ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. దీంతో ప్రభుత్వ వర్గాలు ఈ తరహా మోసాలకు, ప్రలోభాలకు గురికావద్దని ఉద్యోగార్ధులను హెచ్చరిస్తున్నాయి. ప్రవేశ పరీక్షల్లో నిర్దేశిత అర్హతలు అందుకున్న వారికే కొలువులు లభిస్తాయని ఎలాంటి పైరవీలు, ఆర్ధిక ప్రలోభాలు పనిచేయవని తేల్చి చెప్తున్నారు. ఇదిలాఉంటే మోసగాళ్లు ఉద్యోగార్ధులకు మాయమాటలు చెప్పి తమ మాయాజాలంలో పడేస్తున్నారు. ఎలాంటి పుస్తకాలు చదవకుండానే కొంత డబ్బు చెల్లిస్తే కొలువు ఖాయమని అంటున్నారు. ఇలాంటి మాటలు నమ్మిన పలువురు మోసగాళ్లకు రూ.లక్షలే సమర్పించుకుంటున్నారు. వివిధ జిల్లాలో రూ.4లక్షల నుంచి రూ.8లక్షల వరకూ కొందరు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ పలువురు అభ్యర్ధుల నుంచి డబ్బు తీసుకున్న తర్వాత మోసగాళ్లు పత్తా లేకుండా పోతున్నారు. మోసగాళ్ల వలలో పడుతున్న అభ్యర్ధులు అప్పసప్పో చేసి, ఆస్తులు అమ్ముకొని దళారుల చేతిలో బెడుతున్నారు. పెద్దగా కష్టపడకుండానే ఉద్యోగం వస్తుందని కొందరు నిరుద్యోగులు భావిస్తుండడమే దీనికి కారణం. తీరా డబ్బులు చేతిలో పడ్డాక ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. చివరకు మోసాన్ని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అప్పటికే పుణ్యకాలం గడిచిపోతోంది. మోసగాళ్లు దర్జాగా తప్పించుకుపోతున్నారు. వాస్తవానికి ప్రతిభ, సామర్థ్యాల ఆధారంగానే ఉద్యోగాలు వరిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలు విద్యార్హతలు, అభ్యర్థుల ప్రతిభ, సామర్థ్యాల ఆధారంగానే దక్కుతాయి. వీటికి షార్ట్ కట్‌లేదు. కష్టపడాల్సిందే. బాగా చదివి ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సిందే. ఈ విషయం తెలిసినా కొందరు నిరుద్యోగులు మాయగాళ్ల వలలో పడిపోతున్నారు. దీంతో తమకు డబ్బు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని నిరుద్యోగులకు పోలీసులు స్పష్టంచేస్తున్నారు. ఉద్యోగ నియామక కమిటీల్లో తమకు పరిచయాలు ఉన్న అధికారులు, బంధువులు ఉన్నారని, తప్పకుండా ఉద్యోగం లభిస్తుందంటూ దళారులు చెప్పే మాటలు నమ్మవద్దని తేల్చి చెప్తున్నారు. అలాంటివారి సమాచారం తమకు అందిస్తే వారిపై చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు.
Tags:Udyogalantukuccutopi ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *