ఉగాదికి సామూహిక గృహాల లేనట్టేనా
శ్రీకాకుళం ముచ్చట్లు:
సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమం ఒకసారి వాయిదా పడింది. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్ష్యల గృహాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించుకుంది. గతేడాది డిసెంబర్ 21న వీటిలో సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టాలని తొలుత అనుకుంది. అప్పటికి లక్ష్యంలో 39.32 శాతం ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో, గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ఉగాది నాటికైనా ఇవి పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించింది. ఈ నెల 22న ఉగాది నేపథ్యంలో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ మరుసటి రోజు ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 25వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. దీంతో, అప్పటివరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. ఈ నేపథ్యంలో గృహ ప్రవేశాల కార్యక్రమం వాయిదా పడొచ్చన్న చర్చ సాగుతోంది. మరోవైపు ఈ కార్యక్రమంపై ఎక్కడా ఎటువంటి కదలికా కనిపించడం లేదు. లక్ష్యాల పూర్తి, కార్యక్రమం రూపకల్పనపై ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఎటువంటి ఆదేశాలూ రాలేదు. మరో వారం రోజులే మిగిలి ఉండడం, సామూహిక ప్రవేశాలపై అధికార యంత్రాంగాన్ని సంసిద్ధత చేసే పని ఇప్పటివరకు జరగకపోవడంతో మళ్లీ వాయిదా పడినట్లుగా అంతా భావిస్తున్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు (ఎన్‌పిఐ) పథకంలో భాగంగా ప్రభుత్వం 16,60,171 ఇళ్లను మంజూరు చేసింది.
ఇందులో ఐదు లక్షల ఇళ్లను 2022 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది. గత డిసెంబర్ 15 నాటికి 1,96,595 ఇళ్లు (39.32 శాతం) మాత్రమే పూర్తయ్యాయి. లక్ష్యం సగం కూడా పూర్తి కాకపోవడంతో గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఉగాది నాటికైనా పూర్తి స్థాయిలో గృహాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మంగళవారం నాటికి 3,07,214 (లక్ష్యంలో 62 శాతం) ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. వీటిలో ఇంకా సగం ఇళ్లకు విద్యుత్తు సౌకర్యం, తాగునీటి సౌకర్యం పెండింగ్‌లో ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 33,241 మందితో సామూహిక గృహ ప్రవేశాలు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటివరకు 22,032 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. వాటిలో సుమారు 11 వేల ఇళ్లకు మాత్రమే విద్యుత్తు సౌకర్యం, సుమారు పది వేల ఇళ్లకు మాత్రమే తాగునీటి సౌకర్యం కల్పించారు.రాష్ట్రంలో పది జిల్లాల్లో 50 శాతంలోపే ఇళ్లు పూర్తయ్యాయి. వాటిలో అనంతపురం, పల్నాడు, వైఎస్‌ఆర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు,

అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,814 ఇళ్లకుగానూ రెండు ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఇస్తున్న రూ.1.80 లక్షలు ఏ మాత్రమూ సరిపోకపోవడంతో లబ్ధిదారులు ముందుకు రాలేదు. జిల్లా సమీక్షా సమావేశాల్లో మంత్రులు సైతం ఇంటి నిర్మాణ ఖర్చును పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. నివాస యోగ్యంలేని చోట ఇళ్ల స్థలాలు ఇవ్వడం వంటి కారణాలతో కొందరు ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. ఇళ్లు నిర్మించకపోతే పట్టాలు వెనక్కి తీసుకుంటామని అధికారులు, గ్రామ/వార్డు వలంటీర్లు ఒత్తిడి చేయడంతో అయిష్టంగా కొందరు ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,200 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకోవడం కూడా గృహ నిర్మాణాలు నత్తకడనక సాగడానికి కారణం ఉంది.
Tags; Ugadi does not have communal housesUgadi does not have communal houses
