గ్రామాల్లో కనిపించని పారిశుధ్ధ్యం

Date:17/04/2018
అనంతపురం ముచ్చట్లు:
పారిశుద్ధ్యం పట్ల మండల అభివృద్ధి అధికారి , పంచాయతీ అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారు. దీంతో గ్రామాల్లో డ్రైనేజీలు శుభ్రతకు నోచుకోలేదు. మురుగు నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. దీంతో దోమలు ప్రబలి  ప్రజలు విష జ్వరాల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ నరకయాతన అనుభవిస్తున్నారు.  కూడేరు మండలంలో 14 పంచాయతీలు, 28 గ్రామాలు ఉన్నాయి. మండల అభివృద్ధి కార్యాలయం (ఎంపీడీఓ) ఆవరణలోనే చెత్తా చెదారంతో కంపు కొడుతోందంటే అధికారులు పారిశుద్ధ్యం మెరుగునకు ఏ స్థాయిలో కృషి చేస్తున్నారో ఆర్థం చేసుకోవచ్చు.భారతదేశ ప్రధాని, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛ భారత్‌’ కార్యక్రమం అధికారుల అలసత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా పథకం అభివృద్ధికి బదులుగా తిరోగమనంలో పయనిస్తోంది. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి పత్రికలు, టీవీలు, రేడియోలు, చివరకు సినిమా థియేటర్లలో సైతం యాడ్స్‌ రూపంలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో కొంత మేర స్వచ్ఛ బారత్‌ ప్రభావం వెళ్లినప్పట్టికీ గ్రామాల్లోకి మాత్రం పూర్తిగా చేరలేదు. స్వచ్ఛ భారత్‌పై ప్రజలకు అవగాహన లేకపోవడంతో అపరిశుభ్ర వాతావరణంలోనే కాలం వెళ్లదీస్తున్నారు. స్వచ్ఛ భారత్‌ అంటే ఇంటి పరిసరాలతోపాటు గ్రామ, పట్టణ, నగరాల్లో ఎలాంటి కాలుష్యంకానీ, వ్యర్థాలుకానీ, అపరిశుభ్రతకానీ ఉండకూడదు. కానీ నేడు స్వచ్ఛ భారత్‌పై అవగాహన లేకపోవడంతో ప్రజలు తమ ఇండ్లలోని చెత్తను ఎక్కడ పడితే అక్కడ ఆరు బయట వేస్తుండడంతో అపరిశుభ్రతకు ప్రధాన కారణమవుతుంది. ఇక ప్రజలు సైతం ఆరు బయట మల, మూత్ర విసర్జన చేస్తుండడం కూడా ప్రజారోగ్యానికి గొడ్డలిపెట్టుగా మారింది. ఆరు బయట మల, మూత్ర విసర్జన చేయవద్దని, అందుకు ప్రతి ఒక్కరు మరుగుదొడ్డి నిర్మించుకొని వాడాలని సూచించింది. అందుకు కావాల్సిన ప్రోత్సాహాకాన్ని సైతం ప్రభుత్వం అందజేస్తుంది. కానీ కిందిస్థాయి అధికారుల అలసత్వం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ చాలా గ్రామాల్లోని ప్రజలకు మరుగుదొడ్లు లేవు. గ్రామాల్లో ఉన్న జనాభాకు అనుగుణంగా మరుగుదొడ్లను మంజూరు చేయాల్సి ఉండగా తక్కువగా మంజూరు చేస్తుండడంతో ఇబ్బంది ఏర్పడుతోంది. వీధుల్లో ఉన్న చెత్తను మూడు చక్రాల బండిలో తెచ్చి ఎంపీడీఓ కార్యాలయ గేటు ముందు పడేస్తున్నారు. అందులో స్థానికులు కొందరు మలమూత్ర విసర్జన చేయడంతో కంపు కొడుతోంది. ఈ కంపును దాటుకొని మండల ప్రజలు అంగన్‌వాడీ కేంద్రం, ఐకేపీ కార్యాలయం, హౌసింగ్‌ ఆఫీసర్, హార్టికల్చర్‌ కార్యాలయాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. గత్యంతరం లేక ప్రజలు ముక్కు మూసుకొని వెళుతున్న పరిస్థితి నెలకొంది.  రోజు అధికారులు ఈ కంపును చూస్తు వెళుతున్నారే తప్ప శుభ్రం చేయిద్దామన్న ఆలోచన లేదని  ప్రజలు నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Tags: Unclean sanitation in villages

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *