ముందుకు సాగని కుటుంబ నియంత్రణ

   Date:21/03/2019
  కర్నూలు ముచ్చట్లు:
జనాభాతో అందుబాటులో ఉన్న వనరుల వినియోగం అధికమవుతూ కొరత సమస్య వెంటాడటం అనేది సాధారణమే. ఈ పరిస్థితి అదుపునకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ అంటూ ఊదరగొట్టడమే తప్పా క్షేత్రస్థాయిలో పరిస్థితులకు తగ్గట్లుగా ఏర్పాట్లు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1995 నుంచి ఇరువురి సంతానం మించినట్లైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కోల్పోయేలా ఆదేశాలను అమలు చేస్తుండటం తెలిసిందే. ఆడ, మగ అనే భావన లేకుండా సగటు ప్రజానీకంలో స్వతహాగానే ఒకరైతే ముద్దు-ఇద్దరైతే హద్దు అనే భావన అలుముకుంది. అలాంటప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్సల సంఖ్య ఆశాజనకంగా పుంజుకోవడం అంతంత మాత్రంగానే ఉండటం విమర్శలకు తావిస్తోన్న పరిణామం. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాధినేతలు ప్రగల్భాలు పలికిన రీతిలో శస్తచ్రికిత్సల నిర్వహణ అంశాన్ని పురోగతి పట్టించడంలో శ్రద్ధ చూపడం లేదనే చెప్పాలి. నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్స కోసమై ఎవరైనా వెళ్తే రిక్తహస్తమే ఎదురుకావడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. గతంలో 30 పడకల ఆసుపత్రిగా కొనసాగుతూ వంద పడకల స్థాయికి పెరిగినా ఇంకా పాత గణాంకాల ప్రకారమే బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నట్లు వైద్యాధికారులు వాపోతున్నారు.
ఇదే ఆసుపత్రిని జిల్లాస్థాయికి పెంపుదల చేయనున్నట్లు పదేపదే పాలక ప్రకటనలు వస్తున్నాయి. ఇలాంటప్పుడు కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్సల వంటి అంశాల్లోనూ గందరగోళం నెలకొనడం బాధాకరమైన పరిణామం. పురుషుల కోసమై నిర్వహించే వేసెక్టమీలో అధునాతన ఎన్‌ఎస్‌వి  స్థానికంగా ఊసేలేదు. ఇక మహిళలకు చేపట్టే ట్యూబెక్టమీ నిర్వహణపైనా ఆత్మకూరు ఆసుపత్రిలో స్పష్టత కరవు. ఇళ్ల వద్ద మంత్రసాని, కాన్పుల శైలి కాలం కనుమరుగైంది. గర్భవతులంతా ఆసుపత్రుల్లోనే బాలింతలవుతున్నారు. సాధారణ కాన్పుల ప్రక్రియను మారుమూల గ్రామాల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ నిర్వహిస్తున్నారు. అయితే అదే సందర్భంలో ఇకపై పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లపరంగా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆత్మకూరు ప్రాంత పరిధిలో మహిమలూరు, అనంతసాగరం, మర్రిపాడు, అనుమసముద్రంపేట, తదితర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఆయా కేంద్రాల నుంచి తరలివచ్చే మహిళలకు ఆత్మకూరు ఆసుపత్రిలో కు.ని శస్తచ్రికిత్సలు చేయడం లేదు. మరోవైపు కు.ని లక్ష్యసాధనలో తలమునకలు కావాల్సిన పారా మెడికల్ యంత్రాంగం ఇబ్బందుల్లో పడుతున్నారు.
క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఆశావాలంటీర్లతో కలగలసి కు.ని శస్తచ్రికిత్స నిమిత్తమై మహిళలు, వారి సంబంధీకులు వింజమూరు, ఉదయగిరి, తదితర ప్రాంతాలకు వెళ్లి వస్తున్నారు. ఆశావాలంటీర్ నేతృత్వంలో ఓ కు.ని శస్తచ్రికిత్స నిర్వహిస్తే 150 రూపాయల వరకు పారితోషికం ప్రభుత్వం తరపున ముడుతోంది. అందులో ప్రయాణ భారాన్ని భరించేందుకు ఆశావాలంటీర్లకు మనస్కరించడం లేదు. ఈక్రమంలో అలా తీసుకెళ్లి రావాలంటే ప్రయాణ వ్యయభారం శస్తచ్రికిత్సలు చేయించుకునే కుటుంబాలపైనే పడుతోంది. ప్రధానంగా నిరుపేద గిరిజన మహిళలు అవగాహన లోపంతో అంత వ్యయభారాన్ని ఎదుర్కొనలేకున్నారు. ఇలా ఆయా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వచ్చేందుకు 108 అంబులెన్స్‌ల్లోనూ సాధ్యపడటం లేదు. ఈ అంబులెన్స్‌లను అత్యవసర సర్వీసుగా మాత్రమే నడపాలనే నిబంధనలున్నాయి. ఇదిలాఉంటే అందుబాటులో ఉండే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్సలు చేయించుకుందామన్నా జాస్తి ఖర్చులే.
Tags:Uncontrolled family control

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *