ముందుకు సాగని గృహ నిర్మాణం

Unfinished home construction

Unfinished home construction

Date:17/04/2018
తిరుపతి ముచ్చట్లు:
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా ముందడుగు వేశాయి. అర్హులైన వారికి మంజూరు చేస్తామని  పాలకులు ఘనంగా ప్రకటించారు. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలనే సదాశయంతో అనుమతిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రగతి చూస్తే పక్కాగా పడకేసింది. లబ్ధిదారుల ఎంపిక జాప్యం జరిగింది. నిర్మాణ పనులు చేపట్టినా బిల్లులు సకాలంలో అందట్లేదు. రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. దాంతో చాలాచోట్ల పునాది దశ దాటలేదు. కొందరైతే మీ ఇల్లు మాకొద్దు బాబోయ్‌ అంటూ వెనకడుగు వేస్తున్నారు. చేసేదేమీలేక రద్దు చేసి మళ్లీ కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నారు. దాంతో ప్రగతి జోరందుకోలేదు.చిత్తూరుజిల్లాలో 2016–19 ఆర్థిక సంవత్సరానికి 54,010 ఎన్టీఆర్‌ ఇళ్లను గ్రామీణ, పట్టణ పథకాల కింద మంజూరు చేశారు. ఒక్కో ఇంటికి రూ.1.50లక్షలు ఇస్తారు. నిర్మాణం ప్రారంభమయ్యాక సిమెంటు విలువతో కలిపి తొలివిడత రూ.15వేలు, రెండో విడత రూ.25వేలు, మూడో విడత రూ.40వేలు, నాలుగో విడత రూ.12వేలు చొప్పున బిల్లులను లబ్ధిదారుల ఖాతాలకు చెల్లిస్తారు. మిగిలిన రూ.58వేలకు సంబంధించి ఉపాధి పథకం ద్వారా కూలీలు, ఇటుకల కోసం చెల్లిస్తారు. జిల్లా వ్యాప్తంగా మంజూరైన ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.లబ్ధిదారులకు బిల్లు మంజూరై 50 రోజులు పూర్తయింది. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి మంగళవారం వరకు అంటే 50 రోజులుగా ఒక్క బిల్లు కూడా చెల్లించలేదు. ఫివ్రబరి 12 నుంచి లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లు కోసం సంబంధిత డీఈ, ఈఈలు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేశారు. వీటిని పరిశీలించి ఉన్నతాధికారులు తక్షణమే బిల్లులు మంజూరు చేస్తూ చర్యలు తీసుకొంటారు. ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఏప్రిల్‌ 2 నాటికి  అధికారిక లెక్కల ప్రకారం లబ్ధిదారులకు అందాల్సిన బిల్లుల నగదు రూ.34,07,61,940. ఈ మొత్తం చెల్లింపులు ఆగిపోవడంతో పేరుకుపోయాయి. ప్రభుత్వం వీటిని ఎప్పుడు చెల్లిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.నిర్మాణాలు పూర్తి చేయించేందుకు గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారుల వెంట పడుతున్నారు. దాంతో బిల్లులు అందకపోయినా అప్పులు చేసి లబ్ధిదారులు పనులు చేయిస్తున్నారు. బిల్లులు వస్తాయన్న ఆశతో రుణాలపై ఆధారపడ్డారు. ఇప్పుడు బిల్లుల కోసం అధికారులను ప్రశ్నిస్తే ఆన్‌లైన్‌లో బిల్లు జనరేట్‌ చేశాం.. వచ్చేస్తుంది.. అన్న సమాధానం ఇస్తున్నారే కాని స్పష్టంగా చెప్పడం లేదు.
Tags: Unfinished home construction

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *