నెరవేరని ఆశయం (తూర్పుగోదావరి)

Unfulfilled ambition (East Godavari)

Unfulfilled ambition (East Godavari)

Date:06/10/2018
కాకినాడ ముచ్చట్లు:
గ్రామాల్లో సంపద సృష్టి కేంద్రాల లక్ష్యం నెరవేరడం లేదు. ప్రతి గ్రామంలో జనాభా ప్రాతిపదికన రూ.4.50 లక్షల నుంచి రూ.8.50 లక్షల వరకు వ్యయంతో సంపద సృష్టి కేంద్రాలను నిర్మించారు. ఇళ్ల నుంచి వచ్చే చెత్తను రోజూ సేకరించి ఈ కేంద్రాలకు తరలించాల్సి ఉంది. అక్కడ తడి, పొడి చెత్తను వేరుచేసి తడి చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేయాలని నిర్ణయించారు. ఈ ఎరువును రైతులకు విక్రయించడం ద్వారా పంచాయతీలకు ఆదాయాన్ని సమకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
చెత్తలో వచ్చే సీసాలు వంటి ఇతర సామగ్రిని బయట అమ్మకోవడం ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. సంపద సృష్టి కేంద్రాలను ఉపాధి హామీ నిధులతో నిర్మించగా నిర్వహణ పంచాయతీలే  చూసుకోవాలి. వీటిలో జనాభాను బట్టి 10 నుంచి 15 మంది వరకు ఉపాధి కల్పించే అవకాశం ఉంది.కానీ పలు పంచాయతీల్లో సంపద సృష్టి కేంద్రాలు మూతపడ్డాయి.
చెత్త సేకరణకు నియమించిన కార్మికులకు వేతనాలు చెల్లించక పోవడంతో వారు విధుల నుంచి తప్పుకున్నారు. దీంతో కొన్ని చోట్ల వీటి నిర్వహణకు ప్రతిబంధకంగా మారింది. ప్రధానంగా గ్రామ స్థాయిలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది.పంచాయతీలకు కొనుగోలు చేసిన రిక్షాలను కొందరు తమ సొంత కార్యకలాపాలకు ఉపయోగించుకోవడంతో లక్ష్యం పక్కదారి పట్టింది.
కొన్ని చోట్ల సంపద సృష్టి కేంద్రాలను తూతూమంత్రంగా నిర్మించడంతో కొంత కాలానికే అవి దెబ్బతిన్నాయి.ప్రధానంగా పలు ప్రాంతాల్లో ఈ కేంద్రాల పైకప్పును తాటాకులతో వేయడంతో అవి త్వరగా పాడవుతున్నాయి. దీంతో వర్షం వస్తే లోపలకు నీరు లీకవుతోంది. వీటిపై యంత్రాంగం పర్యవేక్షణ కొరవడటంతో నిర్వహణ అధ్వానంగా తయారైంది.
ఇళ్ల నుంచి చెత్తను సేకరించి సంపద సృష్టి కేంద్రాలకు తరలించేందుకు కొత్తగా గ్రీన్‌ అంబాసిడర్లను ప్రభుత్వం నియమించింది. వీరికి నెలకు రూ.ఆరు వేల వంతున గౌరవ వేతనాన్ని ఇవ్వనున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా ప్రతి ఇంటికి చెత్త బుట్టలను ఇవ్వక పోవడంతో లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు.
ప్రస్తుతం గ్రామాల్లోని వీధుల్లో చెత్త పేరుకుంటోంది. జనావాసాల మధ్యే చెత్తను పడేస్తుండడంతో పారిశుద్ధ్యం క్షీణించి వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ పరిస్థితిలో సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టి చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు సద్వినియోగం అయ్యేలా చూడాల్సిన అవసరముంది.
Tags:Unfulfilled ambition (East Godavari)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *