అందని కానుక (విజయనగరం)

Unmistakable gift (Vizianagaram)
Date:16/07/2018
విజయనగరంముచ్చట్లు:
జిల్లాలోని మున్సిపాలిటీల్లో ‘చంద్రన్న పెళ్లికానుక ’ పథకం కోసం సకాలంలో నమోదు చేసుకోకపోవడం వల్ల పలువురు అర్హులు దీనికి దూరమవుతున్నారు.ముఖ్యంగా ఈ విషయాలేవీ తెలియక గడువు సమీపించే వరకు ముందుకు రావడం లేదు. అన్ని వివరాలు తెలుసుకునే లోపు పెళ్లికి ముందు 15 రోజులు గడువు ముగియడంతో ఆన్లైన్ నమోదు కావడం లేదు.ప్రభుత్వం ఈ ‘చంద్రన్న పెళ్లికానుక’కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, సంప్రదించడానికి టోల్‌ఫ్రీ నెం 1100 ఇచ్చినా దీనిపై పలువురికి అవగాహన కొరవడింది. జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాలు, నెల్లిమర్ల నగర పంచాయతీలో ఇదే పరిస్థితి ఉండటం గమనార్హం. ప్రభుత్వం ఈ పథకాన్ని ఈ ఏడాది 20, ఏప్రిల్‌లో ప్రారంభించింది. జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాలు, నెల్లిమర్ల నగర పంచాయతీలో దీనిపై అవగాహన లేక దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య తగ్గుతోంది. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందటానికి రిజిస్ట్రేషన్ తేదీ, పెళ్లి రోజుకు మధ్య కచ్చితంగా 15 రోజుల వ్యవధి ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడే ఆన్లైన్లో దరఖాస్తు నమోదు అవుతుంది. ఈ గడువు లేకుంటే ఎట్టి పరిస్థితిల్లోనూ నమోదు జరగదు. ఈ పథకానికి అర్హులు కారు. ప్రజల్లో ఈ విషయంపై అవగాహన లేక దూరమవుతున్నారు. ఈ నిబంధనలతో ప్రజలు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వందల సంఖ్యలో అర్హులకు వివాహాలు జరుగుతుంటే నమోదు మాత్రం ఇంత వరకు మొదటి రెండంకెల సంఖ్య దాటకపోవడం గమనార్హం.జిల్లాలోని ఐదింటిలో ఇంత వరకు నమోదు చేసుకున్న వారి సంఖ్య చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఏ విధంగా దరఖాస్తు చేయాలి, ఇందు కోసం ఎక్కడికి వెళ్లాలనే దానిపై విస్తృత ప్రచారం కల్పించాల్సి ఉంది. అప్పుడే అందరికీ తెలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని చోట్ల మీసేవా కేంద్రాల నిర్వాహకులు అవగాహన లేక చేయకుంటే పలువురు వెనుదిరుగుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని కేంద్రాల్లో చేయడం లేదని సమాచారం. ఇక ఎక్కడ చేయరని పలువురు వెనక్కి తగ్గుతున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా సాలూరులో చేయడం లేదని సమాచారం. ప్రస్తుతం గతంలో దరఖాస్తు చేసిన వారికి ప్రోత్సాహక బహుమతి ఇవ్వడానికి పరిశీలన తుది దశలో ఉన్నట్టు అధికారుల నుంచి సమాచారం.వివాహ సమయానికి పెళ్లికుమార్తె వయస్సు 18 సంవత్సరాలు, పెళ్లి కొడుకు వయస్సు 21 నిండాలి. మొదటి వివాహం చేసుకున్న వారే దీనికి అర్హులు. భర్త చనిపోయి వితంతువులు మాత్రమే 2వ వివాహానికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందగలరు.నమోదు సమయానికి ఆధార్ నెంబరు కలిగి ఉండాలి. వివాహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగి ఉండాలి. ఈ ఇద్దరు రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. ఇరువురు ప్రభుత్వం చేసిన ప్రజాసాధికార సర్వే జాబితాలో నమోదై ఉండాలి. ఇంత వరకు నమోదు కాకుంటే మీసేవలో గాని, ప్రజాసాధికార సర్వే వెబ్సైట్ ద్వారాగాని నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే సమయానికి వివాహ తేదీ, వివాహ వేదిక నిర్ణయించి ఉండాలి.ఈ పథకంలో చంద్రన్న పెళ్లికానుక వెబ్సైట్ ద్వారా, మొబైల్ యాప్, 1100 టోల్‌ఫ్రీ నెంబరుకు కాల్ చేయడం ద్వారా, మీ సేవా కేంద్రాలు, పురపాలక సంఘాల్లోని మెప్మా విభాగాలు, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ద్వారా నమోదు చేసుకోవచ్చు. జిల్లాలోని పురపాలక సంఘాల్లో ఈ పథక పరిశీలనకు కల్యాణమిత్రాలను నియమించారు. విజయనగరంలో ఐదుగురు క్రియాశీలకంగాను ముగ్గురు స్టాండ్‌బై కింద ఉన్నారు. బొబ్బిలి, పార్వతీపురంలలో ముగ్గురు క్రియాశీలకంగా, ఇద్దరు స్టాండ్‌బై, సాలూరు నెల్లిమర్లలలో ఇద్దరు క్రియాశీలక, ఒకరు స్టాండ్‌బై ఉన్నారు. లబ్ధిదారు దరఖాస్తు నమోదు తర్వాత కల్యాణమిత్రలు ప్రోత్సాహక నగదు బహుమతి మొత్తంలో 20 శాతం, వివాహ ఫొటో అప్లోడ్ చేసి, పెళ్లి ధ్రువీకరణ జారీ చేసిన తర్వాత మిగిలిన 80 శాతం వధువు ఖాతాలో జమచేస్తారు.
అందని కానుక (విజయనగరం) https://www.telugumuchatlu.com/unmistakable-gift-vizianagaram/
Tags:Unmistakable gift (Vizianagaram)