Unprecedented response to sunflower recitation

సుంద‌రకాండ పారాయ‌ణానికి అపూర్వ స్పంద‌న‌

-టిటిడికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసిన భ‌క్తులు

Date:12/07/2020

తిరుప‌తి ముచ్చట్లు:

టిటిడి ఆధ్వ‌ర్యంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్న సుంద‌ర‌కాండ పారాయ‌ణం, వేద‌పారాయ‌ణానికి భ‌క్తుల నుండి అపూర్వ స్పంద‌న ల‌భించింది. డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో ఎక్కువ మంది భ‌క్తులు ఈ కార్య‌క్ర‌మంపై సంతృప్తి వ్య‌క్తం చేసి టిటిడికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో ఆదివారం డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో  అనిల్‌కుమార్ సింఘాల్ సమాధానాలు ఇచ్చారు.

1. ప‌ద్మావ‌తి – హైద‌రాబాద్‌, సుగుణ – విజ‌య‌వాడ‌, రామ్మూర్తి – విజ‌య‌వాడ, క‌ల్ప‌నాదేవి – పాల‌క్కాడ్, కోటేశ్వ‌ర‌రావు – గుంటూరు.

ప్రశ్న: ఎస్వీబీసీలో ప్ర‌సారం చేస్తున్న సుంద‌ర‌కాండ పారాయ‌ణం చాలా బాగుంది. మేము రోజూ పారాయ‌ణం చేస్తున్నాం. కొన‌సాగించండి.

ఈవో : ఎస్వీబీసీలో ప్ర‌సారం చేస్తున్న సుంద‌ర‌కాండ పారాయ‌ణానికి భ‌క్తుల నుండి అనూహ్య స్పందన ల‌భిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒక కోటి మంది భ‌క్తులు ఈ కార్య‌క్ర‌మాన్ని వీక్షిస్తున్నారు. త్వ‌ర‌లో సాయంత్రం కూడా మ‌రో కార్య‌క్ర‌మాన్ని ప్ర‌సారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ధ‌ర్మ ప్ర‌చారంలో భాగంగా చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మం పిల్ల‌‌ల్లో ధార్మిక చైత‌న్యం పెంచేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎస్వీబీసీ కార్య‌క్ర‌మాల్లో వ్యాపార ప్ర‌క‌ట‌న‌లను తొల‌గించే దిశ‌గా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నాం. ఎస్వీబీసీ ట్ర‌స్టుకు భ‌క్తుల నుండి విరాళాలు ఆహ్వానిస్తున్నాం.

2. బాలాజి – కార్టూరు, రామారావు – హైద‌రాబాద్‌,

ప్రశ్న: మే 20న ద‌ర్శ‌న టికెట్‌, గ‌ది బుక్ చేశాను. ర‌ద్దు చేసుకున్న త‌రువాత రీఫండ్ కాలేదు.

ఈవో : జూన్ 11వ తేదీలోపు ద‌ర్శ‌న‌టికెట్లు, గ‌దులు బుక్ చేసుకున్న భ‌క్తులకు రీఫండ్ చేశాం. మీ వివ‌రాలు సేక‌రించి రీఫండ్ చేస్తాం. ద‌ర్శ‌న టికెట్లు పొందిన‌వారిలో దాదాపు 30 శాతం భ‌క్తులు ద‌ర్శ‌నానికి రాలేక‌పోయారు. భ‌క్తులు ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసే ముందు ఆయా ప్రాంతాలు కంటైన్‌మెంట్ జోన్ల‌లో ఉన్నాయా లేదా అనే విష‌యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

3. సురేష్ – విజ‌య‌వాడ‌

ప్రశ్న: టిటిడి వెబ్‌సైట్‌లో బుక్ చేసుకునే గ‌దులకు సంబంధించి అద్దెతోపాటు అవి ఏ ప్రాంతంలో ఉన్నాయ‌నేది సూచిస్తే బాగుంటుంది. ప‌ర‌కామ‌ణికి ప్ర‌యివేటు ఉద్యోగుల‌ను కూడా అనుమ‌తించండి.

ఈవో : ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది భ‌క్తులు ఒకే ప్రాంతంలో బుక్ చేసుకుంటే వారికి స‌మ‌యానికి గ‌దుల‌ను కేటాయించ‌డం ఇబ్బంది కావున ఇలా చేస్తున్నాం. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప‌ర‌కామ‌ణికి ఎక్కువ సిబ్బంది అవ‌స‌రం లేదు. అవ‌స‌ర‌మైన‌పుడు త‌గిన నిర్ణ‌యం తీసుకుంటాం.

4. మాధ‌వీల‌త – బెంగ‌ళూరు

ప్రశ్న: ఎయిర్‌టెల్ డిజిట‌ల్ టివిలో ఎస్వీబీసీ ఛాన‌ల్‌ను తొల‌గిస్తామంటున్నారు.

ఈవో : స‌ద‌రు సంస్థ‌ను సంప్ర‌దిస్తాం.

5. కృష్ణ – హైద‌రాబాద్‌, శ్రీను – విజ‌య‌న‌గ‌రం

ప్రశ్న: సీనియ‌ర్ సిటిజ‌న్లు ఆరోగ్యంగా ఉన్నా ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌రా?

ఈవో : చాలా మంది భ‌క్తులు కోరుతున్నారు. క‌రోనా వ్యాధి నేప‌థ్యంలో ప‌దేళ్ల‌లోపు పిల్ల‌ల‌ను, 60 ఏళ్లు పైబ‌డినవారిని ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌డం లేదు. ఎక్కువ‌ మంది భ‌క్తుల సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని త‌గిన నిర్ణ‌యం తీసుకుంటాం.

6. ర‌మ‌ణ – బెంగ‌ళూరు

ప్రశ్న: తిరుమ‌ల‌, తిరుప‌తిలో గ‌దులు పొంద‌వ‌చ్చా?

ఈవో : తిరుమ‌ల‌లో దాదాపు 7 వేల గ‌దులు భ‌క్తుల‌కు అందుబాటులో ఉన్నాయి. తిరుప‌తిలో ఉన్న కొన్ని వ‌స‌తి స‌ముదాయాల‌ను క్వారంటైన్ సెంట‌ర్లుగా మార్చ‌డం జ‌ర‌గింది. విష్ణునివాసంలో గ‌దులు పొంద‌వ‌చ్చు.

7. నాగ‌మ‌ణి – తిరుప‌తి

ప్రశ్న: లాక్‌డౌన్ త‌రువాత శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చాం. శ్రీ‌వారి సేవ‌కులు లాగేశారు.

ఈవో : అలా జ‌ర‌గ‌కుండా చూస్తాం. శ్రీ‌వారి సేవ‌కుల‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నాం.

8. లోహిత – తిరుప‌తి, ఇంద్రాణి – బాప‌ట్ల

ప్రశ్న: లాక్‌డౌన్ త‌రువాత శ్రీ‌వారి ద‌ర్శ‌నం చాలా బాగా క‌ల్పించా‌రు. మీకు ధ‌న్య‌వాదాలు. ఏప్రిల్‌లో అష్ట‌ద‌ళ పాద ప‌ద్మారాధ‌న సేవ క‌రోనా కార‌ణంగా ర‌ద్ధ‌యింది. మ‌ళ్లీ ఎప్పుడు అవ‌కాశం కల్పిస్తారు.

ఈవో : భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం త‌దిత‌ర ఏర్పాట్లు చేసిన‌ టిటిడి అధికారులు, సిబ్బంది, పోలీస్, విజిలెన్స్, జిల్లా యంత్రాంగం, మున్సిపాలిటీ త‌దిత‌ర అన్ని విభాగాల అధికారుల‌కు ధ‌న్య‌వాదాలు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో శ్రీ‌వారి ఆల‌యంలో సేవ‌లన్నీ ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నాం. ఆర్జిత సేవ‌లు ఎప్పుడు ప్రారంభించాలో ఇంకా స్ప‌ష్ట‌త లేదు.

9. శ్రీ‌నివాస‌రావు – వైజాగ్‌

ప్రశ్న: స్వామివారిని వ‌రుస‌గా 2, 3 రోజులు ద‌ర్శ‌నం చేసుకోవ‌చ్చా.

ఈవో : ప్ర‌తిరోజూ దాదాపు 10,500 మంది ద‌ర్శ‌నం చేసుకుంటున్నారు. ఒక రోజు మాత్ర‌మే ద‌ర్శ‌నం చేసుకుని మిగ‌తా భ‌క్తుల‌కు అవ‌కాశం క‌ల్పించాలి.

10. శ్రీ‌నివాస్ – తాండూరు

ప్రశ్న: ఎస్వీబీసీలో గోవిందనామాలు ప్ర‌సారం చేయండి. రూ.300/- టికెట్ల‌కు ఒక ల‌డ్డూ ఇస్తున్నారు. రెండైనా ఇవ్వండి.

ఈవో : ఎస్వీబీసీలో గోవింద‌నామాలు ప్ర‌సారం చేస్తాం. ప్ర‌స్తుతం ప్ర‌తి భ‌క్తుడికీ ఒక ల‌డ్డూ ఉచితం. అద‌నంగా కావాలంటే రూ.50/- చెల్లించి పొంద‌వ‌చ్చు. ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌న టికెట్‌తోపాటు ల‌డ్డూలు బుక్ చేసుకోవ‌చ్చు.

11. సుబ్బారావు – వైజాగ్‌

ప్రశ్న: ప‌విత్ర‌మైన శ్రీ‌వారి ఆల‌యంలో బంగారువాకిలి లోప‌ల సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కులు చొక్కాలు లేకుండా విధులు నిర్వ‌హిస్తే బాగుంటుంది.

ఈవో : ఈ విష‌యాన్ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్తల మండ‌లి దృష్టికి తీసుకెళ‌తాం.

12. విజయ‌ – వైజాగ్

ప్రశ్న: సుంద‌ర‌కాండ పారాయణంలో పండితులు కాకుండా మిగిలినవారు మాస్కులు ధ‌రించేలా చూడండి. తిరుమ‌ల‌లో అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ఉందా. రైళ్ల‌లో వచ్చేవారికి బ‌స్సులు సౌక‌ర్యం ఉందా? స్వామివారి ల‌డ్డూ ప్ర‌సాదం జిల్లాల్లోని క‌ల్యాణ మండ‌పాల్లో ఇస్తున్నారా?

ఈవో : పారాయ‌ణంలో పాల్గొనేవారు మాస్కులు ధ‌రించేలా సూచిస్తాం. తిరుమ‌ల‌లో అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణతోపాటు అన్ని వ‌స‌తులు ఉన్నాయి. తిరుమ‌ల చేరుకోవ‌డానికి తిరుప‌తి నుండి ఆర్‌టిసి బ‌స్సులున్నాయి. అలిపిరి వద్ద శానిటైజేష‌న్‌, స్క్రీనింగ్‌, ర్యాండ‌మ్ శ్యాంపిల్స్ తీయ‌డం జ‌రుగుతోంది. ఇప్పుడు తిరుమ‌ల‌లో మాత్ర‌మే ల‌డ్డూ ప్ర‌సాదం అందిస్తున్నాం.

13. ర‌మేష్ బాబు – వైజాగ్‌, వెంక‌ట‌ర‌మ‌ణ – క‌డ‌ప‌

ప్రశ్న: జూన్‌లో శ్రీ‌వారి క‌ల్యాణం టికెట్టు ర‌ద్ద‌యింది. రీఫండ్ చేస్తారా.

ఈవో : రీఫండ్ చేస్తాం.

14. న‌వీన్‌కుమార్‌- గుంత‌క‌ల్‌

ప్రశ్న: ఎస్వీబీసీలో సంస్కృతం నేర్చుకుందాం కార్య‌క్ర‌మాన్ని ప్ర‌సారం చేయండి. తిరుమ‌ల‌లో మ‌రిన్ని భాష‌ల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయండి.

ఈవో : ఈ కార్య‌క్ర‌మాన్ని తిరిగి ప్ర‌సారం చేస్తాం. తిరుమ‌ల‌లో గ‌త ఏడాది సైన్ బోర్డులు పెంచాం, గ‌దులు, క‌ల్యాణక‌ట్ట, అన్న‌ప్ర‌సాదం త‌దిత‌ర అన్ని ప్రాంతాల‌ను సూచిస్తూ బోర్డులు ఉన్నాయి.

15. క్రాంతికుమార్ – వైజాగ్‌

ప్రశ్న: శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌స్తే క్వారంటైన్‌లో పెడ‌తారా?

ఈవో : శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల‌ను ర్యాండ‌మ్‌గా క‌రోనా ప‌రీక్షలు నిర్వ‌హిస్తున్నాం. పాజిటివ్ వ‌స్తే క్వారంటైన్‌కు త‌ర‌లిస్తాం. లేనిప‌క్షంలో స్వామివారిని ద‌ర్శించుకోవ‌చ్చు.

16. శ్రీ‌నివాసులు – హైద‌రాబాద్‌

ప్రశ్న: మా రెండు కుటుంబాల మ‌ధ్య స‌మ‌స్యను ప‌రిష్క‌రించుకునేందుకు త‌రిగొండ‌లోని టిటిడి ఆల‌యంలో ప్ర‌మాణం చేసేందుకు అనుమ‌తి ఇవ్వ‌డం లేదు.

ఈవో : శ్రీ‌వారి అనుగ్ర‌హంతో మీ రెండు కుటుంబాల మ‌ధ్య స‌మ‌స్య ప‌రిష్కారం కావాల‌ని కోరుకుంటున్నా. అనుమ‌తి విష‌య‌మై అధికారులు మీకు ఫోన్ ద్వారా తెలియ‌జేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి జెఈవో   పి.బ‌సంత్‌కుమార్‌, జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం)   ఎస్‌.భార్గ‌వి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్  ర‌మేష్‌రెడ్డి, ఎస్ఇ ఎల‌క్ట్రిక‌ల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, ఆరోగ్య‌శాఖాధికారి డా. ఆర్‌ఆర్‌.రెడ్డి, డిఎఫ్‌వో   చంద్ర‌శేఖ‌ర్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

Tags:Unprecedented response to sunflower recitation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *