Unreliable bond with Congress Party

కాంగ్రెస్ పార్టీతో విడదీయలేని బంధం 

 Date:13/07/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీలో చేరారు. గురువారం నాడే ఢిల్లీకి చేరుకున్న ఆయన అంతకు ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాహుల్ ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కిరణ్ కుమార్ రెడ్డితోపాటు పలువురు నేతలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు జాతీయస్థాయిలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి ఊమెన్ చాంది, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అధిష్ఠానం ఆదేశాలను సైతం కిరణ్ ధిక్కరించారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి పంపారు. విభజన వల్ల నష్టపోతామని పదే పదే చెప్పినా, కాంగ్రెస్ అధిష్ఠానం దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం సొంతంగా జై సమైక్యాంధ్ర పార్టీని పెట్టి, 2014 ఎన్నికల్లో పోటీచేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడటంతో నాటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన అనుచరులు ఇతర పార్టీల్లో చేరిపోయారు. సోదరుడు సంతోష్ రెడ్డి సైతం టీడీపీ గూటికి వెళ్లిపోయారు. నాలుగేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన మళ్లీ నేడు కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవలే ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలు ఇంచార్జ్‌గా నియమితులైన కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ తీవ్రంగా ప్రయత్నించడంతో కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. పలువురు కీలక నేతలతో భేటీ అయిన ఊమెన్ చాందీ, కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయినవారు తిరిగి వచ్చి, పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఇందులో భాగంగానే మూడు రోజుల కిందట కోస్తా ఆంధ్రలోని పలువురు కాంగ్రెస్ కీలకనేతలతో ఫోన్‌లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మంతనాలు జరిపారు. తాను తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నానని మీరు కూడా పార్టీలో చేరి పాత రోజులు తీసుకొచ్చేందుకు సర్వత్రా కృషి చేయాలని వారికి విఙ్ఞ‌ప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే మా కుటుంబానికి గుర్తింపు వచ్చిందని కిరణ్ అన్నారు. నా తండ్రి నాలుగుసార్లు, నేను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచామంటే దానికి కారణం కాంగ్రెస్‌ పార్టీయేనని, గాంధీ కుటుంబంతో సన్నిహితంగా మెలగడం వల్లే తనకు చీఫ్‌ విప్‌, స్పీకర్‌, ముఖ్యమంత్రి లాంటి పదవులు దక్కాయని మాజీ సీఎం తెలియజేశారు. నేను వైఎస్‌కు అత్యంత సన్నిహితుడిని, కాంగ్రెస్‌ కుటుంబంతో తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందన్న కిరణ్, అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. గతంలో పదవులు అనుభవించి కాంగ్రెస్‌‌ను వీడి ఇతర పార్టీల్లో చేరిన 30 నుంచి 40 మంది నేతలను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి శాయశక్తులా కృషిచేస్తానని తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు అమలు నెరవేరాలంటే వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కాంగ్రెస్‌ పార్టీ వల్లే సాధ్యమని, పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని ఇచ్చిన హామీలను ఎన్డీయే ప్రభుత్వం అపహాస్యం చేసిందని మండిపడ్డారు. విభజన చట్టాన్ని అమలుచేయడంతో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. విభజన చట్టం అమల్లో అధికార, ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. విభజన చట్టాన్ని రూపొందించిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే దాన్ని అమలు చేయడానికి సిద్దంగా ఉందని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎన్డీఏ పాలన మొదలై నాలుగేళ్లు గడిచినా రైల్వే జోన్, జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పా ఇవన్నీ జరగవని పూర్తి నమ్మకంతోనే మళ్లీ పార్టీలోకి వచ్చానని కిరణ్ తెలిపారు. సాధారణ కార్యకర్తగా ప్రస్తుతం పార్టీలో చేరానని, అన్ని నిర్ణయాలు అధిష్ఠానం తీసుకుంటుందని అన్నారు.2019 ఎన్నికలకు గాను ఏపీ కోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్ ను రెడీ చేస్తున్నామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. 55 నియోజకవర్గాల్లో ప్రత్యేక వ్యూహాన్ని అమలుచేయబోతున్నామని తెలిపారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. అనంతరం మీడియాతో రఘువీరా మాట్లాడుతూ, కిరణ్ ను కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో, భావోద్వేగంతోనే కిరణ్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారని… ఎప్పటికీ ఆయన కాంగ్రెస్ నాయకుడేనని తెలిపారు. కాంగ్రెస్ ను వీడిన నేతలంతా మళ్లీ సొంత గూటికి రావాలని కోరారు.ఏపీని కేవలం రాహుల్ గాంధీ మాత్రమే ఆదుకోగలరని… రాహుల్ ప్రధాని అయితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని రఘువీరా తెలిపారు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటినీ కాంగ్రెస్ నెరవేరుస్తుందని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పునర్వైభవం పొందుతుందని ధీమాగా అన్నారు.
కాంగ్రెస్ పార్టీతో విడదీయలేని బంధం https://www.telugumuchatlu.com/unreliable-bond-with-congress-party/
Tags:Unreliable bond with Congress Party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *