Natyam ad

యూపీ గాలి మారుతోందా

లక్నో ముచ్చట్లు:
 
ఒమిక్రాన్‌ వేరియంట్‌తో సంబంధం లేకుండా ఎలక్షన్‌ కమిషన్‌ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పచ్చ జెండా ఊపింది. దాంతో, ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌లో ఎన్నికల హీట్‌ పెరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో అతి పెద్ద రాష్ట్రమైన యూపీతో పాటు చిన్నదైన గోవా కూడా అధిక రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఈసారి యూపీ ఎన్నికల ఫలితాలు సీఎం యోగి భవితవ్యంతో పాటు దేశ రాజకీయాలను కూడా నిర్దేశించనున్నాయి. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్‌ ప్రధాని మోడీ నీడన ఉన్న ముఖ్యమంత్రి కాదు. తనకంటూ ఒక ఇమేజ్‌ ఏర్పరచుకున్న నేత. 2017లో మోడీ ఇమేజ్‌తో బీజేపీ రాష్ట్రంలో మూడు వందలకు పైగా సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు జరిగే ఎన్నికలు యోగీ పాలనపై ప్రజా తీర్పు. ఏం జరిగినా దానికి ఆయనే బాధ్యులు. ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కాబట్టి 2017 కన్నా కొద్ది గొప్ప సీట్లు తగ్గితే పర్వాలేదు. కానీ భారీగా సీట్లకు కోతపడితే మాత్రం అధిష్టానం ఉపేక్షించదు. ఆయన స్థానంలో ఇంకొకరిని భర్తీ చేస్తుంది. కాబట్టి యోగికి ఈ ఎన్నికలు అతి పెద్ద పరీక్ష.హిందుత్వ సిద్ధాంతాన్ని మోడీ కన్నా బలంగా ముందుకు తీసుకువెళుతున్న నేతగా యోగిని ఇప్పటికే ప్రజలు గుర్తించారు. మోడీ తరువాత ఎవరు అన్న ప్రశ్న వచ్చినపుడు ముందు ఆయన పేరే వినిస్తోంది. అమిత్‌ షా, రాజ్‌నాథ్‌, దేవేంద్ర పద్నవిస్‌ వంటి వారు పోటీలో ఉన్నా.. యూపీలో విజయం సాధిస్తే మాత్రం వారికన్నా యోగి ముందుంటారు. ఐతే, ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీ అనూహ్యంగా బలపడటం బీజేపీ అఖండ విజయాన్ని కచ్చితంగా అడ్డుకుంటుందని చెప్పొచ్చు.మరోవైపు, ఇతర రాష్ట్రాలలో మోడీ మ్యాజిక్‌ పని చేస్తుందా లేదా అన్నది ఈ ఎన్నికలతో తెలిసిపోతుంది.
 
 
 
2014, 2019 లోక్‌సభ ఎన్నికల స్థాయిలో మోడీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయలేకపోతున్నారు. 2019 నుంచి జరిగిన ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన పెద్దగా ప్రభావం చూపలేదు. ఢిల్లీ, జార్ఖండ్‌, మహారాష్ట్రలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలవలేకపోయింది. హర్యానాలో కూడా మోడీ మ్యాజిక్‌ పనిచేయలేదు. 2019 కి ముందు కర్నాటకలో కూడా మోడీ విస్తృత ప్రచారం చేశారు. ఐనా, బీజేపీకి మెజార్టీ సీట్లు దక్కలేదు. నిరుడు మోడీ వర్సెస్‌ దీదీ గా జరిగిన బెంగాళ్‌ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ రికార్డు విజయం అందుకుంది. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాల్సి వుంది. మరోవైపు, పంజాబ్‌లో బీజేపీ ఈసారి పాత మిత్రులకు బదులు కొత్తగా ఏర్పడిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళుతోంది. అయితే ఈ ఎన్నికలు బీజేపీ కన్నా కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌కు పెద్ద పరీక్ష. కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన పెద్ద రిస్క్‌ చేశారు. ఓడిపోతే ఆయన కుటుంబ రాజకీయాలు ప్రమాదంలో పడతాయి.మణిపూర్‌, గోవా చిన్న రాష్ట్రాలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. కానీ బీజేపీ తన శక్తి యుక్తులతో అధికారంలోకి రాకుండా దానిని అడ్డుకుంది. ఈ సారి కూడా గోవాలో ఏ పార్టీకీ మెజార్టీ వచ్చే పరిస్థితే లేదు. ఇక మణిపూర్‌ అనేక జాతుల సమ్మేళనం. ఇక్కడ బీజేపీకి తనకంటూ సొంత బలం లేదు. అమిత్‌ షా ఎలాంటి చాణక్యం నడుపుతారో చూడాల్సి వుంది.కాంగ్రెస్‌ విషయానికొస్తే పంజాబ్ లో అధికారం నిలబెట్టుకోవాల్సిన తప్పని పరిస్థితి. లేదంటే కాంగ్రెస్‌ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ శాశ్వతంగా ఆక్రమిస్తుంది. వచ్చే ఎన్నికలలో ఆప్‌ అధిక స్థానాలు దక్కించుకుంటుందని సర్వేలు అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికారం నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్‌కు పంజాబ్‌ మరో ఢిల్లీ అవుతుంది.మరోవైపు, ఆప్‌ భవిష్యత్ కూడా ఈ ఎన్నికల మీద ఆధారపడి వుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌ నుంచి నాలుగు సీట్లు సాధించింది. కానీ 2019 ఎన్నికల్లో ఒక్క సీటే గెలిచింది.
 
 
 
కానీ ఢిల్లీలో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఐతే అది పూర్తి స్థాయి రాష్ట్రం కాదు. పంజాబ్‌ పూర్తి స్థాయి రాష్ట్రం. కాబట్టి పంజాబ్‌లో గెలిస్తే ఆప్‌ భవితవ్యమే మారిపోతుంది. బీజేపీ వ్యతిరేక ఓటు తప్పని పరిస్థితిలో ఇప్పుడు కాంగ్రెస్‌కు వెళుతుంది. పంజాబ్‌లో అధికారంలోకి వస్తే హిందుత్వ వ్యతిరేక లౌకిక, ప్రజాస్వామ్య శక్తులకు ఆప్‌ ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. కాబట్టి పంజాబ్‌తో పాటు గోవా, ఉత్తరాఖండ్‌లో బలపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో అది ఎంత వరకు విజయవంతమవుతుందో రేపటి ఎన్నికల ఫలితాలు తేలుస్తాయి.ఇదిఇలావుంటే, దేశ రాజకీయాలలో అత్యంత కీలకమైన యూపీలో రాజకీయాలు మారుతున్నాయి. పలువురు బీజేపీ నేతలు సమాజ్‌వాదీ పార్టీలో చేరుతున్నారు. తాజాగా యోగీ క్యాబినెట్‌లో మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య పార్టీని వీడి అఖిలేష్‌తో చేతులు కలిపారు. ఆయనతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా సమాజ్‌ వాదీ పార్టీ ఫిరాయించినట్టు సమాచారం. కనీసం, 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ మారతారని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ అనటం గమనార్హం.ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలను కుల రాజకీయాలే నిర్ధేశిస్తాయి. అయితే ఇప్పుడు కులంతో పాటు మతం పాలిటిక్స్‌ని శాసిస్తున్నాయి. సీఎం యోగీ 80 వర్సెస్‌ 20 అనటం ఇందుకు నిదర్శనం. 2017 ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు కలిసి 39 శాతం ఓటింగ్‌తో మూడు వందలకు పైగా స్థానాలు గెలుచుకున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీలు చెరో 22 శాతం ఓట్లు సాధించాయి. అందుకే 2019 సార్వత్రిక ఎన్నికలలో ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి. అయితే ఆ కెమిస్ర్టీ వర్కవుట్‌ కాలేదు. బీజేపీ చిన్నా చితక ఓబీసీ పార్టీలతో పొత్తులు పెట్టుకుని 51 శాతం ఓటింగ్ సాధించింది.గత ఎన్నికల్లో నాన్ యాద్‌ ఓబీసీలు, హిందూ నాన్‌ జాతవ్‌ దళిత ఓటర్లు బీజేపీ వైపు వెళ్లారు. కానీ ఈ సారి ఎస్పీ-బీఎస్పీ కలిసి పోటీ చేయట్లేదు. సమాజ్‌వాదీ పార్టీ పోటీలో ముందుంది. బీఎస్పీ ఎంతో వెనకబడింది. ఈ ఎన్నికలపై మాయావతి ఆశలు వదులుకున్నట్టే కనిపిస్తోంది.
 
 
 
 
బీజేపీ వైపు వెళ్లిన జాతవ్‌ యేతర ఓటు తిరిగి మాయావతి చెంతకు రావటం కష్టం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జాతవ్‌ ఓటర్లు కూడా ఆమెను వీడే అవకాశాలే ఎక్కువ. అదే జరిగితే వారు ఎటువైపు వెళతారనేది కీలకం. బీజేపీ, ఎస్పీ రెండూ వారిపై ఆశలు పెట్టుకున్నాయి. కాబట్టి రెండు పార్టీల మధ్య జాతవ్‌ ఓట్ల చీలిక తప్పేలా లేదు.కొద్ది పాటి ఓటు శాతం కూడా ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపుతుందని యూపీ ఎన్నికల అనుభవాలు చెపుతున్నాయి. 2012లో సమాజ్‌వాదీ పార్టీ కేవలం 29 శాతం ఓటింగ్‌ తెచ్చుకుని పూర్తి మెజార్టీ సాధించింది. అంతకు ముందు 2007లో బీఎస్పీకి 30శాతం ఓటు షేర్‌తో అధికారం చేపట్టింది. ఓట్ల చీలికతోనే అది సాధ్యమైంది. 2012లో బీఎస్పీకి 25 శాతం ఓటింగ్ వచ్చింది కానీ సీట్లు చాలా తగ్గాయి. ఈ ఎన్నికలలో కూడా ఆ ట్రెండ్‌ కనిపిస్తోంది.యూపీలోని హిందూ అగ్రవర్ణాలలో బీజేపీకి కనీసం 20 శాతం ఓటింగ్‌ ఉంది. అందులో సగం బ్రాహ్మణులు. కొంత కాలంగా ఈ సామాజిక వర్గం కమలంపై కొంత గుర్రుగా ఉంది. ఠాకూర్‌ సామాజిక వర్గానికి చెందిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తమను చిన్న చూపు చూస్తున్నారని బ్రాహ్మణులు అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. లఖింపూర్‌ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు. ఈ మంత్రి బ్రాహ్మడు కావటం వల్లే బీజేపీ సర్కార్‌ కఠినంగా వ్యవహరించలేదన్న విమర్శలు ఉన్నాయి. మిశ్రాపై చర్యలు తీసుకుంటే వారి ఆసంతృప్తి మరింత పెరుగుతుంది. ఇవన్నీ పక్కనపెట్టి బీజేపీ 20 శాతం హిందూ అగ్రవర్ణ ఓట్లు సాధించినా..దానికి నాన్‌ యాదవ్‌ ఓబీసీ ఓట్లు..కొన్ని నాన్‌ జాతవ్‌ దళిత ఓట్లు కావాలి. అప్పుడే మరోసారి బీజేపీకి అధికారం దక్కుతుంది. ఇక్కడే బీజేపీకి ఎస్పీకీ మధ్య యుద్ధం జరుగుతోంది.మరోవైపు, అఖిలేష్‌ యాదవ్‌ ఈసారి చిన్న చిన్న ఓబీసీ పార్టీలతో జత కలిశారు. చౌదురీ చరణ్‌ సింగ్‌ మనవడు జయంత్‌ చౌదురీ సారధ్యంలోని జాట్‌ పార్టీ రాష్ట్రీయ లోక్‌దళ్‌తో కూడా అఖిలేష్‌ పొత్తు పెట్టుకున్నాడు. జాట్ల ప్రాభల్యం అధికంగా ఉండే వెస్ట్రన్‌ యూపీలో ఆర్‌ ఎల్‌ డీ కి మంచి పట్టుంది. కనీసం వంద సీట్లపై ఇది ప్రభావం చూపుతుంది. సాగు చట్టాలతో ఈ ప్రాంత జాట్‌ రైతులు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారు.
 
 
 
కమలదళం కలవరానికి ఇది కూడా ఒక కారణం. అలాగే సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ నాయకుడు ఓంప్రకాశ్‌ రాజభర్‌ కూడా అఖిలేష్‌తో చేతులు కలిపాడు.ఈస్ట్రన్‌ యూపీలో ఈ పార్టీకి మూడు నుంచి నాలుగు శాతం ఓటింగ్‌ వస్తుంది. కనీసం 20 స్థానాలపై ఇది గణనీయమైన ప్రభావం చూపుతుంది. కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్‌ తల్లి కృష్ణపటేల్‌ నాయకత్వంలోని అప్నాదళ్ కూడా ఎస్పీతో జత కట్టింది. అప్నాదళ్‌ ప్రధానంగా కుర్మీ సామాజిక వర్గం కోసం ఏర్పడిన పార్టీ. ఐతే అనుప్రియ, ఆమె తల్లి ఎంత వరకు కుర్మి ఓట్లను పంచుకుంటాయో చూడాల్సి వుంది. మరో ఓబీసీ మహాదేవ్‌ మౌర్యకు చెందిన పార్టీ కూడా ఎస్పీ వైపు వెళ్లింది. అలాగే ఓబీసీకి చెందిన రాష్ట్ర మంత్రి స్వామీ ప్రసాద్‌ మౌర్య బీజేపీకి గుడ్‌బై చెప్పి ఎస్పీలో చేరాడు. తాజాగా మరో ఓబీసీ మంత్రి దారా సింగ్ చౌహాన్ కూడా తన పదవిని వీడుతున్నట్లు ప్రకటించారు. గవర్నర్కు రాజీనామాను కూడా పంపారు. ఆయన కూడా సమాజ్‌వాదీ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొందరు ఎమ్మెల్యేలు కూడా కమలానికి గుడ్‌బై చెప్పి సైకిల్‌ ఎక్కారు. ఇంకా వలసలు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఫైట్‌ చిన్న చిన్న ఓబీసీ పార్టీల మధ్యనే ఉంటుందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే గాలి మెల్లిగా బీజేపీ వైపు నుంచి ఎస్పీ వైపుకు మళ్లుతుందనటానికి ఈ పరిణామాలను సంకేతాలుగా చెప్పవచ్చు. బీజేపీ కనీసం 50 శాతం నాన్‌ యాదవ్‌ ఓట్లు , నాన్‌ జాతవ్‌ దళిత ఓట్లు సాధిస్తే తప్ప బీజేపీ అధికారం నిలబెట్టుకోలేదు. కానీ వారిని తన వైపు తిప్పుకోగల శక్తివంతుడైన ఏకైక నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌ బీజేపీకి అడ్డుగా ఉన్నాడు. దీనిని కమలదళం ఎలా అధిగమిస్తుందో చూడాలి!!
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: UP air is changing