చంద్రయాన్ టెక్నాలజీపై అమెరికా ఆసక్తి
బెంగళూరు ముచ్చట్లు:
చంద్రయాన్ 3 ప్రయోగం భారతదేశం ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసింది. ఇప్పటి వరకు ఏ దేశానికి సాధ్యం కాని చంద్రుడి దక్షిణ ధృవంపై తొలి సారిగా సేఫ్ ల్యాండింగ్ చేసి, దక్షిణ ధృవంపై కాలు మోపిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. అగ్రదేశాలు సైతం ఆశ్చర్య పోయేలా ప్రయోగాన్ని విజయవంతం చేసింది. అతి తక్కువ ఖర్చుతో ప్రపంచంలో ఏ ఇతర దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రయాన్ 3ని విజయంతం చేసి అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేసింది. అంతేకాదు భారత టెక్నాలజీని మరో లెవల్‌కు వెళ్లింది. భారత్ చంద్రయాన్ 3ని విజయంతంగా ప్రయోగించడంతో భారత టెక్నాలజీపై అందరికి ఆసక్తి ఏర్పడింది. ఆ సాంకేతికత ఏంటో తెలుసుకోవడానికి అమెరికా సైతం ఆసక్తి చూపింది. ఈ విషయాన్ని ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. తాజాగా మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామేశ్వరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి సోమనాథ్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రయాన్ 3 విజయం తర్వాత అమెరికా స్పేస్ నిపుణులు, నాసా అధికారులు భారత టెక్నాలజీ గురించి అడిగినట్లు చెప్పారు.

చంద్రయాన్-3 వ్యోమనౌక అభివృద్ధి కార్యక్రమాలు చూసిన తర్వాత భారత్ తమతో అంతరిక్ష సాంకేతికతను పంచుకోవాలని నాసా- జెట్ ప్రొపెల్షన్ ల్యాబోరెటరీ నిపుణులు కోరారని సోమనాథ్ వెల్లడించారు.భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 3 గురించి తెలుసుకోవాడానికి నాసా నుంచి ఆరుగురు నిపుణులు వచ్చినట్లు చెప్పారు. వారికి చంద్రయాన్ 3 ప్రయోగం గురించి పూర్తిగా వివరించినట్లు చెప్పారు. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఇస్రో ఎలా రూపొందించింది? దాని కోసం ఇస్రో ఇంజినీర్లు ఏ విధంగా కష్టపడ్డారు? చంద్రుడిపై ఏ విధంగా సేఫ్ ల్యాండింగ్ చేయనున్నారు. సహా వివిధ విషయాలను వారికి వివరించినట్లు తెలిపారు. అనంతరం ఇస్రో తయారు చేసిన సాంకేతిక పరికరాలను పరిశీలించిన నాసా నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారని, అవి చాలా తక్కువ ఖర్చుతో, నిర్మాణానికి సులభంగా, అత్యాధునిక సాంకేతికతతో ఉన్నాయని కితాబిచ్చినట్లు తెలిపారు.
Tags: US interest in Chandrayaan technology
