తాబేళ్ల పిల్లల సంరక్షణ

Date:30/04/2019
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖలోని ఎన్టీపీసీ ధర్మల్ ప్లాంట్ సమీపాన ఉన్న ముత్యాలమ్మ పాలెం బీచ్ లో సంరక్షించిన ఆలివ్ రిడ్లే తాబేళ్ల గుడ్లనుంచి వచ్చిన పిల్లలను మంగళవారం తెల్లవారు జామున సముద్రంలోకి వదిలారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీపీసీ సింహాద్రి పవర్ ప్లాంట్ ఎపి అటవీ శాఖతో కలిసి ఈ ప్రాజెక్టు నిర్వహిస్తోంది.ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సంస్థలు ఐక్యరాజ్యసమితి తో కలిసి పనిచేస్తున్నాయి. ఏపి అటవీశాఖ ఈ రాష్ట్రంలో ఈ సంరక్షణకు నోడల్ ఏజెన్సీగా ఉంది. అందులో భాగంగా ఎన్టీపీసీ ద్వారా ముత్యాలమ్మ పాలెం బీచ్ లో సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు.  సముద్రపు తాబేళ్లకు ఒక జన్మపూర్వక లక్షణం ఉంది. అవి గుడ్డునుంచి ఎక్కడ బయటకు వస్తే అక్కడికే గుడ్లు పెట్టటానికి గుర్తు పెట్టుకుని వస్తాయి. దాదాపు పదిహేనేళ్ల వయసు వస్తేనే తాబేళ్లు గుడ్లు పెడతాయి.
మరి అన్నేళ్లు ఇవి జన్మ స్థలాన్ని ఎలా గుర్తు పెట్టుకుంటాయి అన్నది నేటికీ పజిల్. ఏదేమైనా తీరప్రాంతమంతా అభివృద్ధి పేరిట జనావాసాలు, పరిశ్రమలు వస్తున్నందున వీటి గుడ్లకు రక్షణ లేకుండా పోయింది. పైగా తాబేలు గుడ్లు పెట్టాక తన దారిన తాను పోతుంది. నలభై రోజులు సూర్య తాపానికి పొదగబడిన గుడ్లనుంచి వచ్చిన పిల్లలు తెల్లవారు జామున బయటకు వచ్చి సూర్యుడు ఉదయిస్తున్న దిశగా వెళతాయి బంగాళాఖాతంలో తూర్పునే సూర్యుడు ఉదయిస్తాడు కనుక అవి సముద్రంలోకి పోతాయి. కానీ ఆ కాస్త దూరం వెళ్లే లోపే వాటిని కాకులు, కుక్కలు, పీతలు తినేస్తాయి. తాబేలు వంద గుడ్లు పెడితే వాటిలో ఒక్కటి పెరిగి పెద్దదైతే గొప్ప. ఈ పరిస్థితుల్లో తీరానికి వచ్చిన తాబేళ్లను రక్షిస్తూ, అవి పెట్టిన గుడ్లను సేకరించి, సంరక్షించి పిల్లలుగా మారాక భద్రంగా సముద్రంలో వదలటానికే ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. మంగళవారం ఎన్టీపీసీ అధికారులు, అటవీశాఖ అధికారులు కుటుంబాలతో సహా వచ్చి ఆలివ్ రిడ్లేలను సముద్రంలో వదిలారు. కార్యక్రమమంతా ఒక ఉత్సవంలా సాగింది.
Tags: Turtle child care

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *