వైద్యమెక్కడ..

Date:10/08/2018
విజయనగరంముచ్చట్లు:
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల మూఢనమ్మకాలు, వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వెరసి ప్రసవమంటేనే ప్రాణగండంగా మారిపోతుంది. ప్రసవ తేదీకి కనీసం వారం, పదిరోజుల ముందే గర్బిణుల్ని ఆసుపత్రికి చేర్చాల్సి ఉన్నా ఏజెన్సీలో దాదాపుగా చాలాచోట్ల అది జరగడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గర్భం దాల్చిన ప్రతి మహిళ ఆరోగ్యంపై సంబంధిత ఉప కేంద్రం పరిధిలోని ఆరోగ్య కార్యకర్తలు ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకోవాలి. వారికి ఐరన్‌ మాత్రలు ఇచ్చేసి వదిలేయకుండా దగ్గర్లోని పీహెచ్‌సీకి తీసుకెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించాలి. తల్లీబిడ్డల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు గర్భిణికి వివరించి చెప్పాలి. అదే హైరిస్క్‌ కేసుల్లోనైతే గర్భిణికి ఎంత రక్తముందో మొదలు ఆమె బరువు, గర్భంలో బిడ్డ ఎదుగుదలని తెలుసుకోవడానికి ప్రతీ 15 రోజులకోసారి పరీక్షలు చేయించి క్రమం తప్పకుండా ఏమేం తినాలో, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో కౌన్సిలింగ్‌ ఇప్పించాలి. అదెంతవరకూ సక్రమంగా జరుగుతుందని ప్రశ్నిస్తే సమాధానం రావడం కష్టం.కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు ప్రసవ తేదీ వరకూ అక్కడే ఉండిపోతే పురిటినొప్పులు మొదలయ్యాక ఆసుపత్రికి వెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. పైగా అత్యంత ప్రమాదం. అందుకే ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు (హైరిస్క్‌ కేసులైతే) కనీసం వారం రోజుల ముందే గర్భిణుల్ని సీహెచ్‌సీల్లోని ప్రసూతి నిరీక్షణ కేంద్రాల్లో చేర్పించాల్సి ఉంటుంది. ఇవి జిల్లాలో ఎనిమిది ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో చేర్చడం వల్ల ఎప్పుడు ప్రసవం వచ్చినా సురక్షితంగా వైద్యం అందించడానికి ఆస్కారముంటుంది. కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో దీనిపై పె`ద్దగా పట్టింపు ఉండట్లేదు. సాధారణంగా గిరిజనులకు కొన్ని మూఢ నమ్మకాలు ఉంటుంటాయి. ప్రసవ తేదీకి ముందే ఆసుపత్రికి రావడానికి ఒప్పుకోరు. అందుకే ప్రసవ తేదీ వరకూ ఇంటి దగ్గరే ఉండిపోతే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో గర్భిణికి, ఆమె కుటుంబ సభ్యులకు వైద్యసిబ్బంది వివరించి చెప్పాలి. కచ్చితంగా వారం రోజుల ముందైనా ఆసుపత్రిలో చేర్పించాలి. అయినా కొందరు వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగా గర్భిణులకు పురిటినొప్పులొచ్చాక ఆసుపత్రికి వెళ్లడానికి 108 వాహనం కోసమో, ప్రైవేటు వాహనాల కోసమో వెతుకులాడాల్సిన దుస్థితి పడుతుంది. పైగా వైద్యం అందడంలో జాప్యం జరగడంతో తల్లికో, బిడ్డకో ప్రాణాల మీదకొస్తుంది.అంబులెన్సుల్లో వందలమంది శిశువులు జన్మించడానికి కారణమదే. చాలా సందర్భాల్లో 108 వాహనం గర్భిణి ఇంటికి వెళ్లేసరికే ప్రసవం జరిగిపోతుంది. జిల్లాలో గత ఆరేళ్లలో అలాంటి కేసులు 858 ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొంప ముంచుతున్న రిఫర్‌లు: పురిటినొప్పులతో వచ్చే గర్భిణుల్ని కనాకష్టంతో ఆసుపత్రికి చేర్చినా అలాంటి అత్యవసర కేసుల్ని తీసుకోవడానికి చాలాచోట్ల పీహెచ్‌సీ, సీహెచ్‌సీల వైద్యులు ఒప్పుకోవడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ 24/7 పనిచేస్తున్నాయని ఐటీడీఏ పీవో లక్ష్మీశా చెబుతున్నా రాత్రివేళల్లో దాదాపుగా వైద్యులే అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొంటుంది. అందుకే గర్భిణులు అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే స్టాఫ్‌నర్సులు తమకెందుకొచ్చిన గొడవని వారిని రిఫర్‌ చేసేస్తున్నారు. దీనివల్ల విజయనగరమో, విశాఖపట్టణమో వెళ్తూ… మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయిన తల్లులు ఉన్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో వైద్యులు తాము చేయలేమని చేతులెత్తేసి రిఫర్‌ చేసేసిన కేసుల్ని ఏమాత్రం వైద్య విద్యార్హత లేని 108 వాహన ఈఎంటీలు చేసేస్తుండటం మరీ విచిత్రం.
జిల్లాలో గత ఆరేళ్లలో అంబులెన్సుల్లో జరిగిన 752 ప్రసవాలు వారు చేసినవే. అయితే అవి తప్పనిసరి పరిస్థితుల్లోనే చేస్తున్నవే తప్ప తల్లీబిడ్డలకు అలాంటి వైద్యం శ్రేయస్కరం కాదన్నది అందరికీ తెలిసిందే. జిల్లాలో వందల మంది శిశువులు అంబులెన్సుల్లోనే పుడుతున్నా యంత్రాంగం మాత్రం కళ్లు తెరవడం లేదు. కనీసం ఆ గణాంకాల్ని పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తు కార్యాచరణకు పూనుకోవడం లేదు. ఇంకో విశేషమేమిటంటే బలవంతంగా ఆ లెక్కల్ని తుంగలో తొక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. మాతాశిశు మరణాలపై జిల్లాస్థాయిలో కలెక్టరు ఆధ్వర్యంలో కమిటీ ఉన్నా దాని పనితీరుపైనా తీవ్ర విమర్శలున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి ఒకపక్క ఏజెన్సీలో కొండప్రాంతాలకు రవాణా సౌకర్యాలు పెంచడంతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందికి జవాబుదారీతనం పెంచకపోతే అంబులెన్సు ప్రసవాలు వందల నుంచి వేలకు పెరుగుతాయనడంలో సందేహం లేదు.
Tags: Vaidyamekkada ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *