వైకుంఠ ఏకాదశి వైశిష్ట్యం
తిరుమల ముచ్చట్లు:
వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని గురించి ఒక కథ చెప్పబడుతోంది. మహాప్రళయం జరిగింది. ప్రళయానంతరం, నీటి మీద తేలుతున్న విష్ణుభగవానుడు, మరలా సృష్టి చేయడాన్ని గురించి అఆలోచిస్తూండగా, ఆయన ముందు పంచభూతాత్మకమైన (ఆకాశం, అగ్ని, గాలి, నీరు, భూమి) బ్రహ్మాండం గోచరించింది. అనంతరం ఆయన బొడ్డులో నుండి ఓ తామరపువ్వు ఉద్భావించగా, అందులో బ్రహ్మ ఆసీనుడై ఉన్నాడు. బ్రహ్మకు, విష్ణుభగవానుడు మంత్ర, తంత్ర, శాస్త్రాలను బోధించాడు. బ్రహ్మకు అన్ని శాస్త్రాలు అర్థమైనప్పటికీ జ్యోతిశ్శాస్త్రం అర్థం కాలేదు. ఈ విషయాన్ని బ్రహ్మ విష్ణువుతో మొరపెట్టుకోగా, అప్పుడు స్వామి శ్రీరంగనాథుని రూపంలో, తన భార్యలతో, పరివారగణంతో ఓ విమానంలో దర్శనమిచ్చాడు. ఆ విమానం ఓంకార స్వరూపంలో ఉంది. అలా వచ్చిన స్వామి, బ్రహ్మకు జ్యోతిశ్శాస్త్రాన్ని బోధించి, తిరిగి వైకుంఠానికి వెళ్లేందుకు సమాయత్తమయ్యాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మానవులు కోలుచుకునేందుకై స్వామిని ఇక్కడే ఉండమని ప్రార్థించగా, స్వామి విమానంతో పాటు విగ్రహాల రూపంలో కొలువైయ్యాడు.
కొంతకాలం తరువాత ఆ విగ్రహాల విమానం సూర్యవంశ మూలపురుషుడైన ఇక్ష్వాకునికి బహుమతిగా ఇవ్వబడి, కాలక్రమాన శ్రీరామచంద్రునికి చేరింది. రామావతారాన్ని ముగించే ముందు, శ్రీరాముడు ఆ విమాన విగ్రహాలను విభీషణుకి ఇచ్చి, తనకు చేసిన సహాయానికి గుర్తుగా తను ఆ విగ్రహాలను ఇస్తున్నట్లుగాను, వాటిని లంకకు తీసుకుని వెళ్ళి పూజాదులు చేయవలసిందిగాను, అయితే లంకకు చేరేవరకు విమానవిగ్రహాలను నేలపై పెట్టరాదని చెప్పాడు. చెప్పలేనంత ఆనందంతో విగ్రహాలను అందుకున్న విభీషణుడు, లంకాద్వీపానికి బయలు దేరాడు. అయోధ్య నుంచి బయలుదేరిన విభీషణుడు, కావేరినదీ తీరాన్ని చేరుకునేసరికి సంధ్యావందనం చేయాల్సిన సమయమైంది. వెంటనే కావేరీతీరంలో స్నానం చేసి సంధ్య వార్చుకుందామనుకున్నాడు. అయితే విమాన విగ్రహాలను కిందపెట్టకూడదు కదా! ‘ఎలా?!’ అని అటూ ఇటూ చూసిన విభీషణుని కంట్లో బాలబ్రహ్మచారి కనపడ్డాడు. విభీషణుడు ఆ బాలబ్రహ్మచారిని బ్రతిమాలి, తాను సంధ్య వార్చుకుని వచ్చేంతవరకు విమానాన్ని పట్టుకుని ఉండాల్సిందిగా చెప్పి, సంధ్యవార్చుకునేందుకై వెళ్లాడు. దానిని తీసుకున్న బాల బ్రహ్మచారి కొన్ని ఘడియలు మాత్రమే పట్టుకుంటానని, సమయం మించితే కింద పెట్టేస్తానని చెప్పాడు. అలాగే విభీషణుడు తిరిగి వచ్చేసరికి సమయం మించిపోవడంతో బాలబ్రహ్మచారి విమానాన్ని కింద పెట్టేశాడు. అది అక్కడ భూమికి అతుక్కుపోయింది.
ఇంతలో విభీషణుడు పరుగెత్తుకుంటూ రావడాన్ని చూసిన బాలబ్రహ్మచారి అక్కడకు దగ్గరలోని కొండపైనున్న వినాయకుని గుడిలో దాక్కున్నాడు. కోపంతో వూగిపోయిన విభీషణుడు, వినాయకుని గుడిలోకి వెళ్ళి, ఆ బాలబ్రహ్మచారి తలపై గట్టిగా ఒక్క మొట్టికాయ వేశాడు. ఆ దెబ్బకు బ్రహ్మచారి తలపై సొట్ట పడింది. ఇంతకీ ఆ బాలబ్రహ్మచారి సాక్షాత్తూ వినాయకుడే. ఇప్పటికీ వినాయకుని విగ్రహంపై సోట్టను చూడవచ్చు. బాలబ్రహ్మచారి కింద పెట్టిన విమాన విగ్రహాలు కొలువైన ప్రాంత్రం శ్రీరంగంగా ప్రసిద్ధి చెందగా, బాలబ్రహ్మచారి దాక్కున్న కోవెల తిరుచ్చిలోని ఉచ్చి పిళ్ళైయార్ కోవెలగా ప్రసిద్ధి చెందింది. వినాయకుడిని తలపై కొట్టిన విభీషణుడు, రంగనాథస్వామి పాదాలపై పడి లంకకు తనతో రమ్మని ప్రాధేయ పడ్డాడు. అయితే స్వామి అందుకు సమ్మతించక, తాను అక్కడే ఉండిపోనున్నట్లు, సంవత్సరంలో ఒకసారి ఇక్కడకు వచ్చి తనను ఆరాధించ వచ్చని చెబుతాడు. విభీషణుడు స్వామికి ప్రణమిల్లి లంకా నగరానికి వెళ్ళిపోతాడు. ఇప్పటికీ శ్రీరంగం ఆలయంలోని సప్తప్రాకారాల్లోని మొదటి ప్రాకారంలో విభీషణుని ఆలయాన్ని చూడవచ్చు. అప్పట్నుంచి భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి ఆత్యంత వైభవంగా జరుపబడుతోంది.
వైష్ణవ దేవాలయాలలో మామూలు రోజులలో అయితే ఉత్తరద్వారాలను మూసి ఉంచుతారు. ముక్కోటి ఏకాదశిరోజున మాత్రం తెరచి ఉంచుతారు. మన రాష్ట్రంలోని తిరుపతి, భద్రాచలం మొదలైన క్షేత్రాలలో వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. తిరుపతిలో ఈరోజు శ్రీవారిసన్నిథిన రావత్తు తోడక్కం జరుగుతుంది. నమ్మాళ్వారు విరచితమయిన భగవద్విషయమనబడే దివ్యప్రబంధంలోని నాలుగవ ఆయిరం అధ్యయనం జరుగుతుంది. వేదపారాయణం తోడక్కం తరువాత జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దేవస్థానం చుట్టూవున్న చూళిక ద్వారాలు తెరుబడుతాయి. భక్తులు ఈ చూళిక నుంచి ప్రదక్షిణలు చేస్తుంటారు.ఏకాదశిరోజున ఉపవాసాన్ని పాటించాలి. ఈ రోజున ఉపవాసాన్ని పాటించడం వల్ల సూర్య, చంద్రగ్రహణ సమయంలో చేసే దానం, అశ్వమేథయాగం చేసిన ఫలితాలకంటే అధికపలం లభిస్తుంది. ఉపవాసం చేయలేనప్పుడు వాయుభక్షణం, అదీ పాటించకలేకపోతే నీరు, పాలు, పండ్లను తీసుకోవచ్చు. అలా కుదరనప్పుడు ఒక్కపొద్దు అంటే, ఒంటిపూట భోజనం చేయవచ్చు. సుఖ సంతోషాలను పంచే పండుగ వైకుంఠ ఏకాదశి.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Vaikuntha Ekadashi feature